ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా స్పీకర్ గా రికార్డ్ సృష్టించారు. మంత్రిగా సుదీర్ఘకాలం పని చేశారు. రాజకీయ జీవితం ప్రారంభించిన పార్టీనే చివరివరకు అంటి పెట్టుకొని ఉన్నారు. కానీ పార్టీ అగ్రనేతలు ఆమె సేవలను, పార్టీ పట్ల విధేయతను గుర్తించకుండా గత ఎన్నికల్లో పక్కన పెట్టేశారు. దాంతో అసంతృప్తికి గురైన ఆ మహిళా నేత పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ నేత మరెవరో కాదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రతిభా భారతి. పార్టీ నిరాదరణకు అనారోగ్యం తోడవడంతో ఆమె ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
రాజకీయ కుటుంబం
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన ప్రతిభా భారతి రాజకీయ, న్యాయవాద కుటుంబానికి చెందిన వారు. గతంలో ఆమె తాత నరసయ్య, తండ్రి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గతంలో ఎమ్మెల్యేలుగా చేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు.. ఆయనకు అండగా నిలిచి తెరవెనుక వ్యూహాలు, పార్టీ నిర్మాణం వంటివి పర్యవేక్షించిన బృందంలో జస్టిస్ పున్నయ్య ఒకరు. తండ్రి బాటలోనే రాజకీయాలపై ఆసక్తితో ప్రతిభా భారతి పీజీ విద్య పూర్తి చేసిన వెంటనే టీడీపీ ఆవిర్భావ సమయంలోనే ఆ పార్టీలో చేరారు. 1983లో మొదటిసారి ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ తొలి కేబినెట్లోనే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 27 ఏళ్లకే ఆ పదవి చేపట్టిన మహిళగా రికార్డ్ నెలకొల్పారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో సాంఘిక సంక్షేమం, ఉన్నత విద్యా శాఖలను నిర్వహించారు. 1999లో ఉమ్మడి ఏపీకి మొదటి మహిళా స్పీకరుగా ఎన్నికై మరో రికార్డ్ సృష్టించారు.
మొన్న కళా.. నిన్న బాబు హ్యాండ్
ఎచ్చెర్ల నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న ప్రతిభకు 2004లో తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోండ్రు మురళీమోహన్ వైఎస్ హవా కారణంగా ప్రతిభను ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఎచ్చెర్ల ఎస్సీ నుంచి జనరల్ కు మారింది. అప్పటివరకు ఉన్న ఉనుకూరు నియోజకవర్గాన్ని రద్దు చేసి రాజాం నియోజకవర్గం ఏర్పాటు చేసి దాన్ని ఎస్సీలకు కేటాయించారు. దాంతో ప్రతిభా భారతి ఎచ్చెర్ల నుంచి రాజాంకు మారాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో నియోజకవర్గం మారినా మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా కోండ్రు మురళీయే ప్రత్యర్థిగా ఎదురయ్యారు. అప్పుడూ
ప్రతిభకు ఓటమి తప్పలేదు.
రాష్ట్ర విభజన, వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో రాజాం నుంచి మళ్లీ పోటీ చేసిన ప్రతిభ అప్పట్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావు లోపాయికారీ రాజకీయాలతో అతి స్వల్పంగా 350 ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు. కళా స్వగ్రామమైన రేగిడి ఆముదాలవలసలో అనూహ్యంగా జోగులుకు మెజారిటీ లభించడమే ప్రతిభ ఓటమికి కారణమైంది. తన ఇలాకాలో ప్రతిభ గెలిస్తే తన ప్రాభవం తగ్గిపోతుందన్న ఆలోచనతోనే కళా తన స్వగ్రామంలో ఆమెకు మెజారిటీ రాకుండా తెరవెనుక మంత్రాంగం నడిపారని అప్పట్లో పార్టీ అధిష్టానానికి ప్రతిభ ఫిర్యాదు చేశారు.
ఇక 2019 ఎన్నికల్లో ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబే ఆమెను పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కోండ్రు మురళీమోహన్ కు టికెట్ ఇచ్చారు. ఆయన ఓటమి పాలైనా.. ఇప్పటికీ ఆయన్నే పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో అనారోగ్యానికి గురైన ప్రతిభ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఆమె కుమార్తె గ్రీష్మ కొన్నాళ్లుగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశాలైతే లేవు. ఈ పరిస్థితుల్లో ప్రతిభా భారతి రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనాన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : చెవిరెడ్డి రూటే సపరేటు…..