iDreamPost
iDreamPost
గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీని గట్టున పడేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నానాపాట్లు పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సీనియర్లు, కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి వలసలకు అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా విఫలమైన ఆయన ఈ విధంగా ఆ లోటు భర్తీ చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగానే విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మాజీమంత్రి కొణతాల రామకృష్ణపై గాలం వేస్తున్నారు. టీడీపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఆఫర్ చేసి ఊరిస్తున్నారు.
ఆయన వస్తే ఫలితం ఉంటుందా..
మూడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణ వల్ల టీడీపీకి కలిగే ఆదనపు ప్రయోజనాలపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కొణతాల 1989, 1991 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. తర్వాత 2004లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా చేశారు. వైఎస్ సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. వైఎస్ తదనంతరం జగన్ ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన సోదరుడు రఘునాథ్ అనకాపల్లి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పార్టీకి దూరమైన కొణతాల దాదాపు ఐదేళ్లు మౌనంగా ఉన్నారు. 2019 ఎన్నికల ముందు మళ్లీ వైఎస్సార్సీపీలో చేరాలనుకున్నా కుదరలేదు. దాంతో మళ్లీ తెర వెనక్కి వెళ్లిపోయారు. కుటుంబ వ్యాపారాలు, వ్యవహారాలకే పరిమితమైన ఆయన్ను టీడీపీలోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తన సన్నిహితుల ద్వారా రాయబారం పంపారు. పార్టీలోకి వస్తే కొణతాలకు లేదా ఆయన సూచించిన అతని కుటుంబ సభ్యులకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే కొణతాల దీనిపై ఇంకా స్పందించలేదని సమాచారం. అయితే దాదాపు ఎనిమిదేళ్లుగా రాజకీయలకు దూరంగా ఉండటం వల్ల కొణతాల వర్గం చెదిరిపోయిందని.. ఇప్పుడు ఆయన పార్టీలోకి రావడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే వ్యక్తిత్వం రీత్యా చూస్తే పార్టీలో ఆయన ఇమడలేరన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
పీలా గోవింద్ సంగతేంటి?
ఒకవేళ కొణతాల టీడీపీలోకి వచ్చి.. ఆయనకే టికెట్ ఇస్తే మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ పరిస్థితి ఏమిటని ఆయన వర్గీయులు మల్లగుల్లాలు పడుతున్నారు. 2014లో పీలా అనకాపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో విపరీతమైన బంధుప్రీతి, భూ ఆక్రమణలు తదితర ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. ఆ వ్యతిరేకతతోనే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కొణతాల వస్తే వచ్చే ఎన్నికల్లో పీలాకు హ్యాండ్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అయితే పీలాకు ప్రత్యామ్నాయ నియోజకవర్గం కూడా లేదు. ఆయన సొంత నియోజకవర్గమైన పెందుర్తి విషయంలో ఇప్పటికే బండారు సత్యనారాయణ, గండి బాబ్జీల మధ్య పోరు కొనసాగుతోంది. దాంతో కొణతాల పార్టీలోకి వస్తే పీలాకు అన్యాయం జరుగుతుందని ఆయన వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.