iDreamPost
android-app
ios-app

గంగతాతరాజు కుటుంబం ఏం చెయ్యబోతోంది?

గంగతాతరాజు కుటుంబం ఏం చెయ్యబోతోంది?

బీజేపీ మాజీ ఎంపీ గోగరాజు గంగరాజు కుటుంబం వైసీపీలోకి వెళ్లనుందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. వెంటనే గంగరాజు ఆ వార్తలను ఖండించారు కూడా.. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యంత బలమైన క్షత్రియ సామాజికవర్గానికి చెందిన గంగరాజు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలవారికి గంగతాతరాజుగా సుపరిచయం..

గంగరాజు విశ్వహిందూ పరిషత్ తరపున దశాబ్ధాల కాలంగా జిల్లాలో పలు కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను జిల్లాలో ప్రారంభించింది, స్వాములను పీఠాధిపతులను జిల్లాకు తీసుకురావడం ప్రారంభించింది గంగరాజే . గంగరాజు మొదటినుంచీ బీజేపీకి సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. దేశవ్యాప్తంగా గంగరాజు కుటుంబానికి అనేక వ్యాపారాలున్నాయి. “లైలా గ్రూప్” ఆఫ్ ఇండ్రసీస్, కెమికల్ వ్యాపారాలు, డెల్టా పేపర్ మిల్స్, ఏపీ తెలంగాణతో పాటు గోకరాజు గంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలు, తల్లితండ్రుల పేరుతో వీకేడీవీ కళాశాలను నడుపుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుండి నడిపుతున్నారు. విద్యావేత్తగా, వ్యాపారవేత్తగా గంగరాజుకు మంచిపేరుంది. బీసీసీఐ సౌత్ జోన్ వైస్ ప్రెసిడెంట్ గానూ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లో మెంబర్ గానూ పనిచేసారు.

2014లో ఆయన నరసాపురం పార్లమెంట్ స్థానంనుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఆయనకు టీటీడీ మాజీ చైర్మన్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు స్వయానా బావమరిది అవుతారు. ప్రస్తుత ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజుకు బాపిరాజుకు చిన్నాన్న అవుతారు. అంటే రఘురామకృష్ణంరాజుకు గంగరాజు మావయ్య వరస అవుతారు. అయితే 2019లో కొన్ని కారణాలో గంగరాజు బరిలోకి దిగలేదు. 2019లో రఘురామకృష్ణంరాజు ఇక్కడినుంచి వైసీపీ టికెట్ పై గెలిచారు. గత కొద్దికాలంగా గంగరాజు ఆరోగ్యం అంతగా బావుండడంలేదట.. కృష్ణానది కరకట్టపై గల గెస్ట్ హౌస్ లో ఆయన మొన్నటివరకూ చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకున్నారు. గంగరాజుకు కరకట్టపై గెస్ట్ హౌస్ ఉందా.. ప్రముఖ ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజు నడుపుతున్న ఆశ్రమం కూడా గంగరాజుదే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, దేశ హోంమంత్రి అమిత్ షా గతంలో కరకట్టలోని గంగరాజు గెస్ట్ హౌస్ కు వచ్చారు. అలాగే ఎంపీ కాకముందునుంచే ఆయన వీహెచ్ పీ ద్వారా అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

తాజాగా గంగరాజు కుమారుడు రామరాజుతోపాటు ఆయన సోదరుడు నరసింహరాజు కూడా వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. గంగరాజు మాత్రం తాను బీజేపీలోనే కొనసాగనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. అయితే బీజేపీకి పునాదులైన విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన గంగరాజు పార్టీని వీడతారా అంటే ఆ నిర్ణయం అంత వేగంగా తీసుకుంటారనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే గంగరాజు బీజేపీ కంటే ముందు నుంచే ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీలతో అనుబంధం కలిగి ఉన్నారు. అయితే స్థానికంగా మాత్రం గంగరాజు పార్టీని వీడలేపోయినా ఆయన సోదరుడు, కుమారుడు మాత్రం పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. వ్యాపారపరంగా, రాజకీయంగా బీజేపీలో ఉండేకంటే వైసీపీలోకి వెళ్లడం బెటరనే ఆలోచనతో వారున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు జిల్లా వైసీపీ శ్రేణులు మాత్రం వివాదరహితుడిగా, విద్యావేత్త, వ్యాపారవేత్తలు అయిన గంగరాజు కుటుంబం వైసీపీలో చేరితే పార్టీకి మరింత లాభిస్తుందని చెప్తున్నారు. గంగరాజు కుటుంబం నుంచి ఎవరు వచ్చినా స్వాగతిస్తామంటున్నారు.