iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ సందిగ్దంలో ఉన్నారా? మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల వ్యవహారంలో ఎందుకీ అస్పష్టత..

  • Published Feb 17, 2021 | 3:25 AM Updated Updated Feb 17, 2021 | 3:25 AM
నిమ్మగడ్డ సందిగ్దంలో ఉన్నారా? మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల వ్యవహారంలో ఎందుకీ అస్పష్టత..

పంచాయితీ పోరు ముగింపు దశకు వచ్చింది. మూడో విడత పోలింగ్ పూర్తవుతోంది. ఇప్పటికే ఏకగ్రీవాల విషయంలో 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వాటి కన్నా ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌ లోనే ఎక్కువ కావడం గమనార్హం. దాంతో ప్రభుత్వం ప్రకటించిన నజరానాలు అందరినీ ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీ కొన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని స్పష్టమవుతోంది.

అదే పంథాలో తాజాగా మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. మార్చి 10న పోలింగ్ నిర్వహించాలని, 14 ఓట్ల లెక్కింపు జరుగుతుందని ప్రకటించారు. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే మళ్లీ తిరిగి ప్రారంభించాలనే సంకల్పించింది. అప్పట్లో మార్చి 14న నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించారు. దానికి అనుగుణంగా బరిలో ఉన్న అభ్యర్థులంతా ప్రచారం ప్రారంభించి, ప్రజల చెంతకు వెళుతున్నారు

ఈ క్రమంలోనే ఎస్ఈసీ మరోసారి తన ప్రకటనను సవరించినట్టు కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచి ప్రారంభిస్తామని చెప్పిన ఎస్ఈసీ అందుకు భిన్నమైన ఉత్తర్వులు ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సందిగ్ధంలో ఉన్నారా లేక విపక్షాల ఒత్తిడికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారా అనే అభిప్రాయం వినిపిస్తోంది. మునిసిపల్ ఎన్నికల విషయంలో ఏకగ్రీవాలను ఎస్ఈసీ గతంలోనే అంగీకరించింది. అప్పట్లో వాటిని ధృవీకరించి బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారు చేసింది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం అప్పట్లో ఎవరైనా ఒత్తిడితో నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని చెప్పడం ఎస్ఈసీ అస్పష్టతకు నిదర్శనంగా ఉంది.

ఎన్నికలు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి, మళ్ళీ నామినేషన్ల విషయంలో పరిశీలనకు అవకాశం ఇస్తామని చెప్పడం తాను మొదటి చేసిన ప్రకటనకు పూర్తి విరుద్ధమేనన్నది సుస్పష్టం. అంతేగాకుండా చివరకు పత్రికా కథనాల ఆధారంగా కూడా నామినేషన్ల విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ద్వారా ఎస్ఈసీ మరింత అస్పష్టత రాజేస్తున్నట్టు కనిపిస్తోంది. మునిసిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగించడానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. కానీ ఎస్ఈసీ మెలికలతో వ్యవహారం మరోసారి వివాదంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. మాచర్ల సహా పలు మునిసిపాలిటీలలో ఏకగ్రీవంగా జరిగిన కౌన్సిలర్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీసుకున్న కీలక నిర్ణయం పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం.

మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మళ్లీ విడుదల చేయాలని టీడీపీ, జనసేన వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఎస్ఈసీ మాత్రం వాటిని తోసిపుచ్చి గత మార్చి 15న వాయిదా వేసిన నాటినుంచి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కానీ తీరా ఆచరణలో అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఇది అనేక మునిసిపాలిటీలలో మళ్లీ నామినేషన్ల పరిశీలన అంటే వ్యవహారం ఎటు దారితీస్తుందోననే చర్చమొదలవుతోంది. స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చి, తర్వాత ఇలాంటి మార్పులకు నిమ్మగడ్డ ఎందుకు సిద్ధపడుతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.