విజయవాడ తూర్పులో గద్దేకు ఇబ్బందే!

By Ramana.Damara Singh Jun. 09, 2021, 09:30 pm IST
విజయవాడ తూర్పులో గద్దేకు ఇబ్బందే!

రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లా మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తోంది. టీడీపీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టిన ఆ జిల్లా గత ఎన్నికల్లో మాత్రం జెల్ల కొట్టి.. వైఎస్సార్సీపీకి జైకొట్టింది. జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో 14 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులనే ప్రజలు గెలిపించారు. గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లోనే టీడీపీ గెలవగలిగింది.

ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ వైఎస్సార్సీపీ ఆధిపత్యమే కనిపిస్తోంది. 2019లో టీడీపీ గెలిచిన రెండు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పటికే టీడీపీకి దూరమై వైఎస్సార్సీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామ్మోహన్ పార్టీపరంగానూ, అభివృద్ధి పరంగానూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ పట్టు కోల్పోతున్నారు.

దూసుకుపోతున్న దేవినేని
గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాష్ ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన్ను పార్టీ నాయకత్వం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించడంతో అక్కడి టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి.

యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న దేవినేని అవినాష్ చురుకైన నేతగానూ పేరు పొందారు. అవే అతన్ని స్వల్పకాలంలోనే నియోజకవర్గంలో పాతుకుపోయేలా చేశాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూడా కలిసి వస్తున్నాయి. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కోవిడ్ సంక్షోభంలో గత ఏడాది కాలంగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. సొంత డబ్బులు కూడా వెచ్చించి తన వద్దకు వచ్చిన ప్రజల అవసరాలు తీరుస్తూ మంచి పేరు సంపాదించారు. మార్చిలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయంలో అవినాష్ కీలకపాత్ర పోషించారు.

టీడీపీలో విభేదాలు
మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కు వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నా పార్టీపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విజయవాడలో టీడీపీ నేతలు ఎంపీ కేశినేని అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి చాలాకాలంగా ఆధిపత్య పోరు సాగిస్తున్నారు. కేశినేని వర్గంగా గుర్తింపు పొందిన రామ్మోహన్ కు ప్రత్యర్థి వర్గం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది.

అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేలా టీడీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై ప్రభావం చూపుతోంది. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న ప్రజలు.. టీడీపీ తీరును నిరసిస్తున్నారు. దేవినేని అవినాష్ దూకుడు రాజకీయాలను ధీటుగా ఎదుర్కోలేక గద్దే బెనకబడుతున్నారన్న అభిప్రాయం ఉంది. వీటన్నింటి ఫలితంగానే మొన్నటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం పరిధిలోని మెజార్టీ డివిజన్లలో టీడీపీ ఓటమికి, వైఎస్సార్సీపీ విజయానికి దారితీశాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే గత రెండు ఎన్నికల్లో వరుస విజయాలతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గద్దే రామ్మోహన్ వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp