తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోసం శ్రీకాకుళం జిల్లా రాజకీయాలపై ఉన్న పట్టును కింజారపు ఫ్యామిలీ కోల్పోతోందా..? తమ రాజకీయ భవిష్యత్‌ను బాబు కోసం ఫణంగా పెడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్థానిక ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రాజకీయాలు చేయడమే ఇప్పుడు కింజారపు ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్‌పై అనేక సందేహాలకు ఆస్కారం ఏర్పడుతోంది.
అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటును ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను తెలుగుదేశం రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మెజారిటీ నేతలు సమర్థించకపోయినా వ్యతిరేకించడంలేదు. కర్నూలులోని కేఈ కుటుంబంగానీ, విజయనగరంలోని అశోక్ గజపతి రాజుతో సహా ముఖ్యనేతలెవ్వరూ మూడు రాజధానులను వ్యతిరేకించడంలేదు. కానీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజారపు కుటుంబం మాత్రం అమరావతే రాజధాని కావాలంటోంది.
పార్టీ ఐదైనా.. తమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం పని చేసే వారినే ప్రజలు ఆదరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధిలో ఎక్కడ ఉన్నాయి..? ఉత్తరాంధ్ర, సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఎక్కడ ఉన్నాయన్నది.. ఇటీవల విధించిన లాక్‌డౌన్‌లోనే స్పష్టమైంది. కృష్ణా, గోదావరి నదులతో ఆ నాలుగు జిల్లాలు సస్యశ్యామలవడంతో.. అక్కడ ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా మిగతా జిల్లాల ప్రజల కన్నా ఎంతో ముందు ఉన్నారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర, సీమ, ప్రకాశం నెల్లూరు జిల్లాల ప్రజలు పొట్టచేతపట్టుకుని వలసవెళతున్నారు. శ్రీకాకుళం వెనుకబాటు గురించి ఎంపీ కింజారపు రామోహ్మన్ నాయుడుకు, అచ్చెం నాయుడకు తెలియదు అనుకోవడం పొరపాటు అవుతుంది.
విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయితే.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విరివిగా లభిస్తాయనడంలో సందేహంలేదు. నెట్‌వర్క్ కంపెనీల కేబుల్ కోసం గోతులు తీసేందుకు, సిమెంట్ పనులకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు హైదరాబాద్, చెన్నై సహా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈడొచ్చిన ఆడపిల్లలను ఎవరో ముక్కుమొహం తెలియని వారికి కట్టబెట్టే పరిస్థితి నుంచి శ్రీకాకుళం జిల్లా ప్రజలు బయటపడే పరిస్థితి కార్యనిర్వాహక రాజధాని వల్ల లభిస్తుంది. సరైన ఉపాధి స్థానికంగానే లభిస్తే.. పిల్లలకు చదువులకు ఇబ్బంది ఉండదు. సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.
మూడు రాజధానుల వల్ల ఇలాంటి మార్పు.. స్థానిక ప్రజలకు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే ఇవేమీ పట్టని కింజారపు ఫ్యామిలీ అమరావతే కావాలంటోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అమరావతిపై కేంద్రం వైఖరి ఏమిటో తేల్చుకుంటామంటూ శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రకటనలు చేశారు. నోటి మాటగా కాకుండా రాతపూర్వకంగా న్యాయస్థానాల్లో కేంద్రం.. అమరావతిపై తన వైఖరిని స్పష్టంగా చెప్పింది. అయిన సదరు యువ ఎంపీ మాత్రం మళ్లీ కేంద్రం వైఖరి ఏమిటో తేల్చుకుంటాననడం ఎవరి ప్రయోజనాల కోసమే అర్థం కావడం లేదు.
గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ శ్రీకాకుళం జిల్లా ప్రజలు తమ ఎంపీగా రామ్మోన్‌నాయుడును, టెక్కలి ఎమ్మెల్యేగా అచ్చెం నాయుడును గెలిపించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఒక ఎంపీ, పది ఎమ్మెల్యేల సీట్లకు గాను.. 8 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెల్చుకున్నా.. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అచ్చెం నాయుడు, ఎంపీగా నిలబడిన రామ్మోహన్ నాయుడు గెలిచారంటే.. అది వారి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణే కారణమని చెబుతున్నారు. అయితే తాజాగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా కింజారపు ఫ్యామిలీ చేస్తున్న రాజకీయాలు.. వారి రాజకీయ భవిష్యత్‌ను రిస్క్‌లో పెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.