ప్రస్తుతం ఉల్లి ధరలు దేశంలో ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉల్లి ధరలపై చర్చ జరపాలని ప్రతిపక్ష టీడీపీ లొల్లి చేస్తున్న తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా హత్యాచార ఘటన తర్వాత మహిళల భద్రతను గురించి అసెంబ్లీలో చర్చ జరగాలని వైసీపీ సభ్యులు చర్చను లేవనెత్తగా ఉల్లి ధరలపై చర్చ జరగాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
వైసీపీ ఎమ్మెల్యే రజని మాట్లాడుతూ దేశంలో ప్రతీ 15 నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతుందని, రోజుకి సగటున 92 అత్యాచారాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మాట్లాడుతుండగా, టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఉల్లి ధరలపై చర్చలు జరగాలని డిమాండ్ చేసారు. మహిళల ప్రాణాల కన్నా ఉల్లి ధరలు ఎక్కువైపోయాయా? అని స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేసారు.
మహిళలు భద్రతపై చర్చను జరగనిస్తారా అడ్డుకుంటారా అని స్పీకర్ టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. మహిళల భద్రతపై చర్చ జరిగితే,టీడీపీ సభ్యుల జాతకాలు బయటపడతాయని భయపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రజనీ టీడీపీ సభ్యులను ఎద్దేవా చేసారు. చంద్రబాబుకు ఆడబిడ్డ ఉంటే మహిళలు పడే బాధ తెలిసి ఉండేదని,టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆడవారిపై అనేక దాడులు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే రజనీ తెలిపారు.
టీడీపీ సభ్యులు మహిళ భద్రతపై చర్చించకుండ ఉల్లిపై చర్చించాలని ప్రయత్నించడాన్ని నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రంగా తప్పు పట్టారు. దిశా ఘటనతో మహిళలందరూ తల్లడిల్లిపోయారని రోజా తెలిపారు. ఉల్లిపై చర్చకు అవకాశం ఇస్తామని తెలిపినా టీడీపీ సభ్యులు వినడం లేదని రోజా విమర్శించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చర్చిస్తారని బాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేసారు. మహిళలకు భద్రతా లేదని అందరూ బాధపడుతుంటే బాబుకు పప్పులో ఉల్లిపాయ లేదని బాధపడుతున్నారని చంద్రబాబును రోజా దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ విజయవాడ కేంద్రంగా కొనసాగిందని రోజా గుర్తు చేసారు. న్యాయం ఆలస్యమైతే అన్యాయం అవుతుందని, మహిళలు తిరగబడితే ఏం జరుగుతుందో అందరికి తెలుసనీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.
మహిళల భద్రతపై చర్చను దారి మళ్లించి ఉల్లి ధరలపై చర్చించడానికి ప్రయత్నాలు చేసిన టీడీపీ సభ్యుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల పట్ల చులకన భావం ఉండటం వల్లనే టీడీపీ సభ్యులు చర్చను దారి మళ్లించడానికి ప్రయత్నించారని ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. ఏది ఏమైనా టీడీపీ సభ్యులు నేడు అసెంబ్లీ సమ్బవేశంలో వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం అవుతుంది అనడంలో సందేహం లేదు. .