స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బయటపడింది. పార్టీ ఎంపీ కేశినేని నాని ఒకవైపు, ఇతర నేతలంతా మరోవైపు నిలబడ్డారు. గతంలో “టీం విజయవాడ” అంటూ నాయకులు అందరినీ ఒకే తాటిపై నిలిపి రాజకీయాలు నడిపిన కేశినేని ఇప్పుడు ఒంటరి అయ్యారు.
నగరంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఒక్కటయ్యారు. కేశినేని ఒంటరి అయ్యారు. ఒకప్పుడు కేశినేని కార్యాలయం విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ నేతలందరితో కళకళలాడుతూ ఉండేది. పార్లమెంటు నియోజకవర్గంలోని పార్టీ నేతలందరూ కేశినేని కార్యాలయానికి వస్తూ ఉండేవారు. మరోవైపు విజయవాడ నగర టీడీపీ నేతలంతా కేశినేని కార్యాలయం నుండే కార్యక్రమాలు నిర్వహించేవారు.
అయితే టీడీపీ అధికారంలో ఉండగానే కేశినేని భవన్ లో ఉన్న నగర టీడీపీ అప్పటి మంత్రి దేవినేని ఉమా ప్రోత్సాహంతో విడిపోయి ఆటోనగర్ లో వేరు కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. అయినా నాగుల్ మీరా, జలీల్ ఖాన్ వంటి నాయకులూ, పట్టాభి వంటి అధికార ప్రతినిధులు కేశినేని కార్యాలయానికి వస్తూ ఉండేవారు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోవడంతో నేతల మధ్య విభేదాలు వర్గ పోరుగా మారి వీధిన పడ్డాయి.
మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని విడిపోయిన నేతలు బహిరంగంగానే యుద్దానికి సిద్ధం అయ్యారు. నిన్న మొన్నటి వరకూ కేశినేనితో సఖ్యతగా ఉన్న నాగుల్ మీరా వంటి నాయకులూ, పట్టాభి వంటి అధికార ప్రతినిధులు ఇప్పుడు కేశినేనికి వ్యతిరేక వర్గంలో చేరిపోయారు. కేశినేని కూడా “టీం విజయవాడ” అంటూ ఇంతకు ముందు తన పార్టీ కార్యాలయం బయట పెట్టిన ఫ్లెక్సీలను తొలగించి వాటి స్థానంలో కొత్త చేశారు.
ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కేశినేని ఒంటరి పోరాటం చేస్తున్నారు. గత యేడాది మార్చిలో మున్సిపల్ ఎన్నికలు ప్రకటించినప్పుడు పార్టీ అధిష్టానం కేశినేని కుమార్తె శ్వేత ను నగర మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికలు వాయిదా పడడం, నేతల మధ్య అంతర్యుద్ధం బహిర్గతం కావడంతో ఇప్పుడు కేశినేని కుమార్తెకు ఇతర నేతలనుండి మద్దతు కొరవడింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదటినుండి ప్రారంభించే పక్షంలో గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధను మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీలోని కొందరు ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికల ప్రక్రియ యధాతధంగా మొదలు కావడంతో కొత్తగా నామినేషన్లు వేసే అవకాశం లేకపోవడంతో పునరాలోచించిన నేతలు ఇప్పుడు మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ భార్యకు మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేశినేని తన కుమార్తె కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారు.
కాగా, పార్టీ నేతలు ఎవరూ సహకరించకపోవడం, పార్టీ అధినాయకత్వం తనకు మద్దతివ్వకపోవడంతో కినుక వహించిన కేశినేని ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని పుకార్లు షికార్లు చేయడం మొదలు పెట్టాయి. మొదటినుండి కేంద్రంలో బీజేపీ నేతలతో సఖ్యతగా ఉంటూ వస్తున్న కేశినేని ఇప్పుడు ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంటులో టీడీపీ బలం నలుగురు సభ్యులతో దిక్కులేని పరిస్థితిలో ఉంది. పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా బీజేపీ వైపు వెళ్ళారు. ప్రస్తుతం లోక్ సభలో ముగ్గురు, రాజ్యసభలో ఒక్కరు ఉన్నారు. కేశినేని కూడా బీజేపీ వైపు వెళితే లోక్ సభలో గల్లా జయదేవ్, కె రామ్మోహన్ నాయుడు మాత్రమే మిగులుతారు.
కేశినేని ఇప్పటికే పార్టీ అధిష్టానంపై అలకతో ఉన్నారు. తనను కాదని పార్టీ పార్లమెంటు పగ్గాలు గల్లాకు ఇవ్వడం పట్ల గతంలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల విషయంలో కేశినేని పార్టీ అధినాయకత్వంతో అసంతృప్తిగానే ఉంటున్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వంతో సఖ్యతగా ఉంటున్నారు. విజయవాడ నగరంలో కూడా నేతలు తనకు ఎదురు తిరగడం, పార్టీ అధిష్టానం వారికే మద్దతు ఇవ్వడం వంటి కారణాలతో కేశినేని బీజేపీవైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే కేశినేని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాతనే అని ఆయన అనుచరులు చెపుతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం, తన కుమార్తె కేశినేని శ్వేత అభ్యర్థిత్వం పట్ల పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి కేశినేని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు.