iDreamPost
iDreamPost
లవకుశ, అడవిరాముడు, ప్రేమభిషేకం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, మంగమ్మ గారి మనవడు, పోకిరి, మగధీర మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి సినిమాలు నిఖార్సైన విజయంతో అవి విడుదలైన సమయంలో 175 రోజులకు పైగా నిర్విరామంగా ఆడినవి. ప్రేక్షకులు పదే పదే థియేటర్లకు వెళ్లి మరీ వీటిని ఎంజాయ్ చేసేవాళ్ళు. సరే కాలక్రమేణా ఇంత ఘనమైన రన్ లకు చెల్లుచీటీ పడిపోయింది. మొదటి వారం లేదా నెలలో ఎంత రాబట్టుకోగలం అనే దాని మీదే నిర్మాతలు దృష్టి పెడుతుండటంతో క్రమక్రమంగా సిల్వర్ జూబ్లీ పోస్టర్లు మాయమయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ళలకు ఈ పదాన్ని కరోనా పుణ్యామాని వాడాల్సి వస్తోంది.
అవును. ఈ రోజుతో సినిమా హాళ్ళు మూతబడి 175వ రోజు. కరోన ప్రభావం అంతో ఇంతో తగ్గి దాదాపు అన్ని రంగాలకు సడలింపు ఇచ్చినా థియేటర్ల గేట్లు తెరవడానికి మాత్రం ప్రభుత్వం నో అంటోంది. వీటి మీద ఆధారపడిన లక్షలాది కుటుంబాలు, యాజమాన్యాలు ఆలో లక్ష్మణా అని దీనంగా ఆర్తనాదాలు చేసే పరిస్థితి. ఏదో ఒకటి రెండు నెలలు మూతబడితే కష్టకాలమని సర్దుకోవచ్చు కానీ ఇలా ఇన్నేసి రోజులంటే ఆ బాధ మాటల్లో చెప్పేది కాదు. గతంలో కొన్ని వందల సార్లు హీరోల అభిమానులు థియేటర్లలో జరిపే శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనే వాటి ఉద్యోగులు ఇప్పుడు ఇళ్ళలోనే ఉంటూ దేవుడా మమ్మల్ని కరుణించు అని వేడుకోవాల్సి రావడం నిజంగా శోచనీయం.
పోనీ అక్టోబర్ నుంచైనా అనుమతులు ఇస్తారా అంటే ప్రస్తుతానికి అలాంటి సంకేతాలు ఏమి కనిపించడం లేదు. టికెట్ కౌంటర్ల దగ్గర సందడిగా జనం నిలబడి ఒకరితో మరొకరికి సంబంధం లేని కొన్ని వందల మంది సినిమా అనే వేడుకను ఒకేచోట గుమికూడి చూడటం ఎంత నిండుగా ఉండేదో. ఇప్పుడవన్నీ దూరమయ్యాయి. మునుపటి వైభవం కోసం ఎదురు చూడని ప్రేక్షకుడు లేడు. దైవాన్ని వేడుకొని ఇండస్ట్రీ వ్యక్తి లేడు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. సేవ్ సినిమా లవ్ థియేటర్స్ అంటూ ఎంతగా సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నా అసలు జాలి చూపాల్సింది మాత్రం కరోనా రాక్షసినే. అది ఉన్నంత కాలం ఇలాంటి విషాద గీతాలు తప్పేలా లేవు. శుక్రవారంతో ముడిపడిన సినిమా విడుదల సెంటిమెంట్ నాడే ఇలా 175వ రోజు గురించి మాట్లాడుకోవాల్సి రావడం విధి లిఖితం.