గత సాధారణ ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాకతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి బరిలో దిగి భంగపడ్డ పవన్ కళ్యాణ్ ఈసారి తూర్పుకి తిరిగి ఓటర్లకు దణ్ణం పెట్టే అవకాశం కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా ఆయన పావులు కదుపుతున్నారు. తనకు సురక్షిత స్థానం గుర్తించే పనిలో ఆయన పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దానికి అనుగుణంగా ప్రాధమిక కసరత్తులు పూర్తి చేసినట్టు సమాచారం.
రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు వీలుగా తూర్పు గోదావరి జిల్లాలోని ఓ అసెంబ్లీ స్థానం వెదుక్కునే పనిలో పవన్ కళ్యాణ్ పడ్డారు. దానికి తగ్గట్టుగా ఇప్పటికే టీడీపీతో జతగడుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఒంటరిగా తన వల్ల ఏమీ కాదని నిర్ణయించుకున్న పవన్ టీడీపీ తోడ్పాటుతోనే తాను సైతం గెలవగలననే అంచనాకు వచ్చారు. విడివిడిగా పోటీ చేసి జగన్ ని గెలిపించడం అటు ఉంచితే వ్యక్తిగతంగా తాను కూడా విజయం సాధించలేని స్థితి ఉన్నందున మిత్రపక్షాల తోడ్పాటు అనివార్యంగా భావిస్తున్నారు. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో కూడా జనసేన ఉనికి చాటిందంటే దానికి టీడీపీ మద్ధతు కారణమని గ్రహించిన పవన్ దానికి తగ్గట్టుగా వ్యూహం మార్చుకున్నట్టు స్పష్టమవుతోంది.
ఇక వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు అనుగుణంగా తూర్పు గోదావరి జిల్లాలోని మూడు స్థానాల మీద కన్నేసినట్టు కనిపిస్తోంది. అందులో ఒకటి రాజమండ్రి రూరల్ కాగా, రెండోది కాకినాడ రూరల్. మూడోది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఈ మూడింటిలో ఏది తనకు శ్రేయస్కరం అన్నది తేల్చుకోవడమే ఇప్పుడు పవన్ కర్తవ్యంగా భావిస్తున్నారు. రాజమండ్రి రూరల్ స్థానం ప్రస్తుతం టీడీపీ చేతిలో ఉంది. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. తన స్థానంలో వారసుడిగా తమ్ముడి కొడుకు పేరుని ఆయన ఇప్పటికే ప్రకటించారు. దాంతో పాటు రాజమండ్రి అర్బన్ సీటు మీద ఆశతో ఇటీవల తన పార్టీలో పెద్ద హంగామానే సృష్టించారు. స్థానిక ఎన్నికల్లో జనసేనకు అంతో ఇంతో ఓట్లు, సీట్లు వచ్చిన కడియం మండలం కూడా ఈ నియోకవర్గ పరిధిలోనే ఉండడంతో పవన్ ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు.
ఇక కాకినాడ రూరల్ స్థానం ప్రస్తుతం మంత్రి కన్నబాబు చేతిలో ఉంది. మొన్నటి ఎన్నికల్లోనే కన్నబాబుని ఓడించాలని పవన్ చివరి వరకూ ప్రయత్నించారు ఆయన ఆఖరి ఎన్నికల సభ కూడా ప్రచారగడువు ముగిసే ముందు ఆ నియోజకవర్గంలోనే నిర్వహించారు. ప్రజారాజ్యం నాటి నుంచి కన్నబాబుతో ఉన్న వైరం తీర్చుకోవడానికి పవన్ చేసిన యత్నాలు విఫలమయ్యాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో తానే అక్కడి నుంచి బరిలో దిగాలనే సంకల్పం పవన్ లో ఉన్నట్టు చెబుతున్నారు. అన్ని సమీకరణాలు కలిసి వస్తాయంటే అక్కడ రంగంలో దిగే అవకాశం ఉంది. దానికన్నా పిఠాపురం అసెంబ్లీ స్థానం అత్యంత సురక్షితమని జనసేన నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడం, ప్రత్యర్థి పార్టీలలో బలమైన నేతలు లేకపోవడం పవన్ కోరిక తీరేందుకు దోహదపడుతుందని లెక్కిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఈ సీటు కూడా పరిశీలన చేయాలని పవన్ కి చెప్పినా ఆయన తప్పుడు అంచనాలు వేసినట్టు తేలింది.
ఇటీవల పూర్తిగా కాపుసేనగా రూపాంతంరం చెందే ఆలోచనతో ఉన్న పవన్ కి కాపులు ఎక్కువగా ఉండే కాకినాడ రూరల్, పిఠాపురం స్థానాల్లో ఒకటి సురక్షితమనే లెక్కలు వేస్తున్నారు. బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉండే రాజమండ్రి రూరల్ సీటు వ్యవహారం కొంత సమస్య అవుతుందని భావిస్తున్నారు. దాంతో ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఏదో ఒక స్థానంలో కేంద్రీకరించాలనే ఉద్దేశంతో ఉన్న జనసేనాని త్వరలో తూర్పులో తన సీటు విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.