Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై విచిత్రమైన చర్చ కొనసాగుతోంది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో టీఆర్‌ఎస్ ఏం చేస్తుందా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో గెలిచాయి. సాధారణ పరిస్థితుల్లోనైతే మజ్లిస్‌తో కలిసి టీఆర్‌ఎస్ పాలక మండలిని ఏర్పాటుకు సుముఖంగానే ఉండేది. కానీ.. ప్రస్తుత రాజకీయ సమీకరణాలతోపాటు త్వరలో జరగనున్న ఖమ్మం, గ్రేటర్ వరంగల్ మునిసి‘పోల్స్’, నాగార్జునసాగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మజ్లిస్‌తో పొత్తుకు ఆ పార్టీ వెనుకంజ వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నిక ప్రక్రియను టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా మరింతకాలం జాప్యం చేయనుందా? తద్వారా ప్రత్యేకాధికారి పాలన తీసుకురానుందా? లేదా సంఖ్యాపరంగా అతి పెద్ద పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ నిర్ణీత గడువులోగా పాలక మండలిని ఎన్నుకుంటుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వేచి చూసే ధోరణిలో టీఆర్‌ఎస్
ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి పూర్తవుతుండగా.. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక జరగకపోతే… ప్రత్యేకాధికారి పాలన అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చేతులెత్తే పద్ధతిలో మజ్లిస్ మద్దతు లేకుండా అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. సంపూర్ణ మెజారిటీ లేకుండా పదవులు అలంకరించొద్దనే భావనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో మజ్లిస్ మద్దతు అడిగి బద్‌నాం కావడమెందుకు? ఏం జరుగుతుందో? కొన్ని రోజులు వేచి చూద్దాం’’ అంటూ పార్టీ కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో అనివార్యంగానే ప్రత్యేకాధికారి పాలన దిశగా అడుగులు పడుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ఇక్కడ మజ్లిస్‌తో కలిసి నడిస్తే.. రానున్న ఖమ్మం, గ్రేటర్ వరంగల్ మునిసిపోల్స్‌తోపాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి ఇదొక అస్త్రంగా మారే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఆ ఎన్నికల్లోనూ ప్రతికూల ఫలితాలు వస్తాయేమోనని అనుమానిస్తోంది.
ప్రత్యేకాధికారుల పాలన అనివార్యమా..?
స్థానిక సంస్థల పాలకమండలి పదవీకాలం ఐదేళ్లు. మొదటి సమావేశం నిర్వహించిన తేదీ నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఈ ప్రకారమే ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10, 2021 వరకు ఉంది. ఫిబ్రవరి 11 నాటికి కొత్త పాలక మండలిని ఎన్నుకోకపోతే… జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకాధికారి పాలన అనివార్యం. సహజంగా గడువు ముగిసే నాటికి ఎన్నికలు జరగని పక్షంలో ప్రత్యేకాధికారుల పాలన విధిస్తారు. అయితే.. ఎన్నికలు జరిగి పాలక మండలి ఏర్పాటు కాకపోయినా… ప్రత్యేక పాలన తప్పదని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే ఈ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు కార్పొరేటర్లుగా అధికారం చెలాయించేందుకు మరి కొంత కాలం ఆగక తప్పదు.