iDreamPost
iDreamPost
తాను సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనడం జనాన్ని ఆశ్చర్య పరుస్తోంది. విశాఖపట్నంలో సోమవారం ఆయన మాట్లాడుతూ తాను పార్టీని నడుపుతున్నానని, సినిమా హాల్‌ను నడపడం లేదని వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయమని కూడా చెప్పారు. పార్టీ పెట్టిన ఏడేళ్లకు ఆయనకు ఈ విషయాలు తెలిసివచ్చాయి కానీ జనానికి జనసేన గురించి ఎప్పుడో తెలిసి వచ్చింది. ఆయన రాజకీయాల్లోకి సరదాగా వచ్చినట్టే ఇన్నాళ్లు వ్యవహరించారు తప్ప సీరియస్ గా పనిచేసిందెప్పుడు?
2014లో పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చి ఆయన సరదాగానే రాజకీయాల్లోకి వచ్చారేమోనని జనం అనుకొనెలా చేశారు. ఆ ఎన్నికల్లో తాను మద్దతు ఇచ్చిన రెండు పార్టీలు గెలిచి అధికారం చేపట్టినా వాటిని కాకుండా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై విమర్శలు చేస్తూ ఐదేళ్ళూ సరదాగా గడిపేశారు. అచ్చం ఒక సినిమా హాలు నిర్వహించిన మాదిరిగానే జనసేనను నడిపి పార్టీలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు పోతున్నారు వంటివి పట్టించుకోలేదు. సినిమా హాలును లీజుకు ఇచ్చిన తరహలోనే మద్దతు పేరిట టీడీపీకి జనసేనను దాదాపు ఐదేళ్లు అప్పగించేశారు. 2019 ఎన్నికల్లో మిత్రపక్షాలు రెండింటినీ కాదని కొత్త మిత్రులు కమ్యూనిస్టులు, బీఎస్పీలతో బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం, పోటీ చేసిన రెండుచోట్లా తనకు ఎదురు దెబ్బలు తగలడంతో రాజకీయాల్లో సరదాకు చెల్లించవలసిన మూల్యం ఏమిటో తెలిసి వచ్చింది. అందుకే వెంటనే కమ్యూనిస్టులను, బీఎస్పీని తోసిరాజని గెలిచిన బీజేపీతో స్నేహం చేస్తున్నారు. మరోపక్క టీడీపీతో రహస్య స్నేహం కొనసాగిస్తున్నారు. ఇన్ని పనులు చేశారు కాబట్టే పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయమని ఆయనకు అర్థమైంది.
Also Read : Vizag Steel Plant Pawan Kalyan -విశాఖ స్టీల్ ప్లాంట్ సభ: లాజిక్ లేకుండా అలా ఎలా పవన్?
పునాది వేసిన ఏడేళ్లకు భవన నిర్మాణమట!
ఎత్తెన కట్టడం కట్టాలంటే..లోతైన పునాది వేయాలన్న సామెతను పవన్ గుర్తుచేశారు. పునాది వేసి ఏడేళ్లవుతుందని, బలమైన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే జనసైనికులు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పునాది వేసిన ఏడేళ్లకు భవనం నిర్మించాలనే ఆలోచన తమ నాయకుడికి వచ్చినందుకు జన సైనికులు సంతోషించి ఉంటారు.
నవరత్నాలపై కామెంట్..
సంక్షేమం, అభివృద్ధి పక్కపక్కనే ఉండాలి. నవరత్నాలు అనే ఉంగరం ఇస్తే..ప్రజలు ఆకలి తీరుతుందా? అని ప్రశ్నించి వైఎస్సార్ సీపీ అమలు చేస్తున్న నవరత్నాల పథకాలపై తనకు అవగాహన లేదని పవన్ చాటుకున్నారు. నవరత్నాలు అనేది ఉంగరమో.. బ్రాస్ లెటో కాదు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తొమ్మిది పథకాల సముదాయం. రెండున్నర ఏళ్ళుగా రాష్ట్రంలోని ప్రజలు ఆ పథకాల లభ్దిని అందుకుంటున్నారు. ఇలాంటి విషయాలపై సరదాగా కామెంటు చేస్తే జనం ఏ విధంగా ఆయనను అర్థం చేసుకుంటారో ఆలోచిస్తున్నారా?
భయపడమని ఎవరు చెప్పారు?
వైఎస్సార్సీపీ నేతలకు జనసైనికులు భయపడాల్సిన అవసరం లేదని పవన్ అన్నారు. 2024లో వైఎస్సార్సీపీని ఓడించాలంటే జనసైనికుల్లో ఐక్యత ముఖ్యం అని చెప్పారు. అసలు వైఎస్సార్ సీపీకి భయపడమని ఎవరు చెప్పారు. భయపడడానికి అదేమైనా దెయ్యమా? భూతమా? రాష్ట్రంలో మరే ఇతర పార్టీకి లేని ఈ భయపడడం అనే కాన్సెప్ట్ జనసేనకే ఎందుకు వస్తోంది? పవన్ కూడా చీటికి మాటికి నేనెవరికి భయపడను. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను అంటుంటారు. రాజకీయాల్లో కావలసినది భయపడడమో.. భయపెట్టడమో కాదు. జనాన్ని ప్రేమించాలి. వారి కడగండ్లను తెలుసుకోవాలి. వారి సమస్యల పరిష్కారానికి వారి తరఫున పోరాడాలి. వారికి ఒక నమ్మకంగా నిలవాలి. అప్పుడే ఏ పార్టీకైనా ప్రజాస్వామ్యంలో మనుగడ ఉంటుంది. లేదంటే పునాది దశలోనే మిగిలిపోతుంది.
Also Read : Steel Plant – Pawan Kalyan : అఖిల పక్షం సరే.. కేంద్రాన్ని ప్రశ్నించరేమి?