Idream media
Idream media
ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జోరందుకుంది. ఆ పార్టీకి యువనేతలంతా ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. మరో విశేషం ఏమిటంటే వారు రాహుల్ గాంధీకి సన్నిహుతులు కావడం. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువనేత జితన్ ప్రసాద కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరారు. ఈ సమయంలో జితిన్ ప్రసాద కంటే ఎక్కువగా సచిన్ పైలెట్ గురించే ఎక్కవగా చర్చ జరుగుతోంది.
సచిన్ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంతో కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. దీనికి తోడు తన వర్గానికి మంత్రి వర్గంలో న్యాయం జరగలేదని మరోసారి బహిరంగంగా సచిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సచిన్ కూడా ఎప్పుడైనా బీజేపీలో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి.
Also Read: బీజేపీలోకి రాహుల్ సన్నిహితుడు.. కాంగ్రెసుకు కోలుకోలేని దెబ్బ
ఏడాది నుంచే ప్రకంపనలు మొదలు
కాంగ్రెస్ పార్టీ యువ నేతలు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకుంటున్నారు. ఏడాది క్రితం మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సిందియా తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సందర్భంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత రాజస్థాన్ రాజస్థాన్ ప్రభుత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయి. తనకు ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలెట్ తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో అతడిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పైలెట్ తన మద్దతుదారులతో క్యాంప్ రాజకీయాలకు తెర తీశారు.
అప్పటి నుంచే పార్టీ మార్పు వార్తలు
ఈ పరిణామంతో బోటాబోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ లో కలకలం మొదలైంది. అసలే బీజేపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. మరోవైపు సచిన్ పైలెట్ బీజేపీలోకి చేరే అవకాశం ఉందని వార్తలు వెల్లువెత్తాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. రాహుల్ గాంధీకి సన్నిహితుడైన సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాత్ మధ్య సంధికి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఆ తర్వాత పార్టీలో పరిస్థితులు సద్దుమణిగినట్లు కనిపించాయి. అనంతరం కొన్ని సందర్భాల్లో అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్‌లను ఒకే వేదికపై కనిపించారు. కానీ ఇరువర్గాల ఎమ్మెల్యేలు, మద్దతుదారులు ఒకరికొకరు దూరంగా ఉన్నారు.
Also Read:అమరావతి ఎంపీ, సినీ హీరోయిన్ నవనీత్ కౌర్ పదవికి గండం
మనసులు కలవ లేదు..
ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉండడంతో పార్టీ అగ్ర నాయకత్వం నానా విధాలుగా ప్రయత్నించి తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్ పైలెట్ ను సర్దిచెప్పినప్పటికీ, యువ నాయకత్వానికి, వృద్ధ నాయకత్వానికి పొసగడం లేదన్న విషయం గత మేలో మరోసారి బయటపడింది.
గత మే నెలలో మరోసారి సచిన్ పైలెట్ వర్గం ముఖ్యమంత్రి పై ఆరోపణలు ఎక్కిపెట్టింది. మంత్రివర్గంలో గెహ్లాత్ వర్గ ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వివాదానికి కారణమైంది. దీనికి నిరసనగా పైలెట్ వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే హేమారామ్ చౌదరి పదవికి రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే వేద ప్రకాశ్ సోలంకి కూడా రాజీనామాకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలెట్ మాట్లాడుతూ మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం విచారకరమని పరోక్షంగా అశ్లోక్ గెహ్లాత్ పై విమర్శలు చేశారు.
ఇప్పటికే ఇద్దరు…
మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సిందియా, యూపీకి చెందిన జితిన్ ప్రసాద, రాజస్థాన్ నుంచి సచిన్ పైలెట్ లకు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా పేరుంది. వారిలో ఇద్దరు జ్యోతిరాదిత్య, జితిన్ ప్రసాద్ ఇప్పటికే కాంగ్రెస్ కు బై చెప్పి బీజేపీకి జై కొట్టారు. దీంతో ఇప్పుడు సచిన్ పైలెట్ చర్చనీయాంశంగా మారారు.
నెల క్రితం నాటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడం పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇలాంటి సందర్భంలో సచిన్ పైలట్ కూడా పార్టీని వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read:విజయవాడ తూర్పులో గద్దేకు ఇబ్బందే!
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్‌కు సచిన్‌కు మధ్య సత్సంబంధాలు లేవు. సచిన్ అనుచర వర్గానికి మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యం లేదు. సచిన్ ప్రాధాన్యాలు గెహ్లోత్ పట్టించుకోరు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో పూర్వవైభవానికి వచ్చేలా లేదు. దీంతో సచిన్ కచ్చితంగా కమలం గూటికి వెళ్లక తప్పదనే వార్తలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఏం జరగనుందో, భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.