Idream media
Idream media
తలాతోకా, ముక్కూమొహం లేని గ్యాంగస్టర్ స్టోరీని ఎపుడైనా చూశారా? సాహో ఉంది కదా అంటారా? దాంట్లో కనీసం అనేక మంది విలన్లు ఉంటారు, ప్రభాస్ వుంటాడు, కటౌట్ చూసి కొంచెమైనా నమ్మాలి. ఆ లోటు తీర్చడానికి ధనుష్ “జగమే తందిరం” వచ్చింది. కాకపోతే థియేటర్‌లో వచ్చింటే జనం కరోనా కంటే ఎక్కువ భయపడేవాళ్లు. అదృష్టం కొద్ది నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది. తెలుగులో కూడా ఆడియో ఉంది.
గ్యాంగస్టర్ స్టోరీలు మనకు కొత్త కాదు. గాడ్‌ఫాదర్ నుంచి వున్నాయి. అంతకు ముందు కూడా వున్నాయి కానీ, గాడ్‌ఫాదర్ ఒక ల్యాండ్ మార్క్. ఈ ప్రేరణతో మణిరత్నం కూడా నాయకుడు తీశాడు. రాంగోపాల్‌వర్మ ఎన్ని తీశాడో ఆయనకే గుర్తు లేదు. మనం కనుక్కోలేదు కానీ, ఒకే సినిమానే చాలా సార్లు తీశాడు.
ప్రతి మనిషికి ఒక ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం ఉంటుంది. 90 శాతం మంది బతుకు కోసం ఊరు వదిలేస్తారు. దేశాన్ని కూడా వదిలేస్తారు. పరాయి చోట జీవించడానికి ఎంతో మంది యుద్ధం చేస్తారు. జీవితానికి భద్రత లేనప్పుడు గ్యాంగ్‌వార్స్, మాఫియాలు పుడుతాయి. అమెరికాలో జరిగింది ఇదే. ఇటలీ, మెక్సికో, లాటిన్ అమెరికన్ దేశాల నుంచి అక్రమ వలస వచ్చిన వారి మధ్య ఘర్షణ. స్థాన బలం కోసం పోరాటం.
బొంబాయిలో మరాఠీలు, గుజరాతీల మధ్య యుద్ధం. బతకడానికి వెళ్లిన తమిళుల గాడ్‌ఫాదర్‌గా వరదరాజ ముదలియార్, ముస్లింల రక్షకుడిగా హజీమస్తాన్. గ్యాంగ్ వార్స్ వెనుక. బతకలేని తనం , క్రూరత్వం , హీరోయిజం , చట్టాల వైఫల్యం ఎన్నో వుంటాయి. ఈ సున్నితత్వాన్ని, లైఫ్‌ని పట్టుకున్న సినిమాలు ఆడతాయి. దారి తప్పిన సినిమాలు మనల్ని తింటాయి.
జగమే తందిరంలో పాయింట్ బలమైంది. చెప్పిన తీరు చెత్త. ధనుష్ వీరాభిమానుల్ని కూడా జడిపిస్తుంది. లండన్‌లో శరణార్థుల సమస్య ఎప్పటి నుంచో వుంది. ఒక దశలో LTTE కీలక నాయకులు, ఫండ్ రైజర్స్ అక్కడి నుంచే నడిపించారు. తమిళ శరణార్థులకి రక్షణగా శివదాస్, శరణార్థుల్ని ద్వేషించే పీటర్‌లతో లండన్‌లో ఈ సినిమా మొదలవుతుంది. బిగినింగ్ మార్టిన్ స్కోర్ సెసి, క్వింటెన్ టరంటెన్ సినిమాల లెవెల్‌లో వుంటుంది. మంచి సినిమా చూస్తున్నామనే ఆశ కలుగుతుంది. తర్వాత ధనుష్ Entry. ఇంకేముంది ఒక మర్డర్, పిచ్చిపాట. హీరోకి ఒక వ్యక్తిత్వం లేకుండా కేవలం బిల్డప్ మాత్రమే ఉంటే ఎంత దరిద్రంగా వుంటుందో అర్థమయ్యేలోగా భీకరమైన లెవెల్ చూపిన పీటర్‌కి శివదాస్‌ని ఎదుర్కోడానికి ఒక తమిళ గ్యాంగ్‌స్టర్ అవసరమై అనవసరంగా తన మనిషికి టికెట్ పెట్టి మధురై పంపిస్తాడు. అయినా గన్ చేతిలో వుంటే తమిళ్ తెలియాల్సిన పనేముంది.
లాజిక్‌లు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దగ్గర పనిచేయవు. మన హీరో తోపు కాబట్టి లండన్ వెళ్తాడు. ఇంతకీ మన హీరో మధురైలో ఏం చేస్తూ వుంటాడంటే పరోటా హోటల్ పెట్టుకుని ఊళ్లో గొడవలు పడుతుంటాడు. అక్కడికి వెళ్లి శివదాస్ సంగతి చూస్తానని పీటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. పీటర్ మన పాత సినిమాల్లో రాజనాల, నాగభూషణంలా తెలివిలేని టైప్.
పోనీ శివదాస్ ఏమైనా తెలివైన వాడా అంటే ఆయన శవపేటికల్లో , పెళ్లికి అలంకరించే బొమ్మల్లో బంగారం పెట్టి స్మగ్లింగ్ చేస్తుంటాడు (ఇవన్నీ మన చిన్నప్పుడే కృష్ణ సినిమాల్లో చూసేశాం. కొత్త ఐడియాలు కూడా లేకపోవడం నేరం). గాడ్‌ఫాదర్‌లో రాజీకి పిలిపించి రివాల్వర్ దాచి పెడతారే, ఆ నికృష్టమైన పాచిపోయిన కుట్రతో శివదాస్‌ని చంపేస్తారు.
మధ్యలో హీరోయిన్ కూడా వుంది. ఆమె ద్వారా తమిళ శరణార్థుల ప్లాష్‌బ్యాక్. అది విని హీరో మారిపోయి తుపాకులు, నాటు బాంబులు తీసుకుని పీటర్ ఇంటి మీద దాడి చేసి విలన్ ఆట కట్టిస్తాడు. దీన్ని రెండున్నర గంటలు చూడాలి. థియేటర్‌లో అయితే Exit దగ్గర తొక్కిసలాట జరిగేది. మన ఇల్లు , మన ఫోన్, మన టీవీ కాసేపు నిద్రపోయి కూడా చూడొచ్చు. సినిమా సమీక్షకుల్ని కరోనా కూడా ఏం చేయలేదు. ఇమ్యూనిటీ ఎక్కువ.
ఈ సినిమాని ఎంతోకొంత భరించడానికి కారణం అద్భుతమైన ఫొటోగ్రఫీ, లండన్ లొకేషన్స్, కానీ అంతా వేస్ట్. ధనుష్ మంచి నటుడే, కార్తిక్ సుబ్బరాజు మంచి డైరెక్టర్ కాదు, అదీ ప్రాబ్లమ్. ఎవడి మీదైనా పాత కక్షలుంటే వాడిని కుర్చీకి కట్టేసి దీన్ని చూపిస్తే చాలు. రక్తపాతం లేకుండా పగ చల్లారుతుంది.