iDreamPost
android-app
ios-app

ప్రగతిని చూసి ఓర్వ ‘లేఖ’ ఆనందబాబు అభాండాలు

  • Published Feb 16, 2022 | 8:17 AM Updated Updated Feb 16, 2022 | 8:17 AM
ప్రగతిని చూసి ఓర్వ ‘లేఖ’ ఆనందబాబు అభాండాలు

ఒక పాత సినిమాలో కమెడియన్ శ్రీలక్ష్మికి గతం గుర్తుకు వచ్చి ఎవరెదురైనా తన చిన్ననాటి నుంచి జరిగిన సంఘటనలను ఏకరువు పెట్టి వేధిస్తుంది! టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ధోరణి అలాగే ఉంది. ఆయన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. అందులో గంజాయి, డ్రగ్స్, మద్యం అమ్మకాలు, మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, జూద క్రీడలు అంటూ అనేక అంశాలను ప్రస్తావించారు. వాటికి, అధికార పార్టీ నేతలకు లింకులు పెట్టి విమర్శలు గుప్పించారు. గత రెండు మూడు నెలలుగా టీడీపీ నాయకులు చేసిన నిరాధార ఆరోపణలనే ఆనందబాబు తన లేఖలో ఉటంకించారు.

ఒకేసారి మొత్తం పబ్లిసిటీ కొట్టేయాలనా?

రోజుకో అబద్దాన్ని పట్టుకొని తమ మీడియాలో రచ్చ చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ప్రచారం పొందాలని టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారు. దానికి భిన్నంగా వారందరూ చేసిన ఆరోపణలను గుదిగుచ్చి సీఎంకు లేఖ రాసి ఒకేసారి మొత్తం పబ్లిసిటీ కొట్టేయాలని ఆనందబాబు ప్రయత్నిస్తున్నారా? అని వైఎస్సార్ సీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలో రూ. 9,251 కోట్ల విలువైన 2 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కాల్చివేశామని పోలీసులు ప్రకటించారు. దీంతో గంజాయి స్మగ్లర్లను ప్రభుత్వం వెనకేసుకొస్తోంది అని ఇన్నాళ్లు టీడీపీ నేతలు చేసింది దుష్ప్రచారం అని తేలిపోయింది. దీన్ని కప్పిపుచ్చడానికి.. కేవలం దొరికిన గంజాయి ఇంత ఉంది అంటే ఇక దొరకని గంజాయి ఎన్ని లక్షల కిలోల్లో ఉంటుందని ప్రశ్నించడం టీడీపీ దివాలాకోరుతనానికి ప్రతీకగా ఉందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. గతంలో విశాఖ మన్యంలో కేవలం వందల ఎకరాల్లో జరిగే గంజాయి సాగు వైఎస్సార్ సీపీ పాలనలో 15 వేల ఎకరాలకు విస్తరించింది అంటున్న ఆనందబాబు ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు చెబుతున్నారు? ఆయన చెప్పినదే నిజమైతే ఎక్కడెక్కడ సాగు చేశారో చెబితే పోలీసులు చర్యలు తీసుకుంటారు కదా అని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. 

ఇదేం పద్దతి?

అక్రమ సంపాదన కోసం వైఎస్సార్ సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్ మాఫియా, జూద క్రీడల్ని పెంచిపోషించటం వాస్తవం కాదా? అని ఆనందబాబు వేసిన ప్రశ్నలోనే అది అవాస్తవం అన్నది అర్థం అవుతోంది. అందుకు అధారాలు ఉండి, ఆయన చేసిన ఆరోపణలే నిజమైతే తీరుబడిగా ముఖ్యమంత్రికి లేఖ రాస్తారా? ఈ పాటికీ తమ పచ్చ మీడియాలో రచ్చ చేయకుండా ఉంటారా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రూ. 9,251 కోట్ల విలువైన 2 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కాల్చి వేస్తే పోలీసుల పనితీరును, ప్రభుత్వ నిబద్ధతను మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు. ఇలా బురద జల్లడం పద్దతిగా లేదని అంటున్నారు. ప్రతిపక్షం అంటే ఎంతసేపూ విమర్శలు చేయడమే కాదు. సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు అన్న సంగతి టీడీపీ నేతలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తమ ప్రభుత్వం ఒక్కో రంగంలో సాధిస్తున్న ప్రగతిని చూసి ఓర్వలేక నక్కా ఆనందబాబు ఈ లేఖ రాశారని వైఎస్సార్ సీపీ నేతలు తప్పుపడుతున్నారు.

Also Read : ఇన్నాళ్లూ లేని శ్రద్ద ఇప్పుడెందుకు?