ఆంధ్రప్రదేశ్ లో అమాతంగా నేరాలు పెరిగిపోయాయా…
జగన్ పాలనలో ఏపీ నేరాలకు నిలయంగా తయారయ్యింది. రాష్ట్రమంతా పెరిగిన నేరాల సంఖ్య ఏమి చెబుతోంది. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనని పచ్చ మీడియా సూత్రీకరణలు చేసేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయనే సంకేతాలిచ్చేందుకు యత్నించింది. కానీ వాస్తవాలేంటన్నది పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడక తప్పదు.
ఏపీలో నిత్యంలో ఏదో సాకు చూపించి ప్రభుత్వం మీద బురదజల్లడానికి బాబు జేబు మీడియా అలవాటుపడిపోయింది. ఆ క్రమంలోనే తాజాగా ఎన్ సీ ఆర్ బీ లెక్కలను పట్టుకుని ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే కొన్ని వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టే యత్నం చేసింది. అర్థసత్యాలతో రాష్ట్ర ప్రజలను వంచించే కుయత్నానికి దిగింది.
ఏపీలో 2019 లెక్కల ప్రకారం 1,19,228 కేసులు నమోదయ్యాయి. అదే 2020 వచ్చే సరికి 1,88,997కి పెరిగిపోయాయి. ఈ లెక్కలు మాత్రమే చెబితే ఎవరికైనా పచ్చ మీడియా చెప్పినట్టుగా 80 శాతం పెరుగుదల కనిపిస్తుంది. పైగా జాతీయ సగటు కన్నా చాలా ఎక్కువ కావడంతో ఆశ్చర్యపడాల్సి ఉంటుంది. అయితే అసలు నిజం ఏమిటంటే అందులో 88,377 కేసులు కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నమోదయిన ఛోటామోటా కేసులు కావడం విశేషం. వాటిని తీసేస్తే 2020లో నమోదయి రెగ్యులర్ కేసులు 1,00,620మాత్రమే. అంటే 2019 తో పోలిస్తే సుమారు 15 శాతం తగ్గుదల కనిపిస్తోంది. కానీ కరోనా సమయంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై నమోదయిన వివిధ కేసుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చేసిన ప్రయత్నం ఆశ్చర్యంగా కనిపించకమానదు. కానీ అది వారికి అలవాటు అన్నది గ్రహించాల్సి ఉంంది.
ఇక తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్యలోనూ ఏపీలో పెరుగుదల ఉందన్నట్టుగా సదరు మీడియా సూత్రీకరించింది. వాస్తవానికి కేసులు పెరిగిన మాట వాస్తవమే గానీ అవి ఇసుక, మద్యం అక్రమ రవాణాని అడ్డుకోవడం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో నమోదు చేసిన కేసులే కావడం విశేషం. ఏపీలో 2019తో పోలిస్తే గత ఏడాదిలో ప్రోహిబిషన్ యాక్ట్ కేసులు 322 శాతం, ఎక్సైజ్ యాక్ట్ కేసులు 204 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో బెల్ట్ షాపుల నియంత్రణ, అక్రమ ఇసుక తవ్వకాలు అరికట్టేందుకు తీసుకున్న ఈ చర్యల పలితం ఇట్టే అర్థమవుతుంది. కానీ ప్రజలను మాత్రం మభ్యపెట్టే లక్ష్యంతో అర్థ సత్యాలు చెప్పడంలో సిద్ధహస్తులయిన సదరు మీడియా చేసిన సూత్రీకరణలు ఆశ్చర్యంగా ఉంటాయి.
ఏపీలో విభాగాల వారీగా చూస్తే మర్డర్లు 2 శాతం తగ్గాయి. మహిళలపై దాడుల్లో నమోదయిన కేసులు 4 శాతం, ఎస్సీ, ఎస్టీల మీద దాడుల్లో 3 శాతం, కిడ్నాపులు 18 శాతం, రోడ్డు ప్రమాదాలు 13 శాతం తగ్గగా సైబర్ క్రైమ్ నేరాలు మాత్రం ఒక శాతం పెరిగాయి. దోపిడీలు 24 శాతం, దొంగతనాలు 16 శాతం నమోదయినట్టు ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. ఇవన్నీ అధికారిక లెక్కలే అయినప్పటికీ వీటిలో సగం భాగం మాత్రమే ప్రచారం చేయడం ద్వారా ఏపీలో నేరాల సంఖ్య విస్తృతంగా పెరిగిందనే అపోహలు కల్పించేయత్నం ఆ మీడియా నిరంతర ప్రక్రియలో భాగంగా చూడాల్సి ఉంటుంది. ఇలాంటి కుట్ర పూరిత కథనాల వెనుక అసలు వాస్తవాలు జనం గ్రహిస్తున్నారనే సంగతి వారికి తెలియాల్సి ఉంటుంది.