iDreamPost
android-app
ios-app

హ్యాపీ బర్త్ డే సచిన్ …

హ్యాపీ బర్త్ డే సచిన్ …

అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీల వీరుడు,భారత లెజెండ్ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్ ఇవాళ తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సుదీర్ఘంగా 24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన సచిన్ టెండూల్కర్ ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.16 ఏళ్లకే సచిన్‌ భారత జట్టులో స్థానం సంపాదించి పాకిస్థాన్‌ మీద అరంగేట్రం చేశారు.

కరోనా వైరస్ నేపద్యంలో ఈ రోజు తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండి ఇంట్లోనే గడుపుతున్నాడు.కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న వారి గౌరవార్థం ఈ ఏడాది తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టు సచిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే సచిన్ జన్మదిన సందర్భంగా తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో సాధించిన కొన్ని రికార్డులను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం.

  •  అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 684 మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడు సచిన్‌.
  •  మొత్తం 782 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన 34357 పరుగులు సాధించాడు.ఇందులో 164 అర్థసెంచరీలు,100 సెంచరీలు చేసి      అనితర సాధ్యమైన రికార్డు నెలకొల్పాడు.
  •  2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 147 బంతులలో 200 పరుగులు చేసి వన్డేలలో డబుల్ సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు.
  • 1998లో వన్డేలలో క్యాలెండర్ సంవత్సరంలో 1894 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రికార్డు తన సొంతం చేసుకున్నాడు.
  •  ఒక క్రికెట్ వార్షిక సంవత్సరంలో 12 శతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌.
  •  అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడిన ఘనత కూడా మాస్టర్‌ బ్లాస్టర్‌దే.
  •  2003 ప్రపంచ కప్‌లో టెండూల్కర్ సాధించిన 673 పరుగులు ఐసీసీ టోర్నీలో ఒక బ్యాట్స్‌మన్‌ సాధించిన అత్యధిక పరుగులు కావడం విశేషం.
  • ప్రపంచ కప్‌లో 2278 పరుగులు సాధించిన ఏకైక అంతర్జాతీయ క్రికెటర్‌గా ఐసీసీ టోర్నీ చరిత్రలో రికార్డులకెక్కాడు.
  •  ఇక అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసిన ఒకేఒక్క బ్యాట్స్‌మన్‌ టెండూల్కర్ మాత్రమే.
  •  అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 76 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు సాధించడమే గాక, 20 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ విజేతగా  కూడా నిలవడం ‘గార్డ్ ఆఫ్ ద క్రికెట్’ సచిన్‌కే చెల్లింది.
  • ఐపీఎల్‌లో 63 ఇన్నింగ్స్‌లలో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌.క్రేజీ టోర్నీలో మొత్తం మీద అత్యంత  వేగంగా ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌ సచిన్.

2012 మార్చ్ 18 న వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్, 2013 అక్టోబర్‌లో టీ20ల నుంచి, 2013 నవంబర్‌ 16న టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.