iDreamPost
android-app
ios-app

జ‌నసేన గుర్తు గాజు గ్లాసేనా..?

జ‌నసేన గుర్తు గాజు గ్లాసేనా..?

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో శ్రీ‌@PawanKalyan గారి స్ఫూర్తితో, తొలిసారిగా పోటీ చేస్తున్న @JanasenaParty అభ్య‌ర్థులను గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాల‌ని, తెలంగాణ‌లో ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల్సిందిగా ప్రార్థ‌న….

తెలంగాణ‌లో జ‌రుగుతున్న మినీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ చేసిన ట్వీట్ ఇది. ఇందులో చెప్పుకోద‌గ్గ విశేషం ఏముంది.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌మ పార్టీ గుర్తుపై ఓటేసి గెలిపించాల‌ని కోర‌డం మామాలే క‌దా అనుకోవ‌చ్చు. కానీ, తెలంగాణ జనసేన ‘గాజు గ్లాస్’ గుర్తు ఎప్పుడో కోల్పోయింది.
ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టాక ఎన్నికల్లో పోటీచేయాలి.. పోటీచేశాక కనీసం ఈసీ నిర్ధేశించినన్నీ ఓట్లు సీట్లు గెలవాలి. అప్పుడే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ దరఖాస్తుచేసుకున్నప్పుడు కేటాయించిన గుర్తును దానికే ఇస్తుంది. మరో పార్టీకి ఇవ్వదు. కానీ, తెలంగాణ‌లో జ‌న‌సేన ఇప్ప‌టి వ‌ర‌కూ పోటీ చేయ‌లేదు క‌నుక దానికి ఉమ్మ‌డి గుర్తు ఇవ్వ‌లేమ‌ని ఈసీ ఎప్పుడో చెప్పేసింది. మ‌రి అలాంట‌ప్పుడు గాజుగ్లాసు గుర్తుకే ఓటేయాల‌ని ఎలా కోరుతున్నార‌నేది ప్ర‌శ్న.

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇప్పుడు లేదు. మున్నిప‌ల్ ఎన్నికల్లో అదే గుర్తు వస్తుందన్న గ్యారెంటీ లేదు. స్వతంత్ర అభ్య‌ర్థుల‌కు వచ్చినట్టే ఏదైనా గుర్తును ఈసీ కేటాయించ వ‌చ్చు. ఒక వేళ‌.. అదృష్టం క‌లిసి వ‌స్తే గాజు గ్లాసు రావొచ్చు కూడా. కానీ అది అనుమాన‌మే. మ‌రి అలాంట‌ప్పుడు గుర్తు కేటాయించాక జనసేన పార్టీ ప్రచారం చేసుకుంటే బెటర్ అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన జనసేన కేవలం 1 అసెంబ్లీ స్థానం మాత్రమే గెలిచింది. ఈసీ నిర్ధేశించిన ఓట్ల శాతాన్ని పొందలేదు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చింది. దీంతో జనసేన నుంచి గాజు గ్లాసు గల్లంతైంది. తిరుపతి ఉప ఎన్నికల్లో మరో అభ్యర్థిగా ఈ గుర్తును కేటాయించింది. తెలంగాణలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చి జనసేన వైదొలగడం ఆ పార్టీకి శరాఘాతమైంది. దీంతో తెలంగాణ ఎన్నికల సంఘం కూడా జనసేన గాజు గ్లాస్ గుర్తును రద్దు చేసింది.

తాజాగా గ్రేటర్ వరంగల్ ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీచేస్తోంది. అయితే యథాలాపంగా జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసింది. ‘తొలిసారిగా పోటీచేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులను ‘గాజు గ్లాసు’ గుర్తుపై ఓటేసి గెలిపించాలని.. తెలంగాణ ప్రజల కోసం పనిచేసే జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని’ పిలుపునిచ్చింది. ట్విస్ట్ ఏంటంటే తెలంగాణలో అసలు జనసేన గుర్తింపు పొందిన పార్టీ కాదు.. ఎందుకంటే సరియైన ఓట్లు సీట్లు ఇంతవరకు ఆ పార్టీ తెచ్చుకోలేదు. దీంతో కామన్ గుర్తు అయిన గాజు గ్లాస్ ఆ పార్టీకి దక్కదు. గత ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10శాతం సీట్లకు పోటీచేయని కారణంగా జనసేనతోపాటు పలు పార్టీలు గుర్తులను కోల్పోయినట్టు తెలంగాణ ఎస్ఈసీ ప్రకటించారు. 2025 నవంబర్ వరకు ఆ పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత కూడా లేదు. దీంతో ఆ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. జ‌న‌సేన కు గ్లాస్ సింబ‌ల్ లేదు క‌దా.. మ‌రి గాజు గ్లాసుకు ఓటు వేయమంటున్నారు ఏంటి.. పలువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు