iDreamPost
android-app
ios-app

కబ్జాకోరులకు అండగా ఏపీ సీపీఐ?

  • Published Oct 26, 2020 | 9:29 AM Updated Updated Oct 26, 2020 | 9:29 AM
కబ్జాకోరులకు అండగా ఏపీ సీపీఐ?

కమ్యూనిస్టులు అంటే ఎవరు? శ్రామిక వర్గానికి అండగా, వర్గ రహిత సమాజం కోసం పాటుపడే సమూహంగా, ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రభుత్వాలపై, వ్యక్తులపై పోరు సలిపి బడుగులకు అండగా నిలిచే వారిగా మాత్రమే తెలుసు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్టులం అని చెప్పుకునే సీపీఐ పార్టీ తీరే వేరు. రాష్ట్రంలో ఆ పార్టీకి నాయకత్వం వహించే వారి రహస్య సిద్దాంతాల కారణంచేత ఇప్పటికే ఆ పార్టీ మనుగడే రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో తాజాగా వారు అవలంబిస్తున్న తీరు చూస్తే సిపీఐ ప్రజల పక్షమా లేక కబ్జాకోరుల పక్షమా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అయ్యే పరిస్థితి వచ్చింది.

రాష్ట్రంలో కమ్యూనిస్టులం అని చెప్పుకునే సీపీఐ పార్టీ వారి ద్వంద వైఖరికి ఆ పార్టీ నాయకులైన నారాయణ, రామకృష్ణ గీతం భూ ఆక్రమణ వ్యవహారంలో ఇచ్చిన స్టేట్మెంట్లను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. విశాఖలో ప్రైం ఏరియాలో గీతం విశ్వ విద్యాలయం సుమారు 2వేల కోట్లు విలువ చేసే 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని అధికారులు నిర్ధారించటంతో రెవెన్యు, పోలీసు అధికారుల సమక్షంలో ఆ భూమిలో గీతం వారు నిర్మించిన అక్రమ కట్టడాలని కూల్చి అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం భూమిని తెలుగుదేశం నేత అయిన గీతం యాజమాన్యం ఆక్రమించుకుంటే , ఆ భూమిని జగన్ ప్రభుత్వం తిరిగి స్వాధీన పరుచుకుని ప్రజలకి సంబంధించిన ఆస్తిని పరిరక్షించారు.

ఇలా ప్రజల ఆస్థిగా పరిగణించే ప్రభుత్వ భూమిని కబ్జా కోరులనుండి ప్రభుత్వం రక్షించడాన్ని ప్రజలందరు ముక్త కంఠంతో హర్షిస్తుంటే రాష్ట్రంలో సీపీఐ పార్టీకి మాత్రం తీవ్ర ఆవేదన కలుగుతున్నట్టు ఉంది. కమ్యూనిస్టు సిద్దాంతం ప్రకారం ప్రజల ఆస్తిని కబ్జాకోరుల నుండి రక్షించిన ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది పోయి తిరిగి ప్రభుత్వంపైన రాళ్ళు వేయడం రాష్ట్రంలో ఉన్న సీపీఐ పార్టీకే చెల్లింది. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాటలు చూస్తే కబ్జా చేసిన గీతం మూర్తికి అనుకూలంగా ,భూమిని కబ్జా కాకుండా చూసిన ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వం గీతం మూర్తిపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పడంతో ఆ పార్టీ నేరుగా కబ్జాకోరులకి బహిరంగంగానే మద్దతు ఇచ్చినట్టు అయింది.

నేడు గీతం భూ కబ్జాని సమర్దిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనిని కక్షపూరితంగా నిర్వచిస్తున్న ఈ పార్టీ నాయకుడే 2017 సంవత్స్రంలో అదే విశాఖలో కొమ్మాది ప్రాంతంలో భూ కబ్జాలు జరిగాయి అంటూ సదరు భూమిలో ఉన్న ప్రహరీ గోడలను తన్ని చివరికి కాలికి గాయం కూడ చేసుకున్నారు. భూ ఆక్రమణలపై నాడు ఉన్న శ్రద్ద నేడు సీపీఐ పార్టీకి లేకపొవడానికి కారణం నేడు గీతం ముసుగులో భూ ఆక్రమణకు పాల్పడిన వ్యక్తి తమ రహస్య మిత్ర పార్టీ అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు బంధువు కావడమే అనే వాదన వినిపిస్తుంది. కమ్యూనిస్టులం అంటూ కమ్యూనిస్టుల సిద్దాంతానికే తూట్లు పోడుస్తున్న ఇటువంటి సీపీఐ నాయకులు ఉన్నంత కాలం రాష్ట్రంలో కమ్యూనిస్టు అంటే తెలుగుదేశం పార్టి బీటీం సభ్యుడుగానే ప్రజలు పరిగణిస్తారని చెప్పడంలో సందేహంలేదు.