iDreamPost
iDreamPost
రాజకీయాల్లో ఆరోపణలు,సవాళ్లు సహజమే కానీ విశాఖ రాజకీయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వైఖరీ మరీ హద్దులు దాటుతుంది. తెల్లవారటమే తన కోసం అన్నట్లు తెదేపా అనుకూల మీడియా ఇస్తున్న కవరేజితో రెచ్చిపోయి అధికార పార్టీ మీద ముఖ్యంగా విజయసాయి రెడ్డి మీద నిత్యం ఆరోపణలు చేస్తున్నారు . తన మీద వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలు నిజం కాదని, అవసరం అయితే దేవుడి మీద కూడా ప్రమాణం చేస్తానని వెలగపూడి కొత్త రాగం ఎత్తుకున్నారు .
20 సంవత్సరాల కిందట వెలగపూడి రామకృష్ణ ఎవరు?. ఏ అర్హతతో రాజకీయాలలోకి వచ్చాడు?టీడీపీ టికెట్ ఎలా దక్కింది అన్నది విశాఖ ప్రజలకు తెలుసు. వంగవీటి రంగా హత్యకేసులో ముద్దాయి అయిన వెలగపూడి రామకృష్ణ విజయవాడలో ఇబ్బందులు తలెత్తుతాయని ఉన్న ఊరిని విడిచి అనేక ఊర్లు తిరిగి చివరికి విశాఖపట్టణం చేరాడు . మాజీ రాజ్యసభసభ్యుడు,వ్యాపారవేత్త అయిన ఓ టీడీపీ నేత మద్దతుతో విశాఖ లిక్కర్ సిండికేట్లో ప్రవేశించి అనతికాలంలోనే లిక్కర్ కింగ్ గా వెలగపూడి రామకృష్ణ పేరు తెచ్చుకున్నాడు.విశాఖ నుంచి మొదలు పెట్టి మొత్తం ఉత్తరాంద్రను దాటి ఒరిస్సా వరకు తన లిక్కర్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు రామకృష్ణ .
ఒక వైపు లిక్కర్ , మరో వైపు భూదందాలు చేస్తూ రెండు చేతులతో వందల కోట్లు సంపాదించిన వెలగపూడికి 2009 నియోజకవర్గాల పునఃర్విభజన కలిసొచ్చింది. కొత్తగా ఏర్పడ్డ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తన గాడ్ ఫాదర్ మద్దతుతో టీడీపీ టికెట్ సాధించి ముక్కోణపు పోటీలో స్వల్ప తేడాతో గెలిచాడు. వ్యాపారానికి ఎమ్మెల్యే పదవి తోడు కావటంతో విశాఖలో ఎడాపెడా భూదందాలు చేశాడు .
2014-2019 మధ్య విశాఖ జిల్లాకే చెందిన సీనియర్ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు,గంటా శ్రీనివాసరావు భూ ఆక్రమణల మీద పరస్పర ఆరోపణలు చేసుకొని సిట్ వేసి విచారణ జరపాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు . వారు ఏ స్థాయిలో భూదందాలకు పాల్పడ్డారో వారి ఆరోపణలను చూస్తే తెలుస్తుంది..
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత టీడీపీ నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాదీనం చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వెలగపూడి రామకృష్ణ ఆక్రమించిన ఒక భూమిని రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు . తన భూదందాలకు అడ్డు పడుతున్నాడన్న కక్షతో నిత్యం విజయసాయిరెడ్డి మీద వెలగపూడి రామకృష్ణ ఆరోపణలు చేస్తున్నాడు..
మాటకు ముందు నా చరిత్ర తెలుసుకో అనే వెలగపూడి చరిత్ర తవ్వితే బయటపడేది రంగా హత్య, రౌడీషీటర్ చరిత్ర, మద్యం వ్యాపార అక్రమాలు ,భూదందాలు..
విజయసాయిరెడ్డి మీద ఎందుకు కక్ష?
2019 ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రా అంటే టీడీపీ కంచుకోట అని పేరు. టీడీపీ ఓడిపోయిన ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్ర నుంచి ఆపార్టీకి మంచి సంఖ్యలోనే సీట్లు వచ్చేవి. కానీ మొన్నటి 2019 ఎన్నికల్లో 34 స్థానాలున్న ఉత్తరాంధ్రలో టీడీపీ కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలిచింది. నాటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ,సీనియర నేత అశోక్ గజపతి రాజుల సొంత జిల్లా విజయనగరంలో టీడీపీకి ఒక్క సీటు రాలేదు,వైసీపీ జిల్లాలోని మొత్తం తొమ్మిది స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది.
ఇంతటి విజయానికి జగన్ మోహన్ రెడ్డి హవాతో పాటు విజయసాయిరెడ్డి చేసిన ప్రణాళికాబద్ధమైన పని అని టీడీపీ నేతల్లో బలమైన అభిప్రాయం ఉంది. విజయసాయి రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్టణంలోనే నివాసం ఉంటూ వైసీపీని బలోపేతం చేయటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
వెలగపూడికి ఆత్రం ఎందుకు?.
2019లో విశాఖజిల్లాలో టీడీపీ నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది,అది కూడా కేవలం విశాఖపట్టణం నగరంలోనే గెలిచింది. ఆఎన్నికల్లో గెలిచిన సీనియర్ నేత,మాజీ మంత్రి గంట శీనివాస్ రావు పార్టీ మారుతాడని పలుసార్లు వార్తలు వచ్చాయి. ఆయన పార్టీ మారటం మీద ఏమి తేల్చలేదు కానీ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. మరో ఎమ్మెల్యే గణబాబు కూడా అంత క్రియాశీలకంగా లేడు .ఇంకో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి పూర్తిగా దూరమయ్యాడు. ఆయన కొడుకులు వైసీపీలో చేరారు.
దీనితో విశాఖా టీడీపీలో తాను ఎదురులేని నాయకుడినని,తనమాటే చెల్లుబాటు అవుతుందని భావిస్తున్న వెలగపూడి రామకృష్ణ విజయసాయిరెడ్డి, జగన్ ల మీద ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. అక్రమాలు చేయకుంటే వెలగపూడి భయపడవలసిన అవసరం లేదు. వెలగపూడి వ్యవహారం తెలిసినవారు పాపభీతి లేని వెలగపూడి చేసే ప్రమాణాలకు విలువలేదని తేల్చేస్తున్నారు..