iDreamPost
iDreamPost
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అయినా ఇప్పటినుంచే నారా, నందమూరి కుటుంబాలకు చెందిన తోడల్లుళ్లు సురక్షిత నియోజకవర్గాల వేటలో పడ్డారు. గత ఎన్నికల్లో మంత్రి హోదాలో మంగళగిరి నుంచి పోటీ చేసి భంగపడిన చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ అక్కడ పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. భద్రమైన వేరే నియోజకవర్గానికి వలసపోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఆయన తోడల్లుడు, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు అయిన ముతుకుమిల్లి శ్రీభరత్ కూడా నియోజకవర్గం మారే ఆలోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తోడల్లుళ్లు ఇద్దరూ ఒకే అసెంబ్లీ నియోజకవర్గంపై గురిపెట్టడమే విశేషం. అదే భీమిలి నియోజకవర్గం. ఇద్దరూ దానికోసమే పట్టుబడితే.. అసలు ఎన్నికల కంటే ముందు ఒకే పార్టీలోని తోడల్లుళ్ల పోటీయే రంజుగా మారుతుంది.
ఇప్పటికే ఫిక్స్ అయిన లోకేష్
అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేశామని టీడీపీ ఘనంగా చెప్పుకుంటున్నా.. ప్రజలు వారి మాటలను విశ్వసించడం లేదని రెండేళ్లనాటి సార్వత్రిక ఎన్నికలు, మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా లోకేష్ పోటీ చేసినా తిరస్కరించిన రాజధాని ప్రాంతంలోని మంగళగిరి ప్రజలు.. స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీకి చావుదెబ్బ కొట్టారు. ఈ అవమానంతో మొహం చెల్లని లోకేష్ మంగళగిరిని పట్టించుకోవడం మానేశారు. సునాయాసంగా విజయం సాధించగలిగే మరో నియోజకవర్గం వెతికిపెట్టమని తన కోటరీ సభ్యులను పురమాయించారు. ఆ మేరకు వారంతా అన్వేషించి విశాఖ నగర పరిధిలోని భీమిలి సురక్షితమని సూచించారు. దాంతో తాము సృష్టించిన అమరావతి రాజధాని ప్రాంతాన్ని వీడి.. వైఎస్సార్సీపీ ప్రకటించిన విశాఖ రాజధాని ప్రాంతానికి వలస వెళ్లాలని లోకేష్ నిశ్చయించుకున్నారు. ఇప్పటికే స్థానిక టీడీపీ నేతలకు సమాచారం కూడా అందించినట్లు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ పార్టీ ఇంఛార్జిగా మండలస్థాయి నేత అయిన కోరాడ రాజబాబును నియమించారు.
భరత్ దృష్టి కూడా దానిపైనే
మరోవైపు లోకేష్ తోడల్లుడు, స్థానిక టీడీపీ నేత అయిన శ్రీభరత్ కూడా భీమిలీపైనే కన్నేశారు. మాజీ ఎంపీ దివంగత ఎంవీవీస్ మూర్తి మనవడైన ఆయన గత ఎన్నికల్లోనే రాజకీయాల్లో చేరి విశాఖ పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉండి.. వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దాని బదులు అసెంబ్లీ బరిలో నిలవాలని భావిస్తున్నారు. తన పోటీకి భీమిలి అనువైనదిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పైగా తన గీతం విద్యాసంస్థలు దాదాపు ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉండటం కలిసివచ్చే అంశమని అనుకుంటున్నారు.
ఈ పోటీలో గెలిచేదెవరో?
తోడల్లుళ్లు ఇద్దరూ ఒకే నియోజకవర్గంపై మనసుపడటం టీడీపీలో ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది. భీమిలిలో గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అక్కడ తన బలాన్ని బాగా పెంచుకున్నారు. రాజధాని కానుండటం, జోరుగా జరుగుతున్న అభివృద్ధి పనులు, అందరికీ అందుతున్న సంక్షేమ ఫలాలు వైఎస్సార్సీపీని పటిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో లోకేష్, భరత్ లలో ఎవరు పోటీ చేసినా ఎదురీదక తప్పదు. అయితే దానికంటే ముందు పార్టీ టికెట్ సంపాదించే విషయంలో వారిద్దరూ పరస్పర యుద్ధం చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే పరపతిపరంగా ఇద్దరూ సమవుజ్జీలే. గత ఎన్నికల సమయంలోనూ వారి మధ్య దాదాపు ఇటువంటి పోటీయే జరిగింది. భరత్ కు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వాలని మొదట నిర్ణయించారు. లోకేష్ భీమిలి నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన తోడల్లుళ్లు ఒకే ప్రాంతం నుంచి పోటీచేస్తే వేరే సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతో.. భరత్ ను పోటీ నుంచి తప్పుకోమని సూచించారు. అయితే ఆయన అందుకు నిరాకరించారు. పట్టుబట్టి కూర్చోవడంతో.. చివరికి లోకేష్ మంగళగిరికి మారి.. శ్రీభరత్ ఇక్కడ పోటీ చేశారు. వచ్చే ఎన్నికల ముందు కూడా ఇటువంటి పరిస్థితే తలెత్తవచ్చునని అంటున్నారు.