Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ చాలా రోజుల తర్వాత ఆందోళన కు సిద్ధమవుతోంది. కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్ తో సాధన పేరుతో నిరసన దీక్షలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొద్ది రోజుల కిందట పిలుపు ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లోనూ ఈ దీక్ష చేపట్టాలని శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కానీ, దీక్ష ముందు రోజు వరకూ ఆ స్ఫూర్తి చాలా నియోజకవర్గాల్లో కనిపించ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి టీడీపీలో కాస్తయినా జవసత్వాలు నింపాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీక్ష కోసమే బాబు విజయవాడ చేరుకున్నారు.
అన్ని నియోజకవర్గాలలోనూ దీక్షలు జరుగుతాయా, లేదా అనే సందేహం టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు వైసీపీ గూటికి చేరారు. సెకండ్ గ్రేడ్ నేతలు ఉన్నప్పటికీ వారు ఆశించిన స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. కరోనా తో ఏడాదిన్నర కాలంగా నిర్ధిష్టమైన ప్రణాళికతో టీడీపీ చేపట్టిన కార్యక్రమం ఏదీ లేదు కాబట్టి ఆ పార్టీ లోపాలు బహిర్గతం కాలేదు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపడానికి బాబు ఈ దీక్షను ఎంచుకున్నారు. కానీ, కరోనా కట్టడిలోనూ, బాధితులను ఆదుకోవడం లోనూ, అమ్మనాన్నలను కోల్పోయిన అనాథలను ఆదుకోవడంలోను ఏపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇటువంటి క్రమంలో కరోనా నియ్రంణలో ప్రభుత్వం విఫలమైందంటూ దీక్ష చేపట్టడంపై స్పందన వస్తుందా, లేదా అనే సందేహాలు ఆ పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి.
హైదరాబాద్ నుంచి ఆన్ లైన్ సమావేశాలు, ప్రకటనలకే పరిమితమైన చంద్రబాబు ఈ దీక్ష కోసం ఏపీకి వస్తారా, లేదా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే, దీక్షలో పాల్గొనేందుకు బాబు విజయవాడ చేరుకున్నారు. నేటి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చంద్రబాబు దీక్షలో కూర్చుంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 15 మంది సీనియర్ నేతలతో కలిసి బాబు దీక్ష నిర్వహిస్తారు. కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్ తో చంద్రబాబు ఈ దీక్షకు దిగుతున్నారు. ఈ సందర్బంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ” కరోనా బాధితులను ఆదుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ తీవ్రతరం చేస్తాం. చంద్రబాబు దీక్షతోనైనా ప్రభుత్వంలో చలనం రావాలి. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు తక్షణ సాయం అందించాలి.” అని అచ్చెన్న డిమాండ్ చేశారు.