iDreamPost
android-app
ios-app

Ravela – ఆ మాజీ మంత్రి బీజేపీ నా? టీడీపీ నా ?

  • Published Nov 15, 2021 | 4:21 AM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
Ravela – ఆ మాజీ మంత్రి బీజేపీ నా? టీడీపీ నా ?

గతంలో ప్రజల కోసం రాజకీయాలు అన్నట్లు ఉండేది. కానీ ప్రస్తుతం సొంత లాభానికే రాజకీయం అన్నట్లు పరిస్థితి తయారైంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేతలే ఎక్కువైపోయారు. ఒక పార్టీ కాకపోతే మరో పార్టీ అన్నట్లు ‘దూకుడు’ కొనసాగిస్తున్నారు. ఇటువంటి వారికి మాజీమంత్రి రావెల కిషోర్ బాబు తాజా నిదర్శనంగా నిలుస్తున్నారు. ఉన్నత ఉద్యోగం వదులుకొని రాజకీయాల్లో చేరిన ఆయన ఐదేళ్లలోనే మూడు పార్టీలు మారారు. ఇప్పుడు మళ్లీ జంపింగుకు సిద్ధపడుతున్నారు. మళ్లీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

స్వల్ప కాలంలోనే మంత్రి యోగం.. వియోగం

ఐఆర్టీస్ అధికారి అయిన రావెల కిషోర్ బాబు తొలుత టీడీపీలో చేరి రాజకీయ నాయకుడయ్యారు. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలవడమే కాకుండా చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి కూడా అందుకున్నారు. అధికార వైభోగం అనుభవించారు. పెత్తనం చెలాయించారు. అయితే ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పడిపోయారు. మంత్రి ముచ్చట మూడేళ్లలోనే ముగిసింది. 2017లో జరిపిన కేబినెట్ విస్తరణలో రావెలను చంద్రబాబు తప్పించారు. దాంతో కొద్ది నెలల్లోనే ఆయన టీడీపీని వీడి జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఓటమి అనంతరం నెల రోజుల్లోనే జనసేనకు బై చెప్పి బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు.

పచ్చ పార్టీపై మళ్లీ మనసు

కాషాయ దళంలోకి వెళ్లి రెండేళ్లయినా ఆ పార్టీలో రావెల కుదురుకోలేకపోయారు. దాన్నో కషాయంలా భరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు. పైగా సందర్భం వచ్చినప్పుడల్లా పచ్చదనంపై మోజు చూపుతున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా పూర్తిగా బయటపడ్డారు. గుంటూరు జిల్లాలో ఆ యాత్ర సాగినన్ని రోజులూ అన్నీ తానై వ్యవహరించారు. యరపతినేని, ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, తదితర టీడీపీ సీనియర్ నేతలతో అంటకాగారు. అనవసరంగా పార్టీ మారావని ఈ సందర్బంగా వారు వ్యాఖ్యానించగా.. నేనెప్పుడూ మీవాడినే అని రావెల సమాధానం ఇవ్వడం టీడీపీ, బీజేపీల్లో చర్చనీయాంశం అయ్యింది. కాగా ఆయన మళ్లీ టీడీపీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఉన్నత స్థాయిలో ఇప్పటికే చర్చలు జరిగాయని.. పార్టీ అధినేత చంద్రబాబు రావెల పునఃప్రవేశానికి దాదాపు అంగీకరించారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

Also Read : MLC, Nadyala Isak – సాధారణ కార్యకర్త.. ఎమ్మెల్సీ ఎలా కాబోతున్నావారిక