తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. తమ మాజీ మిత్రుడు ఈటెల రాజేందర్‌ను ఓడించేందుకు టీఆర్‌ఎస్ కసరత్తు చేసింది కానీ ఎన్నికల్లో దాదాపు 25 వేల ఓట్లతో ఓడిపోయింది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే దళితబంధు పథకానికి టీఆర్‌ఎస్ దాదాపు 2000 కోట్లు ఖర్చు చేసింది. ఈ పరిణామం కేసీఆర్‌కి ఊచించని షాక్ అనే చెప్పాలి. చాలా నెలలుగా కేబినెట్ సమావేశం కూడా నిర్వహించకపోవడం మొదలు, పార్టీ పెట్టిన నాటి నుంచి వెన్నంటే నిలబడిన సహచరుడిని పార్టీ నుంచి తప్పించడం వరకు కేసీఆర్ చేసిన అనేక తప్పులకు ఇది మూల్యంగా చెప్పచ్చు. దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికలతో ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు అని సూచనలు కనిపిస్తున్నా నాగార్జున సాగర్‌లో విజయాన్ని చూసి ఇంకేముంది మాకేం ఇబ్బంది లేదనుకున్నారు. కానీ ఇది ఒక పెద్ద షాక్ గానే చెప్పాలి. కేసీఆర్ అధికారంలో ఉన్న కారణంగా ఆయన ఇక్కడ జరుగుతున్న విషయాలు అర్థం చేసుకోలేకపోయారు కానీ ఆంధ్రప్రదేశ్‌లో టీఆరెస్ ను కోరుతున్నట్లు ప్రకటించారు, ఇది అత్యుత్సాహం అనే చెప్పాలి.
అయితే కేసీఆర్ అదృష్టవశాత్తూ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బీజేపీ ఇంకా బలహీనంగానే ఉంది. కానీ ఎలా అయిన తన పాత స్నేహితుడిని ఓడించాలనే ఉద్దేశంతో చేసిన పొరపాట్లకు ఇప్పుడు కాకపోయినా త్వరలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ తన పాత సహచరుడు ఈటల రాజేందర్‌ను ఆరు నూరైనా ఓడించాలని కంకణం కట్టుకోవడమే కాక అధికారాన్ని గట్టిగా ఉపయోగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించి, ప్రభుత్వాన్ని, యంత్రాగాన్ని ఉపయోగించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం మొదలు దళిత బంధు లాంటి పథకాలు ప్రకటించడంతో మొదటికే మోసం వచ్చింది. ఎన్నికలు లేకుంటే ఈ నిధులు, పధకాలు మాకు రావు కదా, ఈటెల రాజీనామా చేయబట్టే మా బతుకులు బాగుపడ్డాయి అని ఓట్లు వేయడంతో మొదటికే మోసం వచ్చింది.
ఇక ఈ ఎన్నికల్లో ఓటుకు ఆరు వేల నుంచి పది వేల రూపాయలు ఇచ్చారనే ప్రచారం సాగింది. మాకు ఎందుకు ఇవ్వడం లేదు అని కొందరు మీడియాకు కూడా ఎక్కడంతో ఎన్నికల సంఘం కేసులు పెట్టిన పరిస్థితి. ఇక ఈ ఓటుకు వేల రూపాయల ప్రచారం దెబ్బకు మొత్తం మారిపోనుంది. ఎందుకంటే ఓటుకు ఆరు వేలు, పదివేలు అనేది తెలంగాణ చరిత్రలో ఇదే మొదటి సారిగా చెప్పవచ్చు. మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నాయా ఈ ఈ నియోజకవర్గంలో మాత్రం 2023 ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అన్ని వేలూ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే ఓటర్లు అసంతృప్తికి లోనవుతారు, మళ్ళీ ఓడిపోక తప్పని పరిస్థితి. మరో రెండేళ్లలోనే ఎన్నికలు రానున్నాయి, అప్పుడు కూడా తప్పక సీటు గెల్లు శ్రీనివాస్ కె ఇవ్వాలి. ఆయన అంత డబ్బు పెట్టుకునే బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. ఇప్పుడంటే ఇక్కడ ఒక్కచోటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, డబ్బు, అధికారం, మ్యాన్ పవర్ అంతా మోహరించి ప్రయత్నాలు చేశారు. ఇక 2023 ఎన్నికల్లోనూ ఈటెల విజయం నల్లేరు మీద నడకే అవడానికి కేసీఆర్ వేసిన బాటే కారణం కానుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇగోలకు పోయి మొత్తానికి నెత్తిన బొప్పి కట్టించుకున్న పరిస్థితి.