iDreamPost
iDreamPost
మనకున్న సీనియర్ హీరోల్లో అఘోరాగా కనిపించిన వాళ్ళు చాలా తక్కువ. ఒక్క నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాత్రమే ఎప్పుడో ముప్పై ఐదేళ్ల క్రితం వచ్చిన కాష్మోరాలో ఈ గెటప్ వేసి భయపెట్టాడు. యండమూరి వీరేంద్రనాధ్ రాసిన నవల ఆధారంగా రూపొందిన ఆ హారర్ థ్రిల్లర్ కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు కానీ ఎప్పుడూ చూడని కోణంలో రాజేంద్రుడు నిజంగా భయపెట్టినంత పని చేశాడు. ఆ తర్వాత నేనే దేవుణ్ణిలో ఆర్య అలాంటి క్యారెక్టర్ చేశాడు కానీ ఆరవ డబ్బింగ్ కావడంతో మనవాళ్లకు అంతగా కనెక్ట్ కాలేదు. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఆ వేషం చేసిన ఒకే ఒక్క స్టార్ నందమూరి బాలకృష్ణ మాత్రమే. అది కూడా బోయపాటి శీను సినిమా కోసం.
నిజానికి ఈ గెటప్ కు సంబంధించిన ఎపిసోడ్స్ ని లాక్ డౌన్ కు ముందు షూట్ చేశారు. కానీ ఎందుకో అవి అంత సంతృప్తికరంగా రాకపోవడంతో పాటు ప్రేక్షకుల్లో ఏమైనా నెగటివ్ అభిప్రాయం కలుగుతుందేమోనన్న ఆలోచనతో దాన్ని పక్కనపెట్టేసి కథలో కొన్ని మార్పులు చేసి వేరే సీన్లను రీ షూట్ చేశారు. సుమారు పావు గంట దాకా అఘోరా తాలూకు సన్నివేశాలు ఉంటాయని ఇన్ సైడ్ టాక్. మేకర్స్ వద్దనుకున్నారు కానీ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం వీటిని చూడాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఇప్పుడు సినిమాలో పెట్టడం సాధ్యం కాదు. అందుకే ఏం చేయాలనే దాని మీద బోయపాటి తర్జనభర్జన పడుతున్నారట.
ఒకవేళ సినిమాలో నేరుగా ఉంచకపోయినా ఎండ్ టైటిల్ కార్డ్స్ లోనో లేదా ఒక రెండు వారాలు అయ్యాక బోనస్ అట్రాక్షన్ కింద జోడించడమో ఏదో ఒకటి చేయొచ్చు. ప్రస్తుతం అడవి నేపథ్యంలో షూట్ తో బిజీగా ఉన్న యూనిట్ చేతిలో ఉన్న 58 రోజుల్లోనే ప్రమోషన్ తో సహా మొత్తం పూర్తి చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 28న రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు బోయపాటి శీను. ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ డిజాస్టర్ల తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో ఉన్న బాలకృష్ణ అభిమానులకు ఇది ఖచ్చితంగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇంకా టైటిల్ ప్రకటించాల్సి ఉంది.