నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన రాజకీయ వ్యాఖ్యలు సైతం ఆపడం లేదు. జిల్లాల పర్యటన పేరుతో రాజకీయ నేత తరహా వ్యవహారం మానడం లేదు. దాంతో ఆయన లక్ష్యాలు వేరుగా ఉన్నాయనే పాలకపక్ష వాదనకు బలం చేకూరుతోంది. చంద్రబాబు ఆదేశాలను ఆయన పాటిస్తున్నారనే విమర్శలకు ఊతమిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వ్యవస్థలను నాశనం చేసే ఆలోచనతో చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఫలితమే ఇదంతా అన్నట్టుగా పలువురు భావించాల్సి వస్తోంది.
ఎన్నికల సమయంలో మంత్రులు కార్లు వినియోగించడంపై నిమ్మగడ్డ విచిత్రమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్లే సమయంలో అధికారికంగా కార్లు వాడకూడదని ఆయన ఆదేశాలివ్వడం హాస్యాస్పదంగా మారింది. పట్టణాల్లో ఒక కారు, గ్రామాల్లో ఒక కారు వాడాలని ఆయన చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆయన మాత్రం నేరుగా వైఎస్సార్ గురించి కడపలో ప్రస్తావించడం ద్వారా రాజకీయ వ్యాఖ్యలు మాత్రం ఆపడం లేదు. అందరికీ నీతులు చెప్పి, తాను మాత్రం తేడాగా వ్యవహరిస్తున్నారని అనేక మంది భావించేలా నిమ్మగడ్డ తీరు ఉంది. జిల్లాల్లో పర్యటన పేరుతో ఆయన చేస్తున్న హంగామా మరింత ఆశ్యర్యం కలిగిస్తోంది. ఫక్తు రాజకీయ నేత శైలిని తలపిస్తోంది. సొంతూరు వెళ్లిన సమయంలో గుంటూరు జిల్లా దుగ్గిరాలలో టీడీపీ నేతల హంగామా ఆసక్తిగా మారింది.
అందుకు తోడుగా ఐఏఎస్ అధికారుల పట్ల నిమ్మగడ్డ వైఖరి మరింత చర్చనీయాంశం అవుతోంది. నిబంధనలకు భిన్నంగా ఆయన సాగుతున్న తీరు చివరకు ఆయన మీద ప్రివిలైజేషన్ నోటీసులు ఇచ్చేందుకు ఏపీ మంత్రులు సిద్ధపడేందుకు దారితీసింది. అదే సమయంలో పంచాయితీరాజ్ శాఖలో ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ పట్ల నిమ్మగడ్డ వైఖరి వివాదాస్పదం అయ్యింది. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో నిమ్మగడ్డ చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను బదిలీ చేసి సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇక వారి స్థానంలో కొత్త కలెక్టర్ నియామకం కోసం ప్రభుత్వం మూడేసి పేర్లు ప్రతిపాదిస్తే వారిని కాదని, తనకు తోచిన మరో ఇద్దరు అధికారుల పేర్లను ప్రతిపాదించడం ఆశ్చర్యంగా మారుతోంది. సరిగ్గా ఎస్ఈసీ కార్యదర్శి విషయంలో కూడా ఇదే రీతిలో వ్యవహరించారు. ప్రభుత్వం చెప్పిన మూడు పేర్లు కాదని, ముద్దాడ రవిచంద్రను ముందుకు తీసుకొచ్చారు. చివరకు ప్రభుత్వం చెప్పిన పేర్లలోనే కన్నబాబుని అంగీకరించాల్సి వచ్చింది.
అదే విధంగా సీఎంవోలో ముఖ్య కార్యదర్శిగానూ, జీఏడీ బాధ్యతల్లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ విషయంలో కూడా నిమ్మగడ్డ నిబంధనలను తోసిపుచ్చి వ్యవహరించేందుకు ప్రయత్నించారు. అయితే తాము చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తున్నట్టు ప్రవీణ్ ప్రకాష్ కౌంటర్ ఇవ్వడంతో నిమ్మగడ్డ సందిగ్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది. వాస్తవానికి నిబంధనలను తెలిసినప్పటికీ అంతా తన ఇష్ట ప్రకారం జరగాలనే లక్ష్యంతోనూ, ప్రభుత్వంలో కొందరిని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనూ ఆయన ఇలాంటి ఆదేశాలిస్తున్నట్టు కనిపిస్తోంది. పదే పదే ప్రభుత్వంతో వైరుధ్యాలకు దిగుతున్నట్టు అర్థమవుతోంది. ఇదంతా తన లక్ష్య సాధనలో వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. మొత్తంగా నిమ్మగడ్డ తీరు రాజకీయంగానే కాకుండా పాలనాపరంగానూ పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది.