iDreamPost
android-app
ios-app

బద్వేల్ బరిలో నిలిచేందుకు ఆపార్టీ భయపడుతోందా?

  • Published Aug 04, 2021 | 2:38 AM Updated Updated Aug 04, 2021 | 2:38 AM
బద్వేల్ బరిలో నిలిచేందుకు ఆపార్టీ భయపడుతోందా?

తెలుగుదేశం పార్టీ పునరాలోచనలో పడింది. త్వరలో జరగబోతున్న బద్వేల్ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో రంగంలో దిగి చేతులు కాల్చుకున్న తరుణంలో ఈసారి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికల్లోనూ ఖంగుతిన్న టీడీపీకి బద్వేల్ లో ఓటమి భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించిన చర్చకు కూడా ఆపార్టీ అధినేత ప్రాధాన్యతనివ్వడం లేదని చెబుతున్నారు.

ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోయిన సమయంలో జరిగే ఉప ఎన్నికలకు ప్రత్యర్థి పార్టీలు పోటీకి దూరంగా ఉండాలనే ఆనవాయితీ కొంతకాలం నడిచింది కానీ దానికి టీడీపీ తిలోదకాలిచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు పోటీ చేసే ఆలోచనకు వచ్చాయి. ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా పోయింది. అందుకు అనుగుణంగానే చంద్రబాబు సీఎంగా ఉన్న నంద్యాల ఉప ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. సర్వశక్తులు ఒడ్డి చంద్రబాబు గట్టెక్కాల్సి వచ్చింది. కానీ ఇటీవల తిరుపతి ఉప ఎన్నికలు పూర్తి భిన్నంగా సాగాయి. టీడీపీ, బీజేపీ కూడా పోటీ పడినా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. తిరుపతి ఎంపీగా వైఎస్సార్సీపీ హ్యాట్రిక్ కొట్టింది. ఈసారి డాక్టర్ గురుమూర్తి భారీ మెజార్టీతో విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు.

Also Read:కాంగ్రెసుకు ‘చిరు’ సాయం అందేనా?

బద్వేల్ నుంచి 2019 ఎన్నికలలో గెలిచిన డాక్టర్ జి వెంకట సుబ్బయ్య హఠాన్మరణంతో ప్రస్తుతం ఈ సీటు ఖాళీ అయ్యింది. అక్కడ ఉప ఎన్నిలకు ఆగష్టు 15 తర్వాత నోటిఫికేషన్ రాబోతోంది. సెప్టెంబర్ లో ఎన్నికలుంటాయనే అంచనాలున్నాయి. ఇప్పటికే తెలంగాణ హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభమయ్యింది. కానీ బద్వేల్ లో మాత్రం అలాంటి జాడే కనిపించడం లేదు. హుజూర్ నగర్ లో విపక్షాలు సందడి చేస్తున్నాయి. అధికార పక్షం పలు కార్యక్రమాలు కూడా చేపడుతోంది. బద్వేల్ లో మాత్రం గత నెలలో సీఎం పర్యటించారు. డివిజన్ కేంద్రంగా బద్వేల్ ని ప్రకటించారు. అదే సమయంలో విపక్షాలు ఉనికి కూడా చాటుకోలేకపోతున్నాయి. టీడీపీ నేతలు పూర్తి సైలెంట్ గా ఉన్నారు.

Also Read:జ్యోతి చిత్రాలు అన్నీ ఇన్నీ కావు, వైవీ సుబ్బారెడ్డి పట్ల ప్రేమ నటించడం ఎందుకో?

సీఎం సొంత జిల్లాలో కనీసం డిపాజిట్ కోసమే పోటీ పడాల్సిన పరిస్థితుల్లో బరిలో దిగడం కన్నా దూరంగా ఉండడమే బెటర్ అనే ఆలోచనకు టీడీపీ వచ్చేసింది. ఇక బీజేపీ నేతలు కూడా తమ అభ్యర్థిని పోటీ పెడతారా లేదా అన్నది స్పష్టత రాలేదు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన బద్వేలు బరిలో నిలవడానికి జనసేనకి అభ్యర్థులు కూడా దొరికే అవకాశం లేదు. దాంతో దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్యను బరిలో దించాలని వైఎస్సార్సీపీ ఆలోచిస్తున్న తరుణంలో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ ఎన్నికలు జరిగినా అది ఏకపక్షమేనన్నది సుస్పష్టం.