iDreamPost
android-app
ios-app

TDP, Konijeti Rosaiah – రోశయ్యను టీడీపీ ఓన్‌ చేసుకోవాలనుకుంటుందా..?

TDP, Konijeti Rosaiah – రోశయ్యను టీడీపీ ఓన్‌ చేసుకోవాలనుకుంటుందా..?

కొన్ని రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. జీవితాంతం ఒక పార్టీలో ఉంటూ ప్రభుత్వాలలో వివిధ హోదాల్లో పని చేసిన నేతలకు ప్రజలు తమ హృదయాల్లో సముచిత స్థానం ఇస్తారు. మరణించిన తర్వాత కూడా ఆయా నేతలు.. ఆయా పార్టీలకు ఓట్లు కురిపించే నేతలుగా ఉంటారు. ఆయా పార్టీలు ఆయా నేతల మరణం తర్వాత కూడా వారిని నిత్యం గుర్తు చేసుకుంటుంటాయి. మరికొంత మంది నేతలను పట్టించుకోవు. ఈ పరిస్థితిని ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకుని.. ఆయా నేతలను ఓన్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

తాజాగా కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యను తెలుగుదేశం పార్టీ ఓన్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిణామాలు నెలకొన్నాయి. టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేసిన ఓ డిమాండ్‌ ఈ అనుమానాలకు తావిస్తోంది. రోశయ్య గొప్ప నాయకుడని, విలువలతో కూడిన రాజకీయాలు చేశారని కొనియాడిన యరపతినేని.. పిడుగురాళ్లలో రోశయ్య క్యాంస విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే భావి తరాలకు ఆదర్శమైన రోశయ్య క్యాంస విగ్రహాన్ని తామే ఏర్పాటు చేస్తామని చెప్పారు.

రోశయ్య రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్‌లోనే సాగింది. ఆ పార్టీ తరఫున శాసన మండలికి ఎన్నికవడం నుంచి మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్‌ వరకు దాదాపు 60 ఏళ్ల పాటు సుదీర్ఘమైన ప్రయాణం రోశయ్య సాగించారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన రోశయ్య.. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖుడు. ఆ సామాజికవర్గంలో పెద్దమనిషిగా చెలామణి అయ్యారు. సొంత సామాజికవర్గంలో మంచి గుర్తింపు ఉంది. రోశయ్య తర్వాత.. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు.

Also Read : TDP, Andhra Jyothi, Rosaiah, YS Jagan – రోశయ్య మరణాన్ని కూడా వాడుతున్నారు.. వీళ్ళు మారరా..?

వాస్తవంగా కాంగ్రెస్‌ పార్టీ రోశయ్యను ఓన్‌ చేసుకోవాలి. టీడీపీ చేస్తున్న డిమాండ్లు కాంగ్రెస్‌ పార్టీ చేయాల్సినవి. ఏపీలో ఇంకా భవిష్యత్‌ ఉందన్న ఆశతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ రోశయ్య విషయంలో ముందు ఉండాలి. కారణాలేమైనా ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మౌనంగా ఉంటోంది. అది టీడీపీకి కలసి వచ్చింది. రోశయ్యను వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ పట్టించుకోవడం లేదనే విమర్శలు కావాలనే చేయడం, తాజాగా ఆయన కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వినిపించడం.. రోశయ్యను ఓన్‌ చేసుకోవాలనే వ్యూహాంలో భాగంగా చేసినవే. వైశ్య సామాజికవర్గం ఓట్లను రోశయ్య జపం చేయడం ద్వారా సాధించాలనే లక్ష్యాన్ని టీడీపీ పెట్టుకున్నట్లు అర్థమవుతోంది.

ప్రత్యర్థి పార్టీ నేతలను ఇతర పార్టీలు ఓన్‌ చేసుకోవడం భారత రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కాంగ్రెస్‌ పార్టీ నేత, ఉక్కు మనిషి, ప్రప్రథమ హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను బీజేపీ ఓన్‌ చేసుకుంది. ఆయన పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే అతి ఎత్తు అయిన పటేల్‌ విగ్రహాన్ని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 597 అడుగుల ఎత్తుతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018 అక్టోబర్‌ 31వ తేదీన పటేల్‌ 143వ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పేరు వింటే.. బీజేపీ గుర్తుకు వచ్చేంతలా పటేల్‌ను కమలం పార్టీ సొంతం చేసుకుంది.

పటేల్‌ తరహాలోనే పీవీ నరసింహరావును టీఆర్‌ఎస్‌ పార్టీ సొంతం చేసుకుంది. బ్రహ్మాణ సామాజికవర్గానికి చెందిన పీవీ.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజకీయంగా అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, పలుమార్లు కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా, ఆర్థికంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి.. భారత్‌ను అభివృద్ధి వైపు నడిపించేలా సంస్కరణలు ప్రవేశపెట్టిన నేతగా.. చరిత్రలో నిలిచిపోయారు. ఇలాంటి నేత పట్ల కాంగ్రెస్‌ పార్టీ చిన్నచూపు చూసింది. ఈ పరిస్థితిని టీఆర్‌ఎస్‌ పార్టీ వినియోగించుకుంది. పీవీ జయంతి, వర్థంతులను ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. పీవీ కుమార్తెను శాసన మండలికి పంపింది. ఇప్పుడు పీవీ.. అంటే టీఆర్‌ఎస్‌ పార్టీ నేత అనేలా తెలంగాణలో పరిస్థితి మారిపోయింది.

పటేల్, పీవీ తరహాలోనే.. కాంగ్రెస్‌ నేత అయిన రోశయ్యను ఓన్‌ చేసుకోవాలనే టీడీపీ యత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read : Konijeti Rosaiah, Political Journey – రోశయ్య రాజకీయ పయనం అనన్యం, ఆదర్శం