iDreamPost
android-app
ios-app

ఇక ముందడుగు వేయాల్సింది టాలీవుడ్డే

  • Published Jul 18, 2020 | 9:09 AM Updated Updated Jul 18, 2020 | 9:09 AM
ఇక ముందడుగు వేయాల్సింది టాలీవుడ్డే

థియేటర్ల తెరిచివేత ఎప్పుడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అటు చూస్తేనేమో బాలీవుడ్ లో వరసగా ఓటిటి ద్వారా చిన్న హీరోల నుంచి స్టార్ల దాకా అందరి సినిమాలు రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, నవాజుద్దీన్ సిద్దిక్, జాన్వీ కపూర్, రాధికా ఆఫ్టే ఇలా ఇమేజ్ ఉన్న ఆర్టిస్టుల చిత్రాలే నేరుగా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మరోవైపు తమిళ్ లోనూ వీటి దూకుడు పెరుగుతోంది. కీర్తి సురేష్, జ్యోతిక, వైభవ్, ధనుష్ ఇలా ఒక్కొక్కరుగా రాజీబాట పడుతున్నారు. కొన్ని ఇప్పటికే వచ్చేశాయి కూడా. కానీ తెలుగులో మాత్రం డిజిటల్ అడుగులు చాలా నెమ్మదిగా ఉన్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా రిలీజైన వాటిలో అన్ని లో బడ్జెట్ సినిమాలే. పెద్దగా బజ్ ఉన్నవేవి లేవు.

అందుకే స్పందన కూడా భారీగా లేదు. ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్దంగా ఉన్నవాటిలో క్రేజీ సినిమాలు ఉన్నప్పటికీ నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వీటి విషయంలో ఎవరు ముందడుగు వేస్తారా అని మిగిలిన ప్రొడ్యూసర్లు ఎదురుచూస్తున్నారు కానీ ఆ సాహసం మాత్రం ఎవరూ చేయలేకపోతున్నారు. దీనికో కారణం ఉంది. ఆయా సినిమాల్లో నటించిన హీరో హీరోయిన్లు ఓటిటి రీలీజ్ కు ఒప్పుకోకపోవడమే. ఒకవేళ వాళ్ళ మాటను కాదని ముందుకెళ్లినా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎస్ అనక తప్పదు. అనుష్క ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే నిశ్శబ్దం డిజిటల్ రిలీజ్ డిస్కషన్లు ఊపందుకున్నాయని మొన్నటి నుంచి కొత్త టాక్ నడుస్తోంది. వి విషయంలో దిల్ రాజు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

నిన్నటి నుంచి సడన్ గా ఒరేయ్ బుజ్జిగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. కారణం ఏమై ఉంటుందో. రామ్ రెడ్ మాత్రం ఓన్లీ థియేటర్స్ అనే కృత నిశ్చయంతో ఉంది. ఇంకొద్ది రోజుల్లోనే సినిమా హాళ్లు తీస్తారన్న గట్టి నమ్మకంతోనే టాలీవుడ్ ఇప్పటిదాకా వేచి చూసే ధోరణిని కొనసాగిస్తూ వచ్చింది. కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి కదలికలు కనిపించడం లేదు. ఇప్పటికే నాలుగో నెల గడుస్తోంది. గిల్డ్ లో ఉన్న ప్రొడ్యూసర్లందరూ రెగ్యులర్ టచ్ లో ఉంటూ దీనికి సంబంధించి ఆన్ లైన్, ఫోన్ ద్వారా చర్చలు జరుపుతున్నప్పటికీ ఎవరూ ఎలాంటి కంక్లూజన్ ఇవ్వలేకపోతున్నారట. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ కదలిక వచ్చేందుకు కొంచెం టైం పట్టేలా కనిపిస్తోంది. హిందీలో 15 పైగా సినిమాలు ఓటిటికి ఓటేసిన తరుణంలో టాలీవుడ్ లో ఓ పెద్ద అడుగు పడితేనే పరిణామాలు వేగంగా ఉంటాయి.