iDreamPost
android-app
ios-app

ఆ మాటకు అర్థం తెలుసా రేవంత్..?

  • Published Aug 25, 2021 | 7:40 AM Updated Updated Aug 25, 2021 | 7:40 AM
ఆ మాటకు అర్థం తెలుసా రేవంత్..?

రాజకీయం రంగులు మార్చుకుని చాలా ఏళ్లయింది.. ఒక పార్టీని అంటిపెట్టుకుని, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని నిలబడి, ముందుకు సాగే నాయకులు చాలా అరుదు. కానీ ఇప్పుడు కొందరు నాయకులు కొన్నింటికి అర్థాలే మార్చేస్తున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరి, నిన్న పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి.. తనను తాను నిఖార్సయిన కాంగ్రెస్ నేతగా అభివర్ణించుకుంటున్నారు. దీన్ని చూసి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.

సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రెండు రోజుల దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేస్తున్నారు. మంగళవారం దళిత వాడ కెళ్లి వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాత్రి దళిత వాడలోనే బస చేశారు. ఉదయాన్నే పేపర్ చదువుతూ ఉన్న ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. దానికి ‘గరీబోడి ఇందిరమ్మ ఇంట్లో… నికార్సయిన కాంగ్రెసోడు’ అని కాప్షన్ పెట్టారు. ఆ కాప్షన్ చూసి చాలా మంది నవ్వుకున్నారు. కొంతమంది విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ ఫొటో క్యాప్షన్ కు వచ్చిన కొన్ని కామెంట్లను పరిశీలిస్తే.. ‘‘ఈ మొగోడే ఇందిరమ్మ ఇండ్లపై గతంలో పిచ్చి కూతలు కూసిండు’’.. ‘‘గరీబోడి ఇందిరమ్మ ఇంట్లో.. నికార్సయిన చంద్రబాబు కుడిభుజం’’.. ‘‘నికార్సయిన కాంగ్రెసోడు అనడానికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా?’’.. ‘‘మీరు నికార్సయిన కాంగ్రెసోడు ఎలా అవుతారు?’’ ‘‘నికార్సయిన టీడీపీ వాడు’’ అని రాసుకొచ్చారు. నిజమే కదా మరి.. రేవంత్ నిఖార్సయిన కాంగ్రెస్ లీడర్ ఎలా అవుతారు?

ఒక పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి.. అదే పార్టీలో ఎదిగి.. అదే పార్టీలో చివరి దాకా కొనసాగితే.. దాన్ని నికార్సయిన రాజకీయం అంటారు… అలాంటి లీడర్ ను నికార్సయిన రాజకీయ నాయకుడని అంటారు. ఒక పీవీ నరసింహారావు.. ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. వీళ్లు నికార్సయిన కాంగ్రెస్ లీడర్లు. కానీ రేవంత్ కు గతంలో ఏబీవీపీ నేపథ్యం ఉంది. తర్వాత టీడీపీలో చేరారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీకి తెలంగాణలో మనుగడ లేదని తెలుసుకుని.. కాంగ్రెస్ లోకి చేరారు. అంతేకానీ తనను ఇంతవాడిని చేసిన పార్టీని నమ్ముకుని నిలబడలేదు. అందరి మాదిరే తన దిక్కు తాను చూసుకున్నారు. మరి నిఖార్సయిన కాంగ్రెస్ నేత ఎలా అవుతారు? అనే ప్రశ్నసొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఈ ‘నికార్సయిన’ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడాన్ని ఇప్పటికీ చాలా మంది కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

Also Read : రెండు విషయాల్లో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి