iDreamPost
iDreamPost
సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకత్వంపై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసి మీడియాలో పతాక శీర్షికల్లోకి ఎక్కారు. రాజకీయ వేదిక కాకపోయినా రాజకీయ ప్రసంగం చేసి ప్రత్యర్ధులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ నాయకులూ, మంత్రులూ తగిన స్థాయిలోనే బదులిచ్చినట్టు కనిపించింది. మంత్రులూ, పార్టీ నేతలూ పవన్ స్థాయిలోనే ప్రతివిమర్శలు చేశారు. ఇందులో చూడాల్సిందేమంటే పవన్ మాటల్లో కానీ, మంత్రులూ, పార్టీ నేతల ప్రతిమాటల్లో కానీ బయట విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అంశాలు మరుగునపడి వ్యక్తిగత దూషణలు బయటకు రావడం, ఈ దూషణలును మీడియా పదేపదే జనానికి వినిపించడం.
చలనచిత్ర పరిశ్రమకు సమస్యలు ఉంటే వాటిని ప్రస్తావించవచ్చు. చర్చ చేయవచ్చు. ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలపై కూడా విస్తృతంగా చర్చ చేయాల్సి ఉంది. సినిమా టిక్కెట్లు ఆన్లైన్ లో విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు. అంతకూ కుదరకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు.
Also Read:పవన్.. ఏ పార్టీని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు?
అన్నిటికీ మించి ఓ సినిమా ఫంక్షన్లో సినిమా రంగ సమస్యలు సామరస్యంగా మాట్లాడుకోవచ్చు. కానీ సినిమా ఫంక్షన్లకు హాజరుకాని పవన్ కళ్యాణ్ ఈ సినిమా వేదికపై పూర్తిస్థాయిలో రాజకీయ ఉపన్యాసం చేయడం ఒక ప్రత్యేక లక్ష్యంతో చేసిందే అని చెప్పక తప్పదు. ఎప్పుడో ఈ యేడాది మార్చిలో జరిగిన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజులకు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ వేదికపై రాజకీయ ఉపన్యాసం చేసి దుమారం లేపారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మాట్లాడే సమయానికి రాష్ట్రంలో కొత్త చర్చ జరుగుతోంది. కొత్తగా ఎన్నికైన మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వారు తమ మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునే క్రమంలో ఉన్నారు.
అధికారంలో ఉన్న వైసీపీ నాయకత్వం పెద్ద ఎత్తున ఎస్సిలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలకు మండలాధ్యక్షులుగా, జిల్లాపరిషత్ చైర్మన్లుగా అవకాశాలు కల్పించింది. ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో ఈ వెనుకబడిన వర్గాల ప్రతినిధులు ఈ ఉన్నత పదవులు అందుకున్నారు. చాలా కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కలిగింది. జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సోషల్ ఇంజినీరింగ్ ఒక ఆదర్శనీయమైన స్థాయికి వెళ్ళింది. ఈ స్థాయిని ప్రతిపక్షాలు అందుకోలేవు. ప్రజలు గమనిస్తున్నారు. స్థానిక సంస్థల వ్యవహారం కాబట్టి ప్రజల కళ్ళముందే ఈ ఎన్నికలు జరిగి చాలా మంది మహిళలకు, ఇతర అణగారిన, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది.
Also Read: రూటు మార్చిన రాహుల్, కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్
వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పుడు జరగాల్సిన చర్చ ఇదే. బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, మైనారిటీలకు జగన్ నేతృత్వంలో లభిస్తున్న ఆదరణ, వారికి అందుతున్న అవకాశాలు విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. టీవీ చానళ్ళు ఈ అంశంపై చర్చ నడపాల్సి ఉంది. పత్రికలు వ్యాసాలు రాయాల్సి ఉంది. గ్రామాల్లో టీ దుకాణాల దగ్గర, రచ్చబండ దగ్గర చర్చ జరగాల్సి ఉంది. జగన్ నిర్ణయాలు స్వాగతించాల్సి ఉంది.
దేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు గుడుస్తుంటే, యావత్ దేశం స్వాతంత్య్ర సంబరాలు చేస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ లో 75 సంవత్సరాల తర్వాత బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు, మైనారిటీలకు జగన్ నేతృత్వంలో ఉన్నత అవకాశాలు లభించాయని జనం స్వాగతించాల్సిన సందర్భం. అయితే ఇలాంటి చర్చ జరిగితే అది ప్రతిపక్ష టీడీపీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అందువల్ల అలాంటి చర్చ జరగకుండా ప్రజలను, మీడియాను డైవర్ట్ చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం. అయితే పవన్ కళ్యాణ్ ఈ పని ఎవరికోసం భుజాన వేసుకుని నిర్వర్తించారో పవన్ అభిమానులతో పాటు మాములు జనానికి కూడా తెలుసు.
Also Read:బాబును చిక్కుల్లో పడేసిన టీడీపీ కార్యకర్తలు, సమస్యే లేదన్న కేశినేని…!
ఈ విజయంతో పాటు మరో ప్రాధాన్యత కలిగిన అంశం కూడా పవన్ కళ్యాణ్ డైవర్షన్ స్ట్రాటజీ వల్ల మరుగున పడింది. అదే చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలో టీడీపీ భారీ ఓటమి చవిచూడడం, అక్కడ వైసీపీ జెండా ఎగురవేయడం. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా 2018 నుండి వైసీపీ తీవ్ర కృషి చేస్తోంది. దాని ఫలితమే 2019 ఎన్నికల కౌంటింగ్ లో మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకబడి ఉండడం. ఆ తర్వాత ఇప్పుడు 2021లో కుప్పంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూడడం.
ఈ అంశం కూడా ప్రముఖంగా చర్చకు రావాల్సిన తరుణంలో చాలా స్ట్రాటజికల్ గా పవన్ కళ్యాణ్ ఓ పసలేని అంశాన్ని సంస్కార రహిత పద్దతిలో తెరపైకి తెచ్చి చర్చ చేసి తనకు అప్పగించిన అస్సైన్మెంట్ పూర్తిచేశారు. అందరూ ఆలోచించినట్టే పవన్ తన ఎజెండా ఎప్పుడో పక్కన పెట్టారు. కేవలం జెండా మాత్రమే పట్టుకుంటారు. జెండా పవన్ కళ్యాణ్ ది. ఎజెండా మాత్రం వేరే వారిది. ఈ తరహా పవనిజం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Also Read:పీసీసీ చీఫ్ సిద్ధూ రాజీనామా – బీజేపీ పెద్దలతో భేటీకి మాజీ సీఎం అమరీందర్