iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీకి ఆర్ధిక శక్తిగా, చంద్రబాబుకు కుడి భుజంగా ఉంటూ వచ్చిన సుజనా చౌదరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిన తరువాత నెల రోజులు తిరగకుండానే కేంద్రం లో తిరిగి అధికారం కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. వేల కోట్లు బ్యాంకుల నుండి అప్పు తీసుకుని ఎగనామం పెట్టారని, సూట్ కేసు కంపెనీలు పెట్టి మారిషస్ బ్యాంకులనుండి రుణాలు పొందారని, మనీ లాండరిగ్ లాంటి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలపై గతంలో ఐ.టి శాఖ, ఎన్ఫోర్స్ మెంట్ శాఖ సుజనా చౌదరిపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. మారిషస్ బ్యాంకు కేసులో కోర్టు ధిక్కారంపై ఆయనకు అరెస్టు వారెంటు కూడా జారీ అయింది. ఈ కేసులు దాడుల నుండి విముక్తి పొందేందుకే తెలుగుదేశం పార్టీ ఓటమి గాయం పచ్చిగా ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల తో కలిసి బి.జే.పి తీర్ధం పుచ్చుకున్నారనే వాదన ఉంది. తెలుగుదేశం పార్టీని వీడటం బాధగా ఉందని , అలాగే బీజేపీలో చేరినందుకు ఆనందంగా ఉందని సుజనా చౌదరి చేసిన వాఖ్యల వెనక ఉన్న అంతరార్ధం ఇదే అని ఆనాడు పలువురు విశ్లేషించారు.
అయితే తాజా పరిణామాలు చూస్తుంటే సుజనా చౌదరికి ఆశించిన ఫలితం బి.జే.పిలో దక్కలేదనే వాదన వినపడుతోంది. బిజేపిలో చేరితే కేసుల ప్రభావం తన పై ఉండదని భావించిన సుజనా చౌదరికి డెట్ రికవరి ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. సుజనా చౌదరి భార్య పద్మజకు ఐ.డి.బి.ఐ బ్యాంకు డి.ఆర్.టి ద్వారా నోటిసులు పంపింది. బ్యాంకు నుండి తీసుకున్న 169 కోట్ల చెల్లించాలని చెబుతూ డి.ఆర్.టి పంపిన నోటీసులతో తనకు భారతీయ జనతా పార్టీలో చేరడంవలన ఆశించిన ఫలితం దక్కలేదనే భావనలో సుజా చౌదరి ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక అమరావతి రాజధాని విషయంలో సుజనా చౌదరి వ్యవహార శైలిపై కూడా బీజేపీ అగ్ర నాయకత్వం గుర్రుగా ఉంది. భారతీయ జనతా పార్టీలో ఉంటూ తెలుగుదేశం కి మౌత్ పీస్ లా పని చేస్తున్న సుజనా చౌదరి వ్యవహార శైలి పై బీజేపీ అగ్ర నేతలు కోపంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక పక్క బీజేపీ అగ్ర నాయకులు ఆంధ్ర రాష్ట్ర రాజధాని విషయంలో జోక్యం చేసుకోము అది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని చెబుతుంటే మరోపక్క సుజనా చౌదరి రాజధాని తరలింపుని నిరసిస్తూ మాట్లాడటం, అమరావతి నుండి రాజధాని అంగుళం కూడా కదపలేరు అని చెప్పటం, అదే భారతీయ జనతా పార్టి స్టాండ్ గా చూపే ప్రయత్నం చేయటం లాంటి చర్యలు కొంత బీజేపీలోని ముఖ్యనాయకులకి సైతం ఆగ్రహం తెప్పించాయి, రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొని వేల కోట్లు సంపాదించారు కాబట్టే సుజనా చౌదరి బీజేపీలో ఉన్నా తెలుగుదేశం జెండాను అజెండాను ఇంకా మోస్తున్నారనే చెబుతున్నారు.
గన్నవరం తెలుగుదేశం శాశన సభ్యుడు వల్లభనేని వంశీ తన సొంత పార్టీ వ్యక్తులే నారా లోకేష్ ఆధ్వర్యంలో తనపై విష ప్రచారం మొదలుపెట్టారని ఇక ఆ పార్టీలో ఇమడలేనని తిరుబాటు జెండా ఎగరేసి అధినేత చంద్రబాబు తీరుని తీవ్రంగా విమర్శించారు. అయితే బీజేపీలో ఉన్న సుజనా చౌదరి చంద్రబాబు తరుపున వంశీతో రాయబారం నడిపారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా వంశీ తెలివైన వ్యక్తని అతను వైసీపీలో చేరడని తనకి నమ్మకం ఉందని చేసిన కామెంట్ సుజనాకి తెలుగుదేశంకి మధ్య ఉన్న బంధాన్ని మరోసారి బయటపెట్టింది. అలాగే తెలుగుదేశం నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతూ ప్రజల్లో ఆ పార్టీ పలచన అవుతుంటే దాని నుండి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంగా వైసీపీ పార్టీ నుండి సుమారు 20 మంది తనతో టచ్ లో ఉన్నారని త్వరలో వారు వైసీపీ వీడతారని చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమితో తన ఆర్ధిక భద్రత కోసం పార్టి మారిన సుజనా చౌదరి మనిషి బీజేపీలో ఉన్న, మనస్సు మాత్రం తెలుగుదేశం కోసమే పరితపిస్తున్నదని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. సుజనా చౌదరికి బీజేపీలో సైతం తను అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా, రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ నుండి ఎలాంటి భరోసా రాకపోవడంతో ఇక ఆ పార్టీలో ఉండి ఉపయోగం ఏమిటి అనే వాదన ఈ మధ్య ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక త్వరలో ఆయన మనస్సు ఉన్న చోటికే మనిషి కూడా చేరుతారని, తెలుగుదేశంలోకి రీ ఎంట్రీ ఖాయమనే వాదన బలంగా వినిపిస్తుంది. అయితే తీవ్రమైన ఆర్ధిక నేరారోపణలు ఉన్న సుజనా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.