iDreamPost
android-app
ios-app

పంజాబులో కమలానికి కష్టకాలమే!

  • Published Jul 02, 2021 | 12:08 PM Updated Updated Jul 02, 2021 | 12:08 PM
పంజాబులో కమలానికి కష్టకాలమే!

ఆకాలీదళ్ తో సుమారు రెండున్నర దశాబ్దాల అనుబంధం తెగిపోవడంతో పంజాబులో కమలం ఎన్నికల ముంగిట కష్టాల బురదలో కూరుకుపోయింది. ఏడాది క్రితం వరకు ఆకాలీదళ్ ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉండేది. రెండు పార్టీలు కలిసి పోటీ చేసి 2017 వరకు పంజాబులో పాలన సాగించాయి. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యాయి. కాగా కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలు బీజేపీ, ఆకాలీదళ్ మధ్య చిచ్చు పెట్టాయి. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది క్రితం ఎన్డీయే నుంచి ఆకాలీదళ్ వైదొలగింది. అప్పట్లో దీన్ని పెద్దగా పట్టించుకోని బీజేపీకి మరి కొద్ది నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆ కష్టం, నష్టం ఏమిటో తెలిసొస్తోంది. ఆకాలీలతో కలిసి గతంలో అధికారం చెలాయించిన బీజేపీ.. మార్చిలో జరిగే ఎన్నికల్లో ఒంటరిగా గెలవడం మాట అటుంచి రెండో స్థానమైనా దక్కించుకోగలదా అన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లోనే కనిపిస్తోంది.

చెదిరిన ఓటు బ్యాంకు

పంజాబులో సంఖ్యాపరంగా జాట్లు, దళితులే ఎన్నికల్లో ఫలితాల నిర్దేశకులు. మొత్తం ఓటర్లలో జాట్లు 25 శాతం ఉండగా.. దళితులు 32 శాతం వరకు ఉన్నారు. జాట్లలో అత్యధిక శాతం రైతులే. సంప్రదాయంగా వారంతా మొదటి నుంచీ ఆకాలీదళ్ తో ఉంటారు. కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలను వీరంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందునే ఎన్డీయే నుంచే ఆకాలీదళ్ బయటకు వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఆ వర్గం ఓట్లు బీజేపీకి దక్కే అవకాశమే లేదు. మరో మెజారిటీ వర్గమైన దళితులను ఆకట్టుకునేందుకు బీజేపీ గతం నుంచీ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే అవి ఎంతవరకు ఫలిస్తాయి.. ఎన్ని ఓట్లు రాలుస్తాయన్న ది బీజేపీ నేతలే చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్, ఆకాలీదళ్ కూడా ఈ ఓట్లను భారీగా చీల్చే అవకాశాలు ఉన్నాయి. కమలం ఎదుర్కొంటున్న మరో ముఖ్య సమస్య పార్టీలో సిక్కు నేతల కొరత. ఇన్నాళ్లు ఆకాలీదళ్ అండగా ఉండటంతో.. ప్రత్యేకించి తమ పార్టీలో సిక్కు నేతలను ప్రోత్సహించే అవసరం బీజేపీకి లేకపోయింది. సిక్కుల రాజ్యమైన పంజాబులో ఆ వర్గం నేతలు లేకుండా ఓట్ల కోసం ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్నది సమస్యగా మారింది.

సీఎం స్థాయి నేతలూ కరువే

వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ఆకాలీదళ్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరగడం ఖాయం. కాంగ్రెసుకు ప్రస్తుత సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎలాగూ సీఎం అభ్యర్థిగా ఉంటారు. ఆకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాష్ సింగ్ బాదల్ ఆ పార్టీ
సీఎం అభ్యర్థి. వారిద్దరూ బలవంతులే. అయితే ఆ రెండు పార్టీలతో పోటీ పడుతున్న బీజేపీకి వారిని ఢీకొట్టి సవాల్ చేసే స్థాయి ఉన్న నేతలెవరూ లేరు. ఈ అంశాలే ఇప్పుడు బీజేపీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. రైతు చట్టాలపై నెలకొన్న వ్యతిరేకతను చల్లార్చడం, సిక్కు వర్గాన్ని సమీకరించడం, సీఎం అభ్యర్థిని వెతికి పట్టుకోవడం పంజాబులో బీజేపీని కలవరపరుస్తున్న సవాళ్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ రాష్ట్ర నేతలను ఢిల్లీ రప్పించుకొని కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఈ సవాళ్ళను అధిగమించి బీజేపీని అధికారంలోకి తేవడం మాత్రం అంత సులభసాధ్యం కాదు.

Also Read : మోడీ క్యాబినెట్ లో చోటు లేని ఆంధ్రప్రదేశ్? ఏపీ కి మళ్లీ మొండిచేయి!