గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే.. ఈ పేరు రెండు నెలల క్రితం దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. పోలీస్ అధికారుల బృందంపై అర్ధరాత్రి గడచిన తర్వాత వికాస్‌దూబే గ్యాంగ్ తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 8 మంది పోలీసులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రాతో పాటుగా ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు.
చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బీతూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అనంతరం ఉజ్జయినిలోని ఓ ఆలయం వద్ద వికాస్‌దూబేను అరెస్ట్ చేసిన పోలీసులు కాన్పూర్ కి తీసుకువస్తుండగా జరిగిన ప్రమాదంలో వికాస్‌దూబే తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎన్‌కౌంటర్ చేసి గ్యాంగ్‌స్టర్ హతం అయినట్లు ప్రకటించడంతో వికాస్‌దూబే చరిత్ర ముగిసిందని అందరూ భావించారు. కానీ చనిపోయిన తర్వాత కూడా వికాస్‌దూబే తన గ్రామ ప్రజలకు కునుకులేకుండా చేస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని బిక్రూ గ్రామ ప్రజలకు రాత్రైతే చాలు భయపడి వణికిపోతున్నారు.చీకట్లో ఇంటి నుండి బయటకు రావడానికి ఏ ఒక్కరూ ఇష్టపడటం లేదు. దానికి కారణం మాత్రం వికాస్‌దూబే అని చెబుతున్నారు. అదేంటీ వికాస్‌దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి మట్టుబెట్టారు కదా.. ఇప్పుడు అతని గురించి భయపడటం దేనికి అని ఎవరైనా ప్రశ్నిస్తే అతను దెయ్యమై బిక్రూ గ్రామంలో తిరుగుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు.
వికాస్ దూబే ఎన్‌కౌంటర్ తర్వాత అతడి ఇంటిని ప్రభుత్వం కూల్చివేసింది. కానీ ఆ కూలిన ఆ ఇంటి గోడల మీద వికాస్ దూబే కూర్చొని ఉండటం కళ్లారా చూశామని గ్రామస్తులు చెప్పడం గమనార్హం. రాత్రి అయితే చాలు తుపాకీ శబ్దాలు వినిపిస్తున్నాయని కొందరు చెబుతుంటే మరికొందరు గ్రామస్తులు మాత్రం వికాస్ దూబే తన ఇంటి శిథిలాలపై కూర్చుని ఉండగా చూసామని చెబుతున్నారు.
ఆ ఇంటి శిథిలాల నుండి మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయని వికాస్ దూబే ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వెల్లడించడం గమనార్హం. అతని ఆత్మ ప్రతీకారం కోరుకుంటుందని బిక్రూ గ్రామప్రజలు విశ్వసిస్తున్నారు.దీంతో వికాస్ దూబేతో పాటు చనిపోయిన పోలీసుల ఆత్మశాంతి కోసం విజయదశమి నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక పూజలు చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. కానీ అదే గ్రామంలో గస్తీ కాస్తున్న నలుగురు పోలీసులు మాత్రం అవన్నీ కట్టు కథలన్నీ కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా వికాస్ దూబే దెయ్యం అయ్యాడని నమ్ముతున్న వారే అధికంగా ఉండటం గమనార్హం. విజయదశమి ఉత్సవాలలో శాంతి పూజలు నిర్వహించిన అనంతరం అయినా గ్రామస్తుల భయం తగ్గుతుందో లేదో వేచి చూడాలి.