iDreamPost
iDreamPost
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పకు ఆదాయ పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఆయన సన్నిహితులపై దాడులు జరిపింది. బెంగళూరు నగరంలోని సుమారు 50 ప్రాంతాల్లో ఏక కాలంలో జరిగిన ఈ దాడుల్లో యడ్డీ సన్నిహితుడైన ఆయన పిఏ ఉమేష్ నివాసం కూడా ఉండటం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జూలైలో సీఎం పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్ప అప్పటి నుంచీ తన రెండో కుమారుడు బి.ఎస్.విజయేంద్రకు ప్రభుత్వంలో కీలక పదవిని కోరుతున్నారు. దానికి బదులు ఐటీ దాడులు జరగడం.. ప్రధానంగా యడ్డీ హయాంలో నీటిపారుదల కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇవి జరగడం చర్చనీయాంశంగా మారింది.
300 మంది బృందాలుగా..
ఈ ఉదయం నుంచే ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు మొదలుపెట్టారు. సుమారు 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి.. యడ్యూరప్ప కుటుంబానికి సన్నిహితులుగా భావిస్తున్న వ్యాపారవేత్తలు, నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల నివాసాలు, కార్యాలయాలున్న సుమారు 50 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. వీరిలో యడ్డీ వద్ద పిఏగా పనిచేసిన ఉమేష్ నివాసాలు కూడా ఉండటం విశేషం. ఉమేష్ తోపాటు ఆయన బంధువులకు చెందిన ఆరు ప్రాంతాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు 120కి పైగా కార్లు సీజ్ చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : బద్వేలు ఉప ఎన్నిక – బీజేపీ అభ్యర్థి ఖరారు
ఎవరీ ఉమేష్?
యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన ఉమేష్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. పూర్వాశ్రమంలో ఇతడు ఓ బస్సు డ్రైవర్. షిమోగా ప్రాంతానికి చెందిన ఈయనకు ఆ ప్రాంతానికే చెందిన బీజేపీ నేత ఆయానురు మంజునాథ్ తో పరిచయం ఏర్పడింది. దాంతో ఆయన వద్ద అసిస్టెంటుగా చేరాడు. అనంతరం యడ్యూరప్ప పెద్ద కుమారుడు, ఎంపీ రాఘవేంద్ర వద్దకు మారాడు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం కార్యాలయంలో పిఏగా చేరాడు. ఆ సమయంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టు వ్యవహారాలన్నీ ఈయన కనుసన్నల్లోనే సాగేవని ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఇరిగేషన్ కాంట్రాక్టు సంస్థల నుంచి వందల కోట్ల ముడుపులు దండుకుని కాంట్రాక్టులు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి.
యడ్డీకి చెక్ పెట్టేందుకేనా..
పార్టీ అధిష్టానం ఒత్తిడితో యడ్యూరప్ప జూలైలో సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో తన రెండో కుమారుడు విజయేంద్రకు కొత్తగా ఏర్పడిన బొమ్మై కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని ఆయన పార్టీ పెద్దలు కోరినా.. వారు దాన్ని పట్టించుకోలేదు. కొడుక్కి పదవి ఇవ్వాలన్న షరతుతోనే తాను పదవిని వదులుకున్నానని.. అందువల్ల విజయేంద్రకు కీలక పదవి ఇవ్వాల్సిందేనని అప్పటి నుంచి యడ్యూరప్ప పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. దాంతో ఆయనకు గట్టి సంకేతాలు పంపి, చెక్ పెట్టడానికే ఐటీ దాడులు చేయించారని కర్ణాటక రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సోదాల నేపథ్యంలో యడ్యూరప్పపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆరోపణల దాడి మొదలుపెట్టారు. యడ్యూరప్ప హయాంలో నీటిపారుదల టెండర్లలో అక్రమాలు జరిగాయని తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నామని, ఐటీ దాడులు తమ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని అంటున్నాయి. అప్పటి కాంట్రాక్టు వ్యవహారాలన్నింటిపైనా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : ఝున్‌ఝున్‌వాలా భేటీల వెనుక కారణాలు ఏంటి?