iDreamPost
iDreamPost
కర్ణాటకలో భారతీయ జనతాపార్టీకి ఊపిరి పోసి.. నేటి స్థాయికి తీసుకొచ్చిన నేత బి.ఎస్.యడ్యూరప్ప అనడంలో సందేహం లేదు. ఇందులో ఆయన నాలుగు దశాబ్దాల శ్రమ ఉంది. రాష్ట్రంలో బీజేపీ అంటే యడ్యూరప్ప.. యడ్యూరప్ప అంటే బీజేపీ అన్నంతగా ఆయన పార్టీని ఓన్ చేసుకున్నారు. అంతే శ్రద్ధగా పార్టీని పొదివి పట్టుకొని పెంచి పోషించారు. అటువంటి నేతకు పార్టీతో పూర్తిగా బంధం తెగిపోయినట్లేనా?.. బీజేపీ అగ్ర నాయకత్వం పార్టీ అవసరాలకు కూడా ఆయన్ను వినియోగించుకోకుండా పక్కన పెట్టేయాలని నిర్ణయించుకుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం కర్ణాటకలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలు రేవుతున్నాయి. యడ్డీ అభిమానుల్లో ఆగ్రహం పెంచుతున్నాయి
బొమ్మై సారథ్యంలోనే ఎన్నికలకు…
గతంలోనూ యడ్యూరప్ప కాకుండా వేరే నేతలు సీఎంలుగా ఉన్నప్పటికీ పార్టీలో యడ్డీ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గేది కాదు. పార్టీ ఆయన కనుసన్నల్లోనే నడిచేది. రాష్ట్రానికి సంబంధించి జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా యడ్డీని తప్పనిసరిగా సంప్రదించేది. కానీ ప్రస్తుతం ఆ ప్రాధాన్యత లభించడం లేదని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. దాంతో పాటు దావణగేరిలో పర్యటించిన అమిత్ షా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సీఎం బొమ్మై నాయకత్వంలో ఎదుర్కొంటామని బహిరంగంగా ప్రకటించడం పార్టీలో పెద్ద చర్చకు తావిచ్చింది. పార్టీ వ్యవహారాల్లో ఇక యడ్డీ ప్రమేయం ఉండదని ఆయన చెప్పకనే చెప్పారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పర్యటనలో యడ్డీతో కలిసిన దాఖలాలు కూడా లేవు. అసలే సీఎం పదవి నుంచి బలవంతంగా తప్పుకునేలా చేశారన్న అసంతృప్తితో ఉన్న మాజీ సీఎంను తాజా పరిణామాలు, అమిత్ షా వ్యాఖ్యలతో మరింత అగ్రహానికి గురి చేస్తున్నాయి.
రాష్ట్ర యాత్రకు అనుమతి ఇస్తారా?
తన రాజకీయ వారసుడిగా కుమారుడు విజయేంద్రను ప్రొజెక్టు చేసేందుకు యడ్యూరప్ప రాష్ట్రవ్యాప్త యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కుమారుడికి కొత్త ప్రభుత్వంలో మంచి పదవి ఇవ్వాలన్న షరతుతో సీఎం పదవికి రాజీనామా చేసినా.. ఇచ్చిన మాటను అధిష్టానం విస్మరించడంతో.. విజయేంద్రను వెంటబెట్టుకొని యాత్ర చేయడం ద్వారా రాజకీయ భవిష్యత్తు కల్పించాలని యడ్యూరప్ప నిర్ణయించుకున్నారు. అమిత్ షా తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పర్యటనకు పార్టీ అనుమతి లభించడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే బీజేపీని, యడ్డీని వేరవేరుగా చూసే పరిస్థితి లేదు. పదవుల్లో ఉన్నా లేకపోయినా పార్టీ శ్రేణుల్లో ఆయన పట్ల విశ్వాసం, చరిష్మా ఇప్పట్లో పోయేవి కావు. ఎవరూ పోగొట్టలేరని పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేయగల నేతలు కూడా ఎవరూ లేరు. సీఎంలుగా పనిచేసిన జగదీష్ షెట్టర్, సదానంద గౌడలు సొంత జిల్లాలు దాటి ప్రభావం చూపలేరు. ప్రస్తుత సీఎం బొమ్మై పరిస్థితి కూడా అంతే. మరోవైపు కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటోంది. జేడీఎస్ కంటే కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా యడ్డీని పూర్తిగా పక్కన పెడితే తీవ్రంగా నష్టపోతామని బీజేపీ క్యాడర్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది.