iDreamPost
iDreamPost
టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నాయకత్వం విషయంలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటి వరకూ ఆయనకు పరిస్థితులు అనుకూలించలేదనే చెప్పాలి. దానిమూలంగానే టీడీపీకి తదుపరి నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ పేరు కార్యకర్తల్లో వినిపిస్తోంది. కుప్పం నుంచి కృష్ణా జిల్లా వరకూ అనేక చోట్ల చంద్రబాబు సభల్లోనే అది ప్రస్ఫుటించింది. దాంతో తనకు పోటీగా బలమైన పేరు వినిపిస్తున్న తరుణంలో తన మార్క్ చాటుకోవాలనే తపన లోకేష్ లో బాగా పెరిగింది.
తన బ్రాండ్ రాజకీయాల్లో రాణించాలని ఆశిస్తున్న లోకేష్ ఇటీవల పరామర్శలను పెద్ద అస్త్రంగా మలచుకుంటున్నారు. ఎక్కడ ఏ మరణవార్త విన్నా వెంటనే ఆ కుటుంబాల చెంత వాలిపోవాలనే భావిస్తున్నారు. ఇప్పటికే జైలుకెళ్లిన టీడీపీ ముఖ్యులను పరామర్శించడం, వివిధ ఘటనల్లో బాధితులను పరామర్శించడం చూస్తుంటే ఈ సానుభూతి యాత్రలే తనను నిలబెడతాయని ఆయ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి అసలు కారణం జగన్ ఓదార్పు యాత్రల ప్రభావం కూడా ఉండొచ్చన్నది ఓ అంచనా.
గుంటూరు ఘటనలో ఒంటరిగా పరామర్శకు వెళ్లి రాజకీయ లక్ష్యాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆయన అరెస్ట్, ఆరు గంటల పాటు నిర్బంధించడం వంటివి జరిగతాయి. ఆ తర్వాత వెంటనే లోకేష్ కర్నూలు బయలుదేరారు. ఏడాది క్రితం జరిగిన ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఈసారి మాత్రం తన వెంట కాంగ్రెస్, సీపీఐ, జనసేన సహా ఇతర పార్టీలు కూడా ఉండడం విశేషం. అఖిలపక్ష బృందంగా నారా లోకేష్ నేతృత్వంలో గోనెగండ్ల మండలం, ఎర్రబాడు గ్రామంలో గత ఏడాది ఆగస్టు 17 న దారుణ హత్యకు గురైన హాజీరా బి కుటంబాన్ని పరామర్శించి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం
టీడీపీలో నాయకుడిగా ఎదిగే యత్నాల్లో ఉన్న లోకేష్ అదే సమయంలో ఇతర పార్టీల నేతలను కూడా నడిపించాలనే తపన పడుతున్నట్టు కనిపిస్తోంది. సీపీఐ రామకృష్ణ, కాంగ్రెస్ తులసీరెడ్డి కూడా లోకేష్ వెంట కర్నూలు వెళ్లడం విశేషం. ఇలాంటి ప్రయత్నాలు లోకేష్ స్టామినా పెంచుతాయని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా అఖిలపక్షాలు కూడా ఆయన వెంట వస్తున్నాయనే అభిప్రాయం ప్రజల్లో కలిగిస్తుందని అంచనా వేస్తోంది. కానీ ఇప్పటికే సీపీఐలో కూడా టీడీపీతో కలిసి సాగడం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్ తో టీడీపీ ఐక్యత కూడా ప్రశ్నార్థకమే. దాంతో లోకేష్ ప్రయత్నాలు ఈ ఘటన వరకేనా లేక భవిష్యత్తు ఎన్నికల వరకూ ఉంటుందా అంటే అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంశాల వారీగా కొన్ని సందర్భాల్లో కలిసి మరొకన్ని విషయాల్లో ఆయా పార్టీలు టీడీపీని విమర్శించే పరిస్థితి తెచ్చుకుంటే అది టీడీపీకే తలనొప్పి అవుతుంది. అలాగాకుండా ఉమ్మడిగా కలిసి సాగాలని ఆశిస్తే దానికి హర్డిల్స్ చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో లోకేష్ నాయకత్వం బలపడుతుందా లేదా లేక అఖిలపక్షాలు బూమరాంగ్ అవుతాయా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
Also Read : గుండెపోటుకు గురైన టీడీపీ సీనియర్ నేత పరిస్థితి ఎలా ఉంది..?