ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి లో ఉప ఎన్నిక అనివార్యమైంది. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఎప్పుడైనా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. పంచాయతీ ఎన్నికలకు ముందు నుంచే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ స్థానంపై వ్యూహ రచన చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వార్ రూమ్ కూడా ప్రారంభించింది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే అక్కడ ఇల్లు కూడా అద్దెకు తీసుకుని అతి ఎక్కువ రోజులు తిరుపతిలోనే ఉంటున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అక్కడి నాయకత్వంతో తరచూ మాట్లాడుతున్నారు. ఇటీవల రెండు రోజులు పర్యటించి సమావేశం కూడా నిర్వహించారు. మరోవైపు అధికార పార్టీ జగన్ పుట్టిన రోజు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి తమ బలం ఏంటో నిరూపించుకుంది. ఇలా ఎవరికి వారు తిరుపతి లోక్ సభ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.ఇంతలో అనూహ్యంగా పంచాయతీ ఎన్నికలు తెరపైకి వచ్చాయి.
గ్రామ స్థాయిలో ఉన్న పట్టుపైనే ఆయా పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేది కూడా అక్కడే. దీంతో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమ బలాబలాలు నిరూపించుకోవాలని అన్ని పార్టీలూ తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. అంతకు ముందే జిల్లాలో ఏకగ్రీవాలకు చాలా పంచాయతీలు శ్రీకారం చుట్టాయి. చిత్తూరు జిల్లాలో 20 మండలాలు ఉండగా.. 454 పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. వాటిలో 112 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వారిలో 98 మంది వైఎస్ ఆర్ సీపీ మద్దతుదారులే కావడం విశేషం. మిగిలిన 342 పంచాయతీయుల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. వారిలో అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులే విజయం సాధించారు. 264 స్థానాల్లో ప్రజల మద్దతు పొంది సర్పంచ్ లకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ కేవలం 70 స్థానాల్లో మాత్రమే గెలుపొందగా.. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ మద్దతుదారులు ఒక్కో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ మొదటి దశ ఫలితంలోనే ఏ పార్టీ సత్తా ఏంటో తెలిసిపోయింది. వీటి ప్రకారం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోనూ వైసీపీ సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది.
దీనికి తోడు.. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంపై మరింత పట్టు సాధించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీకి ముందే ఆ ప్రాంతం అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. ఇందుకు గాను తాజాగా నియోజకవర్గం పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఆరింటికి రూ.114.44 కోట్లను మంజూరు చేసింది. తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట సెగ్మెంట్లలోని వివిధ పట్టణ ప్రాంతాల్లో పలు పనులు చేపట్టేందుకు మొత్తం రూ.114.44 కోట్లను కేటాయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు.
నోటిఫికేషన్‌కు ముందే ఆయా నియోజకవర్గాల పరిధిలోని వివిధ వార్డుల్లో సీసీ డ్రెయిన్లు, రహదారులు, తాగునీటి పైపులైన్లు తదితరాలకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేపట్టనున్నారు. నిధులు కేటాయించిన 6 సెగ్మెంట్లలో తిరుపతికి అత్యధికంగా రూ.29.19 కోట్లు ఇచ్చారు. తర్వాత గూడూరుకు రూ.25 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.22.50 కోట్లు, నాయుడుపేటకు రూ.17.15 కోట్లు, వెంకటగిరికి రూ.12.95 కోట్లు, శ్రీకాళహస్తికి రూ.7.66 కోట్లు కేటాయించారు. ప్రజలు తమవైపే ఉన్నారని నిర్లక్ష్యం చూపకుండా ఆ ప్రాంతం అభివృద్ధిపై కూడా వైసీపీ దృష్టి సారిస్తోంది. ఇప్పటికే సంక్షేమపరంగా వైసీపీ ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది. దీనికి తోడు తాజా అభివృద్ధి కార్యక్రమాలు ఆ పార్టీకి మరింత మేలు చేయనున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ క్రోడీకరించుకుంటే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ విజయం నల్లేరు మీద నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు.