Idream media
Idream media
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. ఆయన బాటలో మరికొంత మంది నేతలు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ పైనా, ప్రభుత్వంపైనా అసంతృప్తి ఉన్న దిగ్గజ నేతలంతా ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు.
మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వశ్వరరెడ్డి సైతం బీజేపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి వైదొలిగి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వశ్వరరెడ్డి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు.
ఆయన రాజీనామా చేసిన తొలి నాళ్లలో ఈటలకు జరిగిన ప్రచారం మాదిరిగానే కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈటల ఎపిసోడ్ అనంతరం ఇద్దరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక వర్గాలతో కలిసి కూటమికి ప్లాన్ చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. కొండా కొంత వరకూ ఆ ప్రయత్నాలు చేశారు కూడా. ఈటలతో పలు మార్లు భేటీ అయినప్పుడు ఈ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని తన రాజీనామా సందర్భంగా కొండా వెల్లడించారు. అయితే ఆయన బీజేపీ గూటికి చేరడం ఖాయమనే ప్రచారం అప్పటి నుంచి జరుగుతూనే ఉంది.
తాజాగా బీజేపీ నేత డీకే అరుణతో కొండా విశ్వశ్వేర రెడ్డి సమావేశం అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరికపై ఆయన చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో ఆలస్యం చేయవద్దని వెంటనే నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ సూచించినట్టుగా సమాచారం. దీనికి కొండా కూడా సానుకూలంగానే స్పందించారని టాక్ వినిపిస్తోంది.ఇక అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. త్వరలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. పరిణామాలు చూస్తుంటే ఈటలతోపాటు కొండా కూడా బీజేపీలో చేరేలా కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. కొండా తన అభిప్రాయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.