iDreamPost
iDreamPost
గన్నవరం..రాజకీయ కేంద్రం. ఆంధ్రప్రదేశ్ లోనే అందరినీ ఆకర్షించే నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కే అవకాశం కనిపిస్తోంది. ఉప ఎన్నికలు ఖాయమా అనే అంచనాలు పెరుగుతున్నాయి. దాని చుట్టూ నియోజకవర్గమంతా చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలోనూ, సాధారణ ప్రజల్లోనూ ఇదే అంశం ఉత్కంఠగా మారింది. నాయకులు ప్రయత్నాలు ప్రారంభించడంతో, సాధారణ కార్యకర్తలు కూడా అదే అంశం చుట్టూ తిరుగుతున్నారు.
గన్నవరం నుంచి మొన్నటి సాధారణ ఎన్నికల్లో వల్లభనేని వంశీ రెండోసారి విజయం సాధించారు. టీడీపీ తరుపున ఆయన గెలిచారు. కానీ ఆ తర్వాత వైఎస్ జగన్ కి జై కొట్టారు. వీలు దొరికిన ప్రతీసారి చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నారు. టీడీపీలోని పలువురు నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన రాజీనామా చేసి, నేరుగా వైఎస్సార్సీపీ టికెట్ పై గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం ఉంది. దానికి అనుగుణంగానే వంశీ అడుగులు కనిపిస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీలో తన పట్టు పెంచుకునే దిశగా ఆయన సాగుతున్నారు. ఆ క్రమంలోనే సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో ఆయన భేటీ అయ్యారు. వారి మధ్య ఉప ఎన్నికల కోసం చర్చ సాగినట్టు ప్రచారం ఉంది. ఆ సందర్భంగా తనకు మద్ధతు ఇవ్వాలని వంశీ కోరగా, అదిష్టానం అభిప్రాయాలకు అనుగుణంగా వెళతానని రామచంద్రరావు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే అధికారికంగా వంశీకి పూర్తిస్థాయిలో పట్టు ఉంది. వైఎస్సార్సీపీ అధిష్టానం అండదండలు కూడా ఉన్నాయి. ఇక క్షేత్రస్థాయిలో వివిధ వర్గాలుగా ఉన్న పార్టీ శ్రేణులను ఆకట్టుకోగలిగితే ఉప ఎన్నికలు కూడా నల్లేరుపై నడకలా మారిపోతాయని ఆయన అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు బాగుంటారు అనే చర్చ మొదలయ్యింది. వెంటనే ఎన్నికలు జరిగితే వంశీ, దుట్టా, యార్లగడ్డ వెంకట్రావులలో ఎవరు సరైన అభ్యర్థి అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఓటింగ్ కూడా పెడుతుండడం విశేషం.
ఇప్పటికే అమరావతి అంశంలో రాజీనామాలు చేయాలని టీడీపీ సవాల్ విసిరింది. తాము చేసేది లేదని చెప్పి, అధికార పార్టీకి డెడ్ లైన్ కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో చంద్రబాబుకి గట్టి షాక్ ఇచ్చేలా అమరావతి ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గన్నవరం ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా చెబుతున్నారు. బాబుకి ఇది పెద్ద గుణపాఠం అవుతుందని కూడా భావిస్తున్నారు. వాస్తవానికి గన్నవరంలో ఇప్పటికీ టీడీపీకి సరైన నాయకత్వం లేదు. వంశీని ఎదురించే సామర్థ్యం ఉన్న వారు కూడా కనిపించడం లేదు. నిజంగా ఉప ఎన్నికలు అనివార్యం అయితే ఇప్పుడున్న స్థితిలో ఆపార్టీకి అగమ్యగోచరమేనని చెప్పవచ్చు. ఇప్పటికే వంశీకి మద్ధతుగా పలువురు టీడీపీ కార్యకర్తలు రాజీనామాలు చేస్తున్నారు. ఉప ఎన్నికల ఊహాగానాలతో మరింత మంది టీడీపీని వీడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి పెద్ద కష్టమే ఎదురుకాబోతున్నట్టు చెప్పవచ్చు.
ఇప్పటికే 23 సంఖ్య గా మిగిలిన పార్టీలో మరికొన్ని స్థానాలు చేజారితే టీడీపీకి ఇక్కట్లు పెరుగుతాయి. అటు విశాఖలో గంటా శ్రీనివాసరావు, ఇటు గన్నవరంలో వల్లభనేని వంశీ రాజీనామాలు చేస్తే అటు కొత్త రాజధాని, ఇటు అమరావతి ప్రాంత ఓటర్ల మనోభావాలను అందరికీ తెలిసేలా చేయవచ్చనే అంచనాలతో అధికార పార్టీ ఉన్నట్టుగా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా గన్నవరం రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి. ఏమైనా వంశీ రాజీనామా చేస్తే మాత్రం పిల్లిక చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టుగా చంద్రబాబు స్థితి మారుతుందని చెప్పక తప్పదు.