అదేంటో ప్రభాస్ సినిమాల సంగీతానికి బాలీవుడ్ ఫ్లేవర్ ఉంటేనే పాన్ ఇండియా అప్పీల్ వస్తుందనే నమ్మకంతో ఉన్నట్టుంది యువి సంస్థ. లేటెస్ట్ గా వస్తున్న ముంబై అప్ డేట్స్ చూస్తే అదే నిజమనిపిస్తోంది. సాహో మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ ఇలాగే నానబెట్టి ఆఖరికి ముగ్గురు నలుగురితో కొట్టించి దాన్ని ఎటూకాకుండా చేసిన అనుభవం మర్చిపోయినట్టు ఉన్నారు. రాధే శ్యామ్ కు సైతం అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట. అసలు బాహుబలి ఇక్కడే కాదు జపాన్ లాంటి విదేశాల్లో కూడా బ్రహ్మాండంగా అదరగొట్టింది. కీరవాణి దీనికి కంపోజింగ్ చేసినప్పుడు ఆయన కేవలం కథను ఇక్కడి ఆడియన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు. ఫలితం ఎంత గొప్పగా వచ్చిందో చూసాం.
ఇక అసలు టాపిక్ కి వస్తే రాధే శ్యామ్ కి డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకర్ ని సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు చాలా రోజుల క్రితమే అఫీషియల్ గా చెప్పేశారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని మిథున్ తో చేయిస్తున్నారని సమాచారం. అంతే కాదు ఓ కీలకమైన స్పెషల్ సాంగ్ ని కూడా ఇతనితోనే ట్యూన్ చేయించారని ఇన్ సైడ్ న్యూస్. ఈ మిథున్ బాలీవుడ్ లో పాపులర్ కంపోజర్. మరీ చరిత్ర సృష్టించిన ఆల్బమ్స్ చేయలేదు కానీ చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నాయి. మరి ఏరికోరి ఇతన్నే తీసుకోవడంలో ప్రత్యేక కారణం ఏముందో తెలియదు. బహుశా టి సిరీస్ రికమండేషన్ అయ్యుండొచ్చు. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు.
బిజిఎంతో పాటు ఒక పాట మిథున్ ఇవ్వగా మిగిలిన సాంగ్స్ అన్నీ జస్టిన్ ప్రభాకర్ చేశారట. మొత్తానికి దీనికీ మిక్స్ మ్యూజిక్ తప్పేలా లేదుగా. రాధే శ్యామ్ టీజర్ ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కానుంది. దీని కోసం అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలోనే పాట తాలూకు చిన్న బిట్ ఉంటుందట. అన్నింటి కన్నా ఎక్కువగా విడుదల తేదీ ప్రకటిస్తారని ఎదురు చూస్తోంది ట్రేడ్. బిజినెస్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇప్పటికే కొన్ని ఏరియాల డీల్స్ పూర్తయ్యాయి. 14 తర్వాత అన్నీ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకుడు.