iDreamPost
android-app
ios-app

ముత్యాల పాప రాజకీయ స్టెప్ ఎటు ఉండపోతుంది?

  • Published Sep 09, 2021 | 6:26 AM Updated Updated Mar 11, 2022 | 10:42 PM
ముత్యాల పాప రాజకీయ స్టెప్ ఎటు ఉండపోతుంది?

విశాఖ జిల్లా రాజకీయాల్లో నర్సీపట్నం నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఏజెన్సీకి ముఖద్వారమైన ఈ నియోజకవర్గం మన్యం ఛాయలు ఉన్నప్పటికీ సంపన్న రాజకీయాలకు నిలయం. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీనే ఆదరిస్తున్నా 1989లో కాంగ్రెస్, 2009లో వైఎస్, 2019లో జగన్ హవాలో టీడీపీ ఓటమి చవి చూసింది. 2009లో టీడీపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన బోలెం ముత్యాల పాప ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో ఎదురులేని అయ్యన్న పాత్రుడిని ఓడించి సంచలనం సృష్టించారు. కానీ ఆ తర్వాత ఆమె రాజకీయంగా తప్పటడుగులు వేసి తెర వెనక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నా.. పార్టీ గానీ, నియోజకవర్గ నేత అయ్యన్న గానీ ముత్యాల పాప ఉనికినే పట్టించుకోవడంలేదు. దాంతో ఆమె రాజకీయ జీవితం డోలాయమానంలో పడింది.

ఉన్నత రాజకీయ కుటుంబం

నర్సీపట్నం నియోజకవర్గంలో బోలెం కుటుంబానికి మంచి పేరుంది. సామాజికవర్గ పరంగా, బంధుగణం, శ్రేయోభిలాషులు విశేషంగా ఉన్నారు. ప్రజలకు చేతనైన సాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే ఈ కుటుంబం ప్రజల ఆదరాభిమానాలు చురగొంది. దాంతో రాజకీయాల్లోనూ ఈ కుటుంబం మంచి పట్టు సాధించగలిగింది. బోలెం వెంకటరమణ మూర్తి తాత గోపాత్రుడు 1978లోనే భారత జాతీయ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Also Read : బయటకి రాకపోతే ఉండిలో కష్టమే ‘రాజు’గారూ!

రమణమూర్తి, ఆయన సతీమణి ముత్యాల పాప
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. వెంకటరమణ మూర్తి ఒకసారి నర్సీపట్నం ఎంపీపీగా పనిచేశారు. అనంతరం ముత్యాల పాప కూడా ఎంపీపీ అయ్యారు. ఆ సమయంలోనే వెంకటరమణ మూర్తి ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చినా అయ్యన్న పాత్రుడు దక్కకుండా చేశారు. 1996లో అయ్యన్న ఎంపీగా ఎన్నికవ్వడంతో ఎమ్మెల్యే పదవి ఖాళీ చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో అన్ని అర్హతలు ఉన్న వెంకటరమణ మూర్తిని కాదని వేచలపు శ్రీరామమూర్తికి అయ్యన్న టికెట్ ఇప్పించారు.

తెలుగుదేశం నుంచి అయ్యన్న టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అవుతుండటంతో బోలెం వెంకటరమణ మూర్తి కుటుంబం క్రమంగా వెనుకబడింది. ఎంపీపీ పదవులకే వారిని పరిమితం చేశారు. 1989లో టీడీపీ రాష్ట్రంలో ఓడిపోయినప్పుడు అయ్యన్న కూడా ఓటమిపాలయ్యారు. అయితే 2004లో రాష్ట్రమంతా వైఎస్ గాలి వీచిన నర్సీపట్నంలో మాత్రం గెలిచిన అయ్యన్నకు చెక్ పెట్టేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి బోలెం కుటుంబాన్ని కాంగ్రెసు లోకి ఆహ్వానించి 
2009 ఎన్నికల్లో మహిళల కోటాలో మూర్తి సతీమణి, అప్పటికి ఎంపీపీగా ఉన్న ముత్యాల పాపకు టికెట్ ఇచ్చారు. ఆమె టీడీపీ అభ్యర్థిగా నిలబడిన అయ్యన్నను ఓడించి ఎమ్మెల్యే అయ్యారు.

టీడీపీలో చేరిక, నిరాదరణ

వైఎస్ మరణం, రాష్ట్ర విభజన తదితర పరిణామాల్లో కాంగ్రెసులో మనుగడ ఉండదని భావించిన ముత్యాల పాప 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ లో చేరేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ కూడా ఆమెను చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఆ సమయంలోనే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడికి బోలెం దంపతులు తమ కుమార్తెనిచ్చి వివాహం చేశారు. కాగా ఎమ్మెల్యే టికెట్ విషయంలో అప్పటికే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నందున.. ఆమెకు హామీ లభించలేదు. దాంతో ఆ ఎన్నికల్లో మౌనంగా ఉండిపోయారు. అయ్యన్న మళ్లీ ఎన్నికై మంత్రి అయ్యారు.

Also Read:బుచ్చయ్య ఎపిసోడ్‌లో కొత్త వివాదం.. ఎవరు లోకల్‌..? ఎవరు నాన్‌లోకల్‌..?

2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో జగన్ హవాను గుర్తించిన అయ్యన్న స్వయంగా బోలెం వారి ఇంటికి వెళ్లి చంద్రబాబుతో పలు హామీలు ఇప్పించి మరీ ముత్యాల పాపను మళ్లీ టీడీపీలో చేర్పించారు. ప్రచారంలో ఆమె సేవలను విస్తృతంగా వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో డీలా పడిన అయ్యన్న, టీడీపీ అధిష్టానం ముత్యాల పాపను అసలు పట్టించుకోవడం మానేశారు. ఆమె కూడా పేరుకు టీడీపీలో ఉన్నా ఈ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న ఆమె మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశంలేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.