iDreamPost
android-app
ios-app

Kamineni Srinivas – మాజీ మంత్రి గారు పాలిటిక్స్ కంటే సినిమాలే బెటరనుకుంటున్నారా?

Kamineni Srinivas – మాజీ మంత్రి గారు పాలిటిక్స్ కంటే సినిమాలే బెటరనుకుంటున్నారా?

ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఏంటో కొందరు నేతలను చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆయ‌నో మాజీ మంత్రి… గ‌త ప్ర‌భుత్వంలో టీడీపీతో బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. అలాంటి నేత అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారో? ఎక్కడ ఉన్నారో? ఏమీ అర్థం కావడం లేదు. పార్టీలో మంత్రిగా చ‌క్రం తిప్పిన చోటే ఇప్పుడు అసలు లేక్కలోనే లేకుండా పోయారు. ఆ మాజీ మంత్రి ఎవ‌రో ఇప్పటికే అర్ధం అయ్యే ఉంటుంది కదూ, ఆయన మరెవరో కాదు కృష్ణా జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడిగా ఉన్న కామినేని ఆ త‌ర్వాత పుట్టుకొచ్చిన ప్ర‌జారాజ్యంలో చేరి చిరంజీవి పుణ్యమా అని వయా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న బీజేపీలో చేర‌డం వెన‌క చంద్ర‌బాబు ఉన్నారని, అలా ఆయనకు బీజేపీ కోటాలో మంత్రి పదవి కూడా దక్కేలా చేశారనే టాక్ ఉంది.

ఆ సంగతి ఎలా ఉన్నా గ‌త కొంత కాలంగా ఆయ‌నకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదు, దీంతో ఆయన కూడా నాకెందుకులే అన్నట్టు సైలెంట్ అయిపోయారు. కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ సమయాన అడపాదడపా కనిపించిన కామినేని సోము వీర్రాజు అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయారు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను ప‌ద‌వి నుంచి దించేసిన‌ సమయాన అనూహ్యంగా ఆ అంశంపై కామినేని హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో పాటు ఆయ‌న ఓ హోట‌ల్లో నిమ్మ‌గ‌డ్డ‌ను క‌లిసిన ఫుటేజ్ కూడా బ‌య‌టకు రావడం కలకలం రేపింది. అయినా సరే ఆయన మీడియా ముఖంగా వచ్చి క్లారిటీ ఇచ్చింది కూడా లేదు. బీజేపీ అధినాయకత్వం ఆమోదంతోనే తాను హైకోర్టులో పిటిషన్ వేశానని కామినేని శ్రీనివాస్ ప్రెస్ నోట్లు అయితే వదిలారు.

కానీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం మాకు సంబంధం లేదన్నారు. ఒకరకంగా చెప్పాలంటే సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడు అయిన నాటి నుంచి కామినేని శ్రీనివాస్ జాడ కనిపించడం లేదు. రాజకీయంగా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఆయన సినిమాల మీద దృష్టి పెట్టారు. శ్రీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘దర్జా’ అనే సినిమా చేస్తున్నారు. సలీం మాలిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు నిర్మాతగా ఆయన అనుచరుడు పైడిపాటి శివశంకర్ వ్యవహరించనున్నారు. ఇక బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ అగ్రనేతలు, ఏపీ నుంచి రాజ్యాంగ పదవులకు వెళ్ళిన వారు ఏపీ వస్తే వారిని రిసీవ్ చేసుకుంటూ గడిపేస్తున్నారు. ఎలాగూ బీజేపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారన్నమాట.

Also Read :TDP BJP Alliance -బాబుతో పొత్తుకు బీజేపీ సిద్ధం అవుతుందా?