iDreamPost
android-app
ios-app

కేసీఆర్ రెవె “న్యూ” చ‌ట్టం తేబోతున్నారా..?

కేసీఆర్ రెవె “న్యూ” చ‌ట్టం తేబోతున్నారా..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖ‌కు సంబంధించి అసెంబ్లీలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారా..? రెవెన్యూ శాఖ స్థానంలో కొత్త చట్టం తేబోతున్నారా..? ఇప్పుడు అంత‌టా ఇదే చ‌ర్చ‌. తాజాగా కీసర తహసీల్దార్ నాగ‌రాజు వ్యవహారంలో కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. అంత‌కు ముందే అంటే జ‌న‌వ‌రిలోనే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో అవినీతి, అరాచకం, విచ్చలవిడి తనాన్ని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఎవరు ఏమనుకున్నా భయపడేది లేదన్నారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఎమ్మార్వో కార్యాలయాలకు పెట్రోల్ డబ్బాలు తీసుకురావడం ఎక్కువైందన్నారు. దీనిపై ఆ శాఖ వాళ్లు కూడా ఆలోచించుకోవాలని హితవుచెప్పారు. ఎంత బాధ ఉంటే ప్రజలు అలా చేస్తారని సీఎం అన్నారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రభుత్వాల్నే ప్రజలు తీసి పారేస్తున్నారని, అలాంటి రెవెన్యూ శాఖ ఒక లెక్కా? అని వ్యాఖ్యానించారు.

నాగ‌రాజు వ్య‌వ‌హారంతో మ‌రోసారి తెర‌పైకి..

1.10 కోట్లు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ కీసర తహసీల్దార్ నాగ‌రాజు వ్య‌వ‌హారంతో రెవెన్యూ శాఖ ప‌ని తీరు మ‌రోసారి వివాదాస్ప‌ద‌మైంది. ఆ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే మెద‌క్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖ మొత్తాన్ని ప్రక్షాళ‌న చేశారు. త‌హ‌సీల్దార్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వ‌ర‌కూ అంద‌రినీ బ‌దిలీ చేశారు. మార్పులు, చేర్పులు చేశారు. రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వ్యూహంలో భాగంగా ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెడతారన్న సంకేతాలు వస్తున్నాయి. మ‌రో రెండు రోజుల్లో స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్ చట్టం.. కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చాయి. కొత్త రెవెన్యూ చట్టం కూడా సిద్ధమైంది. ముసాయిదా సిద్ధం చేసి అసెంబ్లీలో ప్రవేశపెడతారన్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. సంకేతాలు వస్తున్నాయి .

రెవెన్యూశాఖకు సంబంధించిన పలు విధులను పంచాయతీరాజ్‌, వ్యవసాయశాఖలకు బదిలీ చేయాలని, రెవెన్యూశాఖ పేరు మార్పిడితో పాటు ఆ శాఖకు గల పలు అధికారాలను ఇతర శాఖలకు బదలాయించాలనే ఆలోచనలో సర్కార్ ఉంది . ప్రస్తుతం రెవిన్యూ అధికారుల అవినీతి పెద్ద ఎత్తున బయట పడుతోంది.

గ‌తంలో అసెంబ్లీ సాక్షిగా అసంతృప్తి

సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలన్న నిర్ణయం ఎప్ప‌టి నుంచో ఉంది. రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు నిర్ణయం తీసుకున్న ఆయన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు చేసి వీరిని పంచాయతీరాజ్‌ లేదా వ్యవసాయశాఖలో విలీనం చేయాలని ఆలోచించారు. గతంలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని భావించినా అది వెనక్కు పోయింది. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతిపై గతంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ తీవ్ర అసంతృప్తి చేశారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యోగుల్లో పేరుకుపోయిన అవినీతి రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని సీఎం కేసీఆర్‌ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్య కార్యదర్శి మరియు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ కంటే వీఆర్ఓలకు, త‌హ‌సీల్దార్ల‌కు ఎక్కువ అధికారాలు ఉన్నాయని వ్యాఖ్యానించటం కేసీఆర్ కు రెవెన్యూ వ్యవస్థపై ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మ‌ళ్లీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌డం, దానికి ముందే నాగ‌రాజు వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌డంతో దీనిపై కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.