iDreamPost
android-app
ios-app

రాష్ట్రప‌తి ఎన్నిక‌లో పీకే లాబీయింగ్ ప‌నిచేస్తుందా?

రాష్ట్రప‌తి ఎన్నిక‌లో పీకే లాబీయింగ్ ప‌నిచేస్తుందా?

బీజేపీ వ్య‌తిరేక ఫ‌లితాలే ల‌క్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప‌ని చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ దిశ‌గా విజ‌యం సాధించి రాజ‌కీయాల్లో టాక్ ఆఫ్ ద మ్యాన్ గా మారారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో చ‌క్రం తిప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక్క‌డ కూడా బీజేపీ అభ్య‌ర్థి గెలుపు అడ్డుకోవ‌డానికి శ‌త విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. శరద్ పవార్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో సమావేశం అయ్యారు. శరద్ పవార్ తో పలు దఫాలు చర్చలు జరిపారు.

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఏకంగా శరద్ పవార్ ను రాష్ట్రపతిగా ఎన్నికయ్యేలా చేసేందుకు లాబీయింగ్ చేస్తున్నాని ప్రచారం సాగుతోంది. నిజానికి ఈ ప్రయత్నాలు ఇప్పటివీ కావు.. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీకే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి వాటిని గెలిపిస్తూ మోడీపై ప్రతీకారానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ మూడు సార్లు శరద్ పవార్ ను కలిశారు. శరద్ పవార్ ను న్యూఢిల్లీ నివాసంలో జరిగిన ఈ సమావేశాలలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఈ కూటమి సమావేశమైందని నమ్ముతున్నారు.

తాజాగా రాహుల్ గాంధీప్రియాంకగాంధీలతో ప్రశాంత్ కిషోర్ సమావేశం బీజేపీ నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే జరిగిందని అంటున్నారు. ప్రతిపక్ష రాజకీయ పోరాటానికి కొత్త కోణాన్ని జోడించిందంటున్నారు. ఇది వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ కేంద్రీకృతమై ఉండొచ్చని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ వేస్తున్న లెక్కల ప్రకారం.. ఒక్క ఒడిషా ముఖ్యమంత్రి బిజు జనతాదళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమికి ఓటేస్తే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఓడిపోతారని భావిస్తున్నారు. ప్రతిపక్ష పాలిత మహారాష్ట్ర తమిళనాడులు కూడా కీలకం. ఇందుకోసమే నవీన్ పట్నాయక్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ ను పీకే కలిసి మంతనాలు జరిపారంటున్నారు.

ఇప్పటికే వివిధ రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ జగన్ మోహన్ రెడ్డి అరవింద్ కేజ్రీవాల్ స్టాలిన్ ఉద్దవ్ ఠాక్రేలతో పీకేకు మంచి సంబంధాలున్నాయి. వారి గెలుపునకు పీకే బాటలు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా అందులో కలిపేస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని ఓడించడం పెద్ద సమస్య కాదంటున్నారు. ప్రశాంత్ కిషోర్ తాజాగా రాహుల్ ప్రియాంకలతో రెండు గంటలు పైగా చర్చించారు. ప్రశాంత్ కిషోర్ తన ప్రణాళికల గురించి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే రాష్ట్రప‌తి ఎన్నిక దేశంలో రాజకీయాలను వేడెక్కించేలా ఉంది.