నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశ రాజధానిలో అన్నదాత ఆగ్రహాన్ని ప్రకటిస్తున్నాడు. ఒక్కరిద్దరు కాదు లక్షలాది మంది ఎనిమిది రోజులుగా ఎముకలు కొరికే చలిలో నిరీక్షిస్తన్నారు. ఇప్పటికే నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు.
చర్చల పేరుతో చేసిన నామమాత్రపు ప్రయత్నాలు ఫలించకపోవడంతో రైతుల ఆందోళనపై తప్పుడు ప్రచారానికి తెరతీసింది బీజేపీ. అయినా… అడుగు వెనక్కి తగ్గేది లేదంటూ ఢిల్లీ సరిహద్దుల్లోనే భీష్మించుకు కూర్చున్నారు రైతులు. హర్యానా ఢిల్లీలను కలిపే ఐదు రహదారులను దిగ్భంధం చేశారు. ఇంతకూ రైతులు చేస్తున్న ఈ పోరాటం పాలకులపైనా? లేక ప్రైవేటు కంపెనీలపైనా?
పాలక విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన దేశ రైతాంగం చారిత్రాత్మక పోరాటాన్ని నమోదు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం మాత్రమే కాదు. రైతుల పొట్టలుగొట్టి కోట్లకు కోట్లు పోగుజేసుకుంటున్న కార్పోరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. ఒక్కమాటలో చెప్పాలంటే అంబానీ, అదానీల అగ్రో బిజినెస్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. ఇది అక్షరాలా నిజం.
దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన పాలకులంతా కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే పనిచేశారు. సంస్కరణల పేరుతో రైతాంగం నడ్డి విరిచే విధానాలను ప్రవేశపెట్టారు. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు కూడా కార్పోరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేవే అంటున్నాయి వ్యవసాయ సంఘాలు.
తాజా చట్టాల ప్రకారం నిత్యావసర వస్తువుల నిల్వలపై ఎలాంటి పరిమితులూ ఉండవు. రైతులు సుదీర్ఘకాలం పంటను స్టోర్ చేసుకోలేరు కనుక, ఆ పాత్రను బారీ కార్పోరేట్ కంపెనీలు పోషించనున్నాయి. రిలయెన్స్, అదానీ లాంటి సంస్థలు అందు పోటీ పడతాయి. రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చనే వెసులుబాటు కూడా మధ్య దళారులు, కార్పోరేట్ సంస్థలకే లాభం చేకూర్చుతుంది. ఇక కాంట్రాక్టు ఫార్మింగ్ తో రైతులు పూర్తిగా కంపెనీల గుప్పిట్లో పావులుగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెప్పిన పంటలు, ఎరువుల్నే రైతులు వినియోగించాల్సి ఉంటుంది. మొత్తంగా కొత్త వ్యవసాయ చట్టాలు ఏరకంగా చూసినా రైతులకు మేలు చేసేవి కావు. ప్రభుత్వం ఈ చట్టాలు చేయడానికి ముందే కార్పోరేట్ కంపెనీలు రంగం చేసుకున్నాయి. భారీ గిడ్డంగులను నిర్మించుకున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులపై బారీ పెట్టుబడులు పెట్టాయి. తాజా చట్టాలతో రైతుల మెడకు ఉరిబిగించడమే మిగిలింది. ఈ ప్రమాదాన్ని గమనించిన రైతాంగం వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తోంది. అంటే… కార్పోరేట్ దోపిడీని తిరస్కరిస్తోంది.
కార్పోరేట్ దోపిడీ
రిలయెన్స్, అదానీ లాంటి సంస్థలు దేశంలోని అన్నిరంగాలను తమ అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వడ్డించే వాడు మనవాడవ్వాలి కానీ… బంతిలో ఏ చివర కూర్చుంటేనేమి? మోదీ సర్కారుకు కార్పోరేట్ కంపెనీలకు ఉన్న దోస్తాని అలాంటిదే. దేశంలో ఏమూలన ఏసంపద ఉన్నా సరే కార్పోరేట్ కంపెనీల విస్తర్లోకి చేరిపోతుంది. అంబాని రిలయెన్స్ ఫ్రెష్ నుంచి జియో ఫైబర్ వరకు అన్ని రంగాల్లోనూ పట్టు బిగించడం వెనకగల కారణం ఇదే. అదానీ ఎంటర్ ప్రైజెస్ సైతం అందుకు పోటీ పడుతోంది. ప్రస్తుతం ఎనర్జీ, మైనింగ్, గ్యాస్, పునరుత్పాదక, రక్షణ, వ్యవసాయ వస్తువుల తయారీ రంగాల్లో పనిచేస్తోంది. రైతుల నుంచి ధాన్యం, కూరగాయలను నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి, కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగుల్లో భద్రపరిచి వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించడంపై ఇప్పుడీ సంస్థలు దృష్టిసారించాయి. కొత్త వ్యవసాయ చట్టాలు అందుకు మరింత వెసులు బాటు కల్పించనున్నాయి.
నిజానికి ఈ రెండు సంస్థలే కాదు… టాటా, వేదాంత ఇలా అనే కార్పోరేట్ వ్యాపార సంస్థలు దేశంలోని సహజ సంపదపై కన్నేశాయి. ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టి అక్కడి ఖనిజ సంపదను కొల్లగొడుతున్నాయి. చత్తీస్ గడ్ లో మైనింగ్ పేరిట అదానీ కంపెనీ చేస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా ఆదివాసీలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. అయినా… ప్రభుత్వాల అండతో లక్షల టన్నుల ఖనిజాలను కొల్లగొడుతూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతోంది ఆ సంస్థ. దేశంలోనే కాదు… విదేశాల్లోనూ పాగాపాతిన ఈ కార్పోరేట్ సంస్థలను ప్రపంచ దేశాల ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు.
5వేల కోట్ల అప్పు
భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో ఓ బొగ్గు గనిని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. ఆ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూరుతుందనీ, భారీ స్థాయిలో గ్రీన్ హౌజ్ వాయువులు విడుదలవుతాయనీ ఆ ప్రాజెక్టును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అదానీ గ్రూప్ నిర్మించ తలపెట్టిన బొగ్గుగని అంచనా వ్యయం దాదాపు రూ. 81 వేల కోట్ల అంచనాతో నిర్మించ తలపెట్టిన బొగ్గుగని కోసం ఇప్పటికే పరిసరాల్లో వేలాది ఎకరాల వ్యవసాయ భూములను సేకరించింది ఆ సంస్థ. ప్రజల నిరసన కారణంగా ఆ సంస్థకు నిధుల సేకరించడం కష్టంగా మారడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఎస్ బీ ఐ నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎవరి డబ్బు ఎవరు ఎవరికి ఇస్తున్నారనే ప్రశ్నమొదలైంది.
తాజాగా సిడ్నిలో జరిగిన ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు స్టాప్ అదానీ అని నినాదాలు చేస్తూ గ్రౌండ్ లోకి ప్రవేశించారు. అదానికి ఎస్ బీ ఐ రుణం ఇవ్వద్దంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో అదానీ సంస్థ చేస్తున్న నష్టాలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే కార్పోరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను అర్థం చేసుకోవల్సి ఉంది.
మొత్తంగా సమస్తరంగాలను తమ గుప్పిట పెట్టుకోవాలనుకుంటున్న కార్పోరేట్ సంస్థలకు వ్యతిరేకంగా బలమైన గళాన్ని విప్పింది భారతదేశ రైతాంగం. నూతన వ్యవసాయ చట్టాల పేరుతో దేశానికి వెన్నుముకగా చెప్పుకునే వ్యవసాయాన్ని కంపెనీలకు తాకట్టుపెట్టడాన్ని రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందుకోసం ప్రాణాలను కూడా లెక్కచేయడంలేదు. మూడవ దఫా రైతుల సంఘాలతో చర్చించనున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి.