iDreamPost
android-app
ios-app

ఆ మాజీ మంత్రి పదేళ్ల తరువాత రాజకీయ సన్యాసం చేస్తారంట

ఆ మాజీ మంత్రి పదేళ్ల తరువాత రాజకీయ సన్యాసం చేస్తారంట

రాజకీయాల్లో విజయం కొత్త అవకాశాలను కల్పిస్తుంది. అదే ఒక్కసారి ఓడిపోయినా దశాబ్ధాల రాజకీయ జీవితాన్ని కుదిపేస్తుందనేందుకు మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి రాజకీయ జీవితమే ఉదహరణ. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన పట్నం మహేందర్‌ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఊహించని ఓటమి ఆయన్ను రాజకీయంగా దెబ్బతీసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మహేందర్‌ రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తాజాగా ఆయన చేసిన ప్రకటన ద్వారా అర్థమవుతోంది. రాబోయే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని చెప్పిన మహేందర్‌ రెడ్డి.. ఆ తర్వాత రిటైర్మెంట్‌ తీసుకుంటానని ప్రకటించారు. 2028లో తాను పోటీచేయబోనని చెప్పి చర్చకు తెరతీశారు.

ప్రస్తుత రాజకీయాల్లో 70, 80 పడిలో ఉన్న నేతలు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో 58 ఏళ్ల మహేందర్‌ రెడ్డి భవిష్యత్‌లో తీసుకోబోయే రిటైర్మెంట్‌ గురించి ఇప్పుడే ప్రకటన చేయడంపై అసలు ఏం జరిగిందనే చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో తాండూరు నుంచి మరోమారు పోటీ చేసిన మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి పైలెట్‌ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. కొడంగల్‌లో తన తమ్ముడు పట్నం నరేందర్‌ రెడ్డిని పోటీలో నిలబెట్టి..రేవంత్‌ రెడ్డిపై గెలిపించుకున్న మహేందర్‌ రెడ్డి తాను ఓడిపోవడంతో రాజకీయంగా దెబ్బతిన్నారు. 2019 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మహేందర్‌ రెడ్డి మళ్లీ మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే గులాబీ అధినేత.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ పరిణామంతో మహేందర్‌ రెడ్డి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత దక్కకపోవడం, మరో వైపు సబితా ఇంద్రారెడ్డి దూసుకెళుతుండడంతో రాజకీయంగా రంగారెడ్డి జిల్లాలో వెనుకబడుతున్నాననే వేదనతో ఉన్నారు.

రంగారెడ్డి జిల్లాలో పటోళ్ల ఇంద్రారెడ్డి మేనళ్లుడుగా రాజకీయరంగ ప్రవేశం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాపై రాజకీయంగా పట్టుసాధించారు. 1983లో చేవెళ్లలో లోక్‌దల్‌ పార్టీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన పటోళ్ల ఇంద్రారెడ్డి 1985లో టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్య, కార్మిక,ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశారు. 1989 లోనూ టీడీపీ తరఫున ఇంద్రారెడ్డి గెలిచారు. 1994 ఎన్నికల్లో తన మేనళ్లుడు పట్నం మహేందర్‌ రెడ్డికి తాండూరు సీటు ఇప్పించారు. ఆ ఎన్నికల్లో ఇంద్రారెడ్డితోపాటు మహేందర్‌ రెడ్డి కూడా గెలిచారు.

Also Read : హుజూరాబాద్ ఉప ఎన్నికపై క్లారిటీ..?

1994–95 మధ్య ఎన్టీఆర్‌ కేబినెట్‌లో ఇంద్రారెడ్డి హోం మంత్రిగా పని చేశారు. వైశ్రాయ్‌ ఉదంతంలో ఇంద్రారెడ్డి, తన మేనళ్లుడు మహేందర్‌ రెడ్డితో కలసి ఎన్టీఆర్‌ వైపు నిలబడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ లక్ష్మీ పార్వతి టీడీపీలో చేరారు. 1996 ఎన్నికల్లో మహేందర్‌ రెడ్డి లక్ష్మీ పార్వతి టీడీపీ తరఫున హైదరాబాద్‌ లోక్‌సభ నుంచి పోటీ చేసి లక్ష ఓట్లు సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో ఇంద్రా రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరగా.. మహేందర్‌ రెడ్డి టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసిన మహేందర్‌ రెడ్డి గెలిచారు. చేవెళ్లలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఇంద్రారెడ్డి విజయం సాధించారు. 2000 ఏప్రిల్‌ 22వ తేదీన శంషాబాద్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి దుర్మరణంపాలయ్యారు.

ఇంద్రారెడ్డి మరణం తర్వాత సబితా ఇంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకెళ్లేందుకు మహేందర్‌ రెడ్డి యత్నించారు. ఇంద్రారెడ్డి కుటుంబానికి రాజకీయంగా తాను అండగా ఉంటానని వైఎస్‌ రాజశేఖరరెడ్డి భరోసా ఇవ్వడంతో మహేందర్‌ రెడ్డి ప్రయత్నాలు ఫలించలేదు. 2004 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సబితా ఇంద్రా రెడ్డి, తాండూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా మూడో సారి మహేందర్‌ రెడ్డి పోటీ చేయగా.. సబితా గెలిచారు, మహేందర్‌ రెడ్డి ఓడిపోయారు. చెప్పినట్లుగానే సబితా ఇంద్రారెడ్డికి వైఎస్‌ఆర్‌ సముచిత స్థానం కల్పించారు. తన కేబినెట్‌లో హోం మంత్రిగా నియమించారు. అంతేకాకుండా ప్రతి కార్యక్రమాన్ని చేవెళ్ల నుంచే వైఎస్‌ ప్రారంభించడంతో.. వైఎస్‌ఆర్‌ చేవెళ్ల చెల్లెమ్మగా సబితకు పేరు వచ్చింది.

2009లో మహేందర్‌ రెడి గెలిచారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో మహేందర్‌ రెడ్డి టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున గెలిచి.. కేసీఆర్‌ కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన సతీమణి సునీతారెడ్డికి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠం ఇప్పించుకున్నారు. 2014–18 మధ్య రంగారెడ్డి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మహేందర్‌ రెడ్డి.. 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ వైభవాన్ని కోల్పోయారు.

అంతేకాకుండా సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్‌ నుంచి తీసుకువచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వడంతో.. ఇకపై రంగారెడ్డి జిల్లాలో ఆయన హవా సాగదనే అభిప్రాయానికి మహేందర్‌ రెడ్డి వర్గం వచ్చింది. ఈ పరిణామాలతోనే మహేందర్‌ రెడ్డి సందర్భం కాకపోయినా.. తన భవిష్యత్‌ రాజకీయంపై ప్రకటన చేశారని భావిస్తున్నారు. అయితే ఈ ప్రకటన వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు ఆయన ప్రత్యర్థులు. 2023 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ప్రజలకు వివరించడం ద్వారా గెలిచేందుకే ఆయన ఈ ఎత్తుగడ వేశారని ఆయన ప్రత్యర్థి వర్గం విమర్శిస్తోంది. రాజకీయ నేతలు తమ రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి చేసే ప్రకటనలు నీటిమీద రాతలని చరిత్ర చెబుతోంది. 2028 నాటి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఏది ఏమైనా మహేదర్‌ రెడ్డి రిటైర్మెంట్‌ ప్రకటన.. 2023 ఎన్నికల్లో ఆయనకు విజయం చేకూరుస్తుందా..? లేదా..? చూడాలి.

Also Read : అక్కడా దళిత బంధు.. ప్రతిపక్షాలకు షాకిస్తున్న కేసీఆర్