iDreamPost
android-app
ios-app

హెర్డ్‌ ఇమ్యూనిటీ…కరోనాకు పరిష్కారమా…?

హెర్డ్‌ ఇమ్యూనిటీ…కరోనాకు పరిష్కారమా…?

కరోనాను ఎదుర్కొనేందుకు కొందరు ఓ వైపు వ్యాక్సిన్‌ పరిశోధనలో నిమగ్నమవ్వగా…మరి కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’విధానం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ను సడలించి ప్రజలను రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నం చేస్తే నవంబర్‌ నాటికి దేశంలో 60 శాతం మంది హెర్డ్‌ ఇమ్యూనిటీ పొందుతారనే అంచనాలు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలింతకీ ఈ హెర్డ్‌ ఇమ్యూనిటీ అంటే ఏమిటి? కరోనాపై పోరాటానికి అదెలా దోహదపడుతుంది అనే విషయాల గురించి ఓసారి చూద్దాం…

సామూహిక రక్షణ

హార్డ్ ఇమ్యూనిటీకి మరొక పేరే కమ్యూనిటీ ఇమ్యూనిటీ. ఒక సమాజంలో కనీసం 60 శాతం మంది ప్రజలు వ్యాధిని ఎదుర్కొనే శక్తిని పెంపొందించుకోవడాన్ని లేదా కలిగుండటాన్ని హెర్డ్‌ ఇమ్యూనిటీ అంటారు. ఇందులో టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఒక పద్ధతైతే, మరో విధానంలో ముందు అనారోగ్యానికి గురై కాలక్రమేణా సదరు రోగానికి సంబంధించిన నిరోధక శక్తిని పెంపొందించుకుంటారు.

స్వీడన్‌ ఓ ఉదాహరణ…

కరోనా వైరస్‌ కారణంగా యూరోప్‌లో చాలా భాగం లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు  స్వీడన్‌లో ప్రజా కార్యకలాపాలపై కనీస పరిమితి విధించారు. అంతేకాకుండా  పాఠశాలలు, వ్యాపారాల సంస్థలు తెరిచి ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ స్వీడన్‌ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. కాగా, హెర్డ్‌ ఇమ్యూనిటీ వల్ల ప్రస్తుతం సానుకూల ఫలితాలు పొందుతున్నట్లు స్వీడన్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించినట్లు ఇంగ్లిష్‌ మీడియా పేర్కొంది. ప్రస్తుతం స్వీడన్‌లో కరోనా కేసుల సంఖ్య నియంత్రణలో ఉన్నట్లు…దానికి హెర్డ్‌ ఇమ్యూనిటీయే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇదే పరిష్కారమా…

ఏ దేశమూ సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌లను భరించలేదు. భారతదేశం వంటి దేశాలకు ఇది మరింత కష్టం. కాబట్టి 20 నుంచి 60 ఏళ్లలోపు ప్రజలను వారి వారి కార్యకలాపాల్లో నిమగ్నం చేయాలనే సూచనలు వినిపిస్తున్నాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు హెర్డ్‌ ఇమ్యూనిటీని పెంపొందించుకోవచ్చని సూచిస్తున్నారు. భారత్‌ వంటి యువ జనాభా కలిగిన దేశాలకు హెర్డ్‌ ఇమ్యూనిటీ ప్రయత్నించే అవకాశం ఉన్నా…వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న ఇంగ్లండ్‌ వంటి దేశాలకు ఈ అవకాశం లే దు. ఇదే సమయంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ విధానంపై పలువురు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన టాస్క్‌ అంటూ హెచ్చరిస్తున్నారు.