ఇటీవలే సంక్రాంతికి రెడ్ తో పలకరించి మంచి హిట్ నమోదు చేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇంకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. అసలు ఏ దర్శకుడితో చేస్తాడనే క్లారిటీ ఇప్పటికీ రాలేదు. ఆ మధ్య త్రివిక్రమ్ ఉండొచ్చనే ప్రచారం జరిగింది కానీ అది కేవలం గాసిప్ గా మిగిలిపోయింది. ఆయనేమో జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి తారక్ ఫ్రీ కాగానే దాని షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో రామ్ నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదేమిటా అని అభిమానులు అయోమయపడుతున్నారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం రామ్ ఒక రిస్కీ సబ్జెక్టు ఓకే చేసే అవకాశం ఉందట.
ఓ డెబ్యూ దర్శకుడు చెప్పిన ట్రిపుల్ యాక్షన్ సబ్జెక్టు బాగా నచ్చిందని ఫైనల్ వెర్షన్ కు పురమాయించాడని దాదాపు ఫైనల్ అయినట్టేనని రామ్ సన్నిహితుల మాట. ఇప్పుడున్న హీరోల్లో చూసుకుంటే మనకు త్రిపాత్రాభినయం చేసిన హీరోల్లో ఇద్దరే కనిపిస్తారు. ఆ మధ్య యంగ్ టైగర్ నటించిన జై లవకుశ ఒకటి. మంచి సక్సెస్ అయ్యింది కానీ ఆశించినంత స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేదు. అంతకు చాలా ఏళ్ళ క్రితం 94లో చిరంజీవి ముగ్గురు మొనగాళ్లులో చిరంజీవి ట్రిపుల్ రోల్ చేశారు. ఇదీ జస్ట్ యావరేజ్ కి ఓ మెట్టు పైన నిలిచింది. మళ్ళీ ఆయన ఇలాంటి కథల జోలికి వెళ్ళలేదు.
మాములుగా డబుల్ ఫోటోల సినిమాలకే మన హీరోలు అంతగా మొగ్గు చూపడం లేదు. అలాంటిది రెడ్ లో డ్యూయల్ రోల్ చేశాక రామ్ ఇలా ఆలోచించడం విచిత్రమే. రామ్ ఏడాదికి పైగా రెస్ట్ లోనే ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ వృధా కాకూడదనే ఉద్దేశంతో అవసరానికి మించిన గ్యాప్ తీసుకుంటున్నాడు. అంత ఇష్టపడి చేసిన రెడ్ కూడా కమర్షియల్ సక్సెస్ అనిపించుకుంది తప్ప క్రాక్ స్థాయిలో సగం కూడా చేరలేదు. ఏది ఏమైనా యూత్ హీరోలు ఇలా ఇంతేసి గ్యాప్ తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రతిది హిట్ కావాలనుకోవడం న్యాయమే కానీ దాని కోసం విలువలైన సమయాన్ని ఇలా ఎదురు చూపులోనే గడపకూడదుగా.