iDreamPost
android-app
ios-app

సినీ జనాల ప్రశ్నలకు బదులేది

  • Published Jul 11, 2021 | 6:49 AM Updated Updated Jul 11, 2021 | 6:49 AM
సినీ జనాల ప్రశ్నలకు బదులేది

ఒకవైపు కరోనా తాలూకు పరిణామాలతో సినీ పరిశ్రమ ఉక్కిరి బిక్కిరి అవుతోంటే మరోపక్క కేంద్ర ప్రభుత్వం సెన్సార్ నిబంధనలతో పాటు సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తెచ్చేనందుకు కంకణం కట్టుకోవడం పట్ల అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఓటిటిల పేరిట విశృంఖలత్వాన్ని కట్టడి చేయలేని వ్యవస్థ పనిగట్టుకుని సినిమా మీద కొత్త అస్త్రాలను ప్రయోగించడం ఏమిటని 24 క్రాఫ్ట్స్ నిపుణులు భగ్గుమంటున్నారు. 1952లో రూపొందిన చట్టంలో సవరణలు చేయడం అవసరమే కానీ మరీ సృజనాత్మకతకు సంకెళ్లు వేసేలా చేయడం ఎందుకనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే వాళ్ళు కరువవుతున్నారు. 2013, 2016లో నియమించిన రెండు వేర్వేరు కమిటీల నివేదికలను ఆధారంగా చేసుకుని వీటిని రూపొందిస్తున్నామని అంటున్నారే తప్ప వాస్తవిక కోణంలో ఆలోచించడం లేదు.

1983లో చేసిన సెన్సార్ సవరణలకు అదనంగా యు/ఏ సర్టిఫికేషన్ ని మూడు విభాగాలుగా చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఎవరికీ అంతు చిక్కడం లేదు. సినిమాలకు ఇచ్చే పది సంవత్సరాల సెన్సార్ సర్టిఫికెట్ కనీస కాల పరిమితిని తీసేయడం కూడా నిర్మాతకు రాబోయే రోజుల్లో పెనుభారంగా మారనుంది. పైరసీని కట్టడి చేయడం కోసం కొత్త ఆంక్షలు తీసుకొచ్చారు కానీ విదేశీ సర్వర్ల నుంచి వీటిని అప్ లోడ్ చేసేవాళ్లను ఎలా పట్టుకుంటారు అనేది భేతాళ ప్రశ్నే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సెన్సార్ అయిన సినిమాను ఏ దశలో అయినా నియంత్రించే అధికారికం ప్రభుత్వానికి కట్టబెట్టడం మీదే ఇప్పుడు జరుగుతున్న రచ్చ కేంద్రీకృతమయ్యుంది

కేంద్రం వాదన ఎలా ఉన్నా ఇప్పుడీ మార్పుల వల్ల జరిగే లాభాల కంటే నష్టాలు ఎక్కువ. ఉదాహరణకు అప్పుడెప్పుడో వచ్చిన బొబ్బిలి పులి, అర్ధరాత్రి స్వతంత్రం, బండిట్ క్వీన్ లాంటి సినిమాలు విడుదలకు ముందు ఇబ్బందులు ఎదురుకున్నాయి. ఇప్పుడీ కొత్త లా ప్రకారం ఇలాంటి చిత్రాలు ఇప్పుడెవరైనా తీస్తే ఏ క్షణంలో అయినా వాటికి సంబంధించి కేసులు లేదా ఇబ్బందులను నిర్మాతలు ఎదురుకోవచ్చు. దొడ్డిదారిలో సినిమాలు రిలీజ్ చేసేవాళ్లను, పైరసీ గాళ్ళను శిక్షించడం కోసం ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అసలైన అంశాల మీద మాత్రం దాటవేత సమాధానాలే చెబుతోంది. అందుకే దీని మీద ఇంత వ్యతిరేకత వస్తోంది. ఇప్పుడిదంతా జరుగుతోంది కాబట్టి ఏదైనా సానుకూల మార్పు ఉంటుందనుకోవడం కూడా అత్యాశే అనిపిస్తోంది